సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ కారణంగా నగరంలో హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ యాప్స్ పని చేయట్లేదు. అయినప్పటికీ ఫుడ్ రోడ్ డెలివరీ పేరుతో శ్రీనగర్‌కాలనీ వాసి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.40 వేలు కాజేశారు. దీంతో బాధితుడు ఆదివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శ్రీనగర్‌కాలనీలో నివసించే ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఓరిస్, చెట్నీస్ రెస్టారెంట్స్ పేరుతో ఉన్న ప్రకటన చూశారు. అందులో ఫోన్ నెంబర్ ఇచ్చిన నేరగాళ్లు తమకు ఫుడ్ ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ చేస్తామని ఎర వేశారు. ఈ ప్రకటన చూసిన బాధితుడు అందులో ఉన్న ఫోన్ నెంబర్‌లో సంప్రదించారు. ఇతడి నుంచి ఆర్డర్ తీసుకున్న నేరగాళ్లు పేమెంట్ కోసం తాము ఓ గూగుల్ పేజీ పంపుతామని, దాన్ని పూరించాలని చెప్పారు. అలా తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లిస్తే ఆహారం డోర్ డెలివరీ ఇస్తామని చెప్పారు. అలా నేరగాళ్లు పంపిన పేజ్‌లో బాధితుడు తన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఫోన్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) సైతం నింపాడు. వీటిని వినియోగించిన సైబర్ నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.40 వేలు కాజేశారు.
మరోపక్క చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి నుంచి సైబర్ క్రిమినల్స్ రూ.64 వేలు స్వాహా చేశారు. గడిచిన కొన్నాళ్లుగా ఆయన ఆన్‌లైన్‌లోనే నిత్యావసర సరుకులు ఖరీదు చేస్తున్నారు. దీనికోసం ఆయన గ్రోసరీ యాప్‌ను వినియోగిస్తున్నారు. సరుకులు ఖరీదు చేసిన ప్రతి సందర్భంలోనూ నెట్ బ్యాంకింగ్ నుంచి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండా ఈయన గ్రోసరీ యాప్‌లో ముందస్తుగా కొంత మొత్తం చెల్లించారు. ఈ మొత్తం నుంచి నిత్యావసర వస్తువులు ఖరీదు చేయగా.. ఇంకా రూ.20 వేలు బ్యాలెన్స్‌గా ఉండాల్సి ఉంది. అయితే ఇటీవల తనిఖీ చేయగా బాధితుడికి సదరు యాప్‌లో ఆ మొత్తం కనిపించలేదు. దీంతో కంగారుపడిన ఆయన విషయాన్ని యాప్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లాలని భావించారు.
దీనికోసం గూగుల్‌లో ఆ యాప్‌నకు సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్ ఆరా తీశారు. అందులో సైబర్ నేరగాళ్లు పొందుపరిచిన నకిలీ నెంబర్‌ను అసలైందిగా భావించారు. దానికి కాల్ చేయగా... నేరగాళ్లు తాము గ్రోసరీ యాప్ నిర్వాహకులుగా మాట్లాడారు. ఆ మొత్తాన్ని మీ ఖాతాలోకి తిరిగి పంపాలంటే తాము పంపే ఎస్సెమ్మెస్‌ను ఫలానా ఫోన్ నెంబర్‌కు సెండ్ చేయాలని సూచించారు. వీరి మాటలు నమ్మిన బాధితుడు అలానే చేశారు. అది యూపీఐ లింకునకు సంబంధించినది కావడంతో ఆయన బ్యాంకు ఖాతాకు సైబర్ నేరగాళ్ల ఫోను అనుసంధానమైంది. దీంతో సైబర్ నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.64 వేలు కాజేశారు. ఈ విషయం గుర్తించిన బాధితుడు ఆదివారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్నీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment