Cyber Criminals Looted 3 Lakhs Money OYO Hotel Customer In Hyderabad - Sakshi
Sakshi News home page

ఓయో రూమ్‌ తీసుకుందామనుకుంటే.. అంతలోనే!

Published Fri, Apr 9 2021 8:26 AM | Last Updated on Fri, Apr 9 2021 3:04 PM

HYD: Cyber Criminals Looted 3 Lakhs Money From OYO Customer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిటీలోని ఉత్తర మండలానికి చెందిన ఓ వ్యక్తి ఓయో హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసుకోవాలని భావించాడు. ఆ సంస్థను సంప్రదించడానికి అవసరమైన నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసి నిండా మునిగాడు. నగరానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ఉమేష్‌ ఇటీవల కరోనా బారినపడ్డాడు. చికిత్స తీసుకున్న అతడికి నెగిటివ్‌  వచ్చింది. అయితే తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని భావించారు. దీని కోసం తమ ప్రాంతానికి సమీపంలోని ఓయో హోటల్‌ రూమ్‌ తీసుకుందామని భావించి ఆ సంస్థ ఫోన్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేయగా ఒక నంబర్‌ లభించింది. అది నకిలీది అని తెలియక ఉమేష్‌ ఆ నంబర్‌ను సంప్రదించగా.. ఓయో సంస్థ ప్రతినిధుల మాదిరిగా సైబర్‌ నేరగాళ్లు మాట్లాడారు.

మీకు కావాల్సిన రూమ్‌ బుక్‌ చేసుకోవడానికి సహకరిస్తామంటూ క్విక్‌ సపోర్ట్‌ (క్యూఎస్‌) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. తర్వాత బాధితుడి ఫోన్‌ను హ్యాక్‌ చేశారు. రూమ్‌ బుకింగ్‌ కోసం తమకు రూ.10 పంపాలన్నారు. ఉమేష్‌ ఆ మొత్తం తన ఫోన్‌ నుంచి బదిలీ చేస్తుండగా అతడి యూపీఐ వివరాలను క్యూఎస్‌ యాప్‌ ద్వారా తస్కరించారు. వీటిని వినియోగించి అతడి ఖాతా నుంచి రూ.3.08 లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న ఉమేష్‌ గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్‌ నంబర్లు,  బ్యాంకు ఖాతాల ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

గూగుల్‌ను ఆశ్రయించొద్దు
ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ప్రముఖ సంస్థల కాల్‌ సెంటర్ల పేరుతో తమ నంబర్లను గూగుల్‌లో జొప్పిస్తున్నారని, ఈ విషయం తెలియక సంప్రదించిన అనేక మంది మోసపోతున్నారని పేర్కొన్నారు.  ఏదైనా సంస్థకు సంబంధించిన ఫోన్, కాల్‌ సెంటర్‌ నంబర్లు అవసరమైతే నేరుగా దాని వెబ్‌సైట్‌ లేదా యాప్‌లనే సంప్రదించాలని సూచిస్తున్నారు. గూగుల్‌లో ఉన్న వాటిని గుడ్డిగా నమ్మితే నిండా మునుగుతారని హెచ్చరిస్తున్నారు.  

చదవండి: 128 సార్లు ఓయో హోటల్స్ బుక్ చేసుకున్న ఒకే ఒక్కడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement