సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని యూసుఫ్‌గూడకు చెందిన యువకుడిని గూగుల్‌లోని నకిలీ కాల్ సెంటర్ ముంచేసింది. తనకు జొమాటో నుంచి రావాల్సిన రూ.146 కోసం ప్రయత్నిస్తే.. రూ.55 వేలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆ యువకుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వరంగల్‌కు చెందిన ఓ యువకుడు ప్రస్తుతం యూసుఫ్‌గూడలోని రెహ్మత్‌నగర్‌లో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తున్నాడు. చికెన్ బిర్యానీ తినాలని భావించిన ఇతగాడు శనివారం ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో ఆర్డర్ చేశాడు. తనకు చికెన్ బిర్యానీకి బదులుగా సాధారణ రైస్ పార్శిల్ వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి జొమాటో యాప్‌లో ఆ సంస్థ నంబర్ల కోసం వెతికాడు. అవి అందుబాటులో లేకపోవడంతో అవకాశం ఉన్న చాటింగ్ ద్వారా ఆ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా జొమాటో కాల్ సెంటర్ నంబర్ కోసం ప్రయత్నించాడు.
అందులో ఉన్న ఓ నంబర్‌కు సంప్రదించిన బాధితుడు అవతలి వారు రెస్పాండ్ కాకపోవడంతో మిన్నకుండిపోయాడు. కొద్దిసేపటికి తాను ఫోన్ చేసిన నంబర్ నుంచి కాల్ బ్యాక్ రావడం.. ట్రూ కాలర్ యాప్ జొమాటో కాల్ సెంటర్ అంటూ చూపించడంతో స్పందించాడు. అవతలి వ్యక్తితో జరిగిన విషయం చెప్పి తనకు రూ.146 రిటర్న్ ఇవ్వాల్సిందిగా కోరాడు. బాధితుడు డబ్బును తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాడు. ఈ విషయాన్ని అతడి నుంచే తెలుసుకున్న మోసగాళ్లు ఆ కార్డుకు రిటర్న్ రావని, గూగుల్ పే ఉన్న ఫోన్ నంబర్ చెప్పాల్సిందిగా కోరారు. తాను ఇప్పుడు కాల్ చేస్తున్న నంబర్‌కు అది ఉందని బాధితుడు చెప్పాడు. దీంతో ఇతడికి యూపీఐ కోడ్ పంపిన సైబర్ నేరగాళ్లు దాన్ని తాము సూచించిన నంబర్‌కు పంపాలంటూ అలా చేయించుకున్నారు.
ఆపై తొలుత బాధితుడి ఖాతా నుంచి రూ.1 చెల్లించేలా చేసి.. మీ గూగుల్ పే ఖాతా తమ వద్ద యాడ్ అయిందని, 24 గంటల్లో డబ్బు రిటర్న్ వస్తుందని చెప్పారు. ఆదివారం సాయంత్రం హఠాత్తుగా బాధితుడి గూగుల్‌పేతో లింకు అయి ఉన్న రెండు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.1.4 లక్షలు కట్ అయ్యాయి. ఈ లావాదేవీని గుర్తించిన అతడి బ్యాంకు అనుమానించింది. తక్షణం బాధితుడిని సంప్రదించి విషయం తెలుసుకుంది. ఆపై రూ.85 వేలు రిటర్న్ చేయగలిగింది. మిగిలిన రూ.55 వేలు మాత్రం నేరగాళ్ల పరమైంది. ఈ విషయం గుర్తించిన బాధితుడు తనను సంప్రదించిన నంబర్లకు కాల్ చేయడానికి ప్రయత్నించగా ఫలితం దక్కలేదు. దీంతో అతడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. గూగుల్‌లో ఉన్న కాల్ సెంటర్ల నంబర్లలో చాలా నకిలీలు ఉంటున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment