‘బోనస్‌’ పేరుతో భోంచేశారు.. | Cyber Criminals Robbed Bonus Money From Assistant Manager | Sakshi
Sakshi News home page

‘బోనస్‌’ పేరుతో భోంచేశారు..

Published Wed, Dec 18 2019 9:59 AM | Last Updated on Wed, Dec 18 2019 9:59 AM

Cyber Criminals Robbed Bonus Money From Assistant Manager - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ ప్రభుత్వ రంగ సంస్థలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్న మహిళకు సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమెకు ఉన్న రూ.7 లక్షల ఇన్సూరెన్స్‌ పాలసీలపై బోనస్, కమీషన్‌ ఇప్పిస్తామంటూ రూ.49 లక్షలు వసూలు చేశారు. దాదాపు తొమ్మిది నెలల పాటు డబ్బు డిపాజిట్‌ చేస్తూ వచ్చిన ఆమె ఎట్టకేలకు మోసపోయినట్లు గుర్తించారు. మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళా అసిస్టెంట్‌ మేనేజర్‌ కొన్నేళ్ల క్రితం మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నుంచి రూ.3 లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నుంచి రూ.4 లక్షల పాలసీలు తీసుకున్నారు. ఈమెకు ఈ ఏడాది మార్చ్‌ మూడో వారంలో ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. ఢిల్లీకి చెందిన గవర్నింగ్‌ బాడీ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ నుంచి చేస్తున్నట్లు చెప్పిన ప్రీతి అనే యువతి మాట్లాడింది. తన పేరుతో పాటు ఇన్సూరెన్స్‌ పాలసీల నంబర్‌ చెప్పడంతో బాధితురాలు ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచే ఫోన్‌ వచ్చినట్లు పూర్తిగా నమ్మింది. ఆపై అసలు కథ ప్రారంభించిన ప్రీతిగా చెప్పుకున్న యువతి మీ ఇన్సూరెన్స్‌ పాలసీలను ఏజెంట్‌ ద్వారా కట్టారని, ఈ కారణంగానే ప్రతి నెలా బోనస్‌తో పాటు కమీషన్‌ సదరు ఏజెంట్‌కు వెళ్తున్నట్లు చెప్పింది. అలా కాకుండా ఆ మొత్తం మీకే చెందాలంటే తాము చెప్పినట్లు చేయాలని సూచించింది.

దీనికి అసిస్టెంట్‌ మేనేజర్‌ అంగీకరించడంతో మరో మూడు పేర్లు చెప్పుకుంటూ సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ ద్వారా రంగంలోకి దిగారు. మీ ఇన్సూరెన్స్‌ పాలసీలకు చెందిన బోనస్, కమీషన్‌ మీకే చేరాలంటే ప్రస్తుతం నడుస్తున్న పాలసీలను బ్రేక్‌ చేసి, ఏజెంట్ల పేరు తొలగించి మళ్లీ ప్రారంభించాలని చెప్పారు. అందుకు ఆమె అంగీకరించడంతో దీనికోసం ప్రాసెసింగ్‌ ఫీజుల నిమిత్తం రూ.21,450 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఆ డబ్బు కట్టడానికి మహిళ అంగీకరించడంతో ముంబైకి చెందిన ఓ బ్యాంకు ఖాతా నంబర్‌ ఇచ్చిన సైబర్‌ నేరగాళ్లు అందులో డిపాజిట్‌ చేయమన్నారు. ఆపై ఆదాయపుపన్ను, జీఎస్టీ, ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్యాక్స్‌... ఇలా అనేక పేర్లు చెప్పి భారీ మొత్తం ట్రాన్స్‌ఫర్‌/డిపాజిట్‌ చేయించుకున్నారు. ప్రతి సందర్భంలోనూ ప్రాసెసింగ్‌ ఫీజు మినహా చెల్లించిన ప్రతి పైసా వెనక్కు వస్తుందని (రీఫండబుల్‌) నమ్మబలికారు. ఓ దశలో బాధితురాలికి అనుమానం వచ్చి ఫోన్‌ చేసిన వారిని నిలదీయగా... కొత్త కథ మొదలెట్టారు. ముంబైకి చెందిన ఎస్బీఐ సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ బ్రాంచ్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ సంజీవ్‌ గుప్త పేరుతో మరో సైబర్‌ నేరగాడు రంగంలోకి దిగాడు. ఇన్సూరెన్స్‌ పాలసీలకు సంబంధించిన బోనస్, కమీషన్‌తో పాటు ఇప్పటి వరకు మీరు చెల్లించిన మొత్తం డబ్బు రీఫండ్‌ అయిందని, గవర్నింగ్‌ బాడీ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ నుంచి తమ వద్దకు వచ్చి ఆగినట్లు చెప్పాడు.

ఇంత మొత్తం మరో రాష్ట్రంలోని వేరే బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడానికి క్యాష్‌ హ్యాండ్లింగ్‌ చార్జీలు చెల్లించాలని, ఇవి కూడా కొన్ని రోజులకు రీఫండ్‌ అవుతాయని చెప్పారు. దీంతో ఆమె మరో రూ.5 లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసింది. ఇలా ఈ ఏడాది మార్చి 26–డిసెంబర్‌ 4 మధ్య 45 దఫాల్లో మొత్తం రూ.49 లక్షలు ముంబై, ఢిల్లీలకు చెందిన బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకున్నారు. దాదాపు పది సందర్భాల్లో డబ్బు మొత్తం సిద్ధమని, రెండు గంటల్లో ఆర్టీజీఎస్‌ ద్వారా మీ ఖాతాలోకి వస్తుందని చెప్పి నమ్మించారు. బాధిత మహిళ తన సేవింగ్స్‌తో పాటు అప్పు తీసుకువచ్చి ఈ డబ్బు చెల్లించారు. మరోసారి కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు మరికొంత మొత్తం కోరడంతో అనుమానించిన బాధితురాలు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ గంగాధర్‌ దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వినియోగించిన ఫోన్‌ నంబర్లు, డబ్బు డిపాజిట్‌ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్తున్న సైబర్‌ కాప్స్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్సూరెన్స్‌ పాలసీ హోల్డర్స్‌ సమాచారం ఆధారంగానే ఈ తరహా నేరాలు జరుగుతాయని, ఆ సమాచారం సైబర్‌ నేరగాళ్లకు ఎలా చేరుతోంది? అనే కోణంలో ఆరా తీస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement