టార్గెట్‌ కార్‌ షోరూమ్స్‌! | Cyber Criminals Target Car Showrooms | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ కార్‌ షోరూమ్స్‌!

Published Sat, Aug 17 2019 8:01 AM | Last Updated on Tue, Aug 20 2019 12:43 PM

Cyber Criminals Target Car Showrooms - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయం పేరుతో ఈ–కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో ప్రకటనలు ఇచ్చి నిండా ముంచుతున్న సైబర్‌ నేరగాళ్లకు సంబంధించిన కేసులను  వింటూనే ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో ఉత్తరాదికి చెందిన సైబర్‌ క్రిమినల్స్‌ కొత్త ఎత్తులు వేస్తున్నారు. కార్ల షోరూమ్స్‌నే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు  అప్రమత్తంగా ఉండాలంటూ శుక్రవారం సూచనలు జారీ చేశారు. ఈ నేరగాళ్ళు ఆన్‌లైన్‌ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న కార్ల షోరూమ్స్‌ వివరాలను ఇంటర్‌నెట్‌ ద్వారా సంగ్రహిస్తున్నారు. అందులో సూచించిన నెంబర్లకు కాల్‌ చేస్తున్న కేటుగాళ్లు తాము బడా కంపెనీలకు చెందిన ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా తాము భారీ సంఖ్యలో కార్లు ఖరీదు చేయాలని భావిస్తున్నామంటూ వాటి ఖరీదులు, చెల్లించాల్సిన అడ్వాన్సుల విషయం ఎగ్జిక్యూటివ్స్‌ నుంచి తెలుసుకుంటున్నారు. ఆపై మరో అడుగు ముందుకు వేసి వారికి ఏఏ బ్యాంకులు/బ్రాంచ్‌ల్లో ఖాతాలు ఉన్నాయి? ఎవరు నిర్వహిస్తున్నారు? ఎవరి పేర్లతో ఉంటాయి? తదితరాలు సంగ్రహిస్తున్నారు.

సదరు కంపెనీ ప్రతినిధులు అడ్వాన్సులు ఆన్‌లైన్‌లో చెల్లించడానికి అడుగుతున్నారని భావిస్తున్న షోరూమ్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఈ వివరాలన్నీ చెప్పేస్తున్నారు. ఇది జరిగిన తర్వాత ఆయా బ్యాంకుల నెంబర్లనూ ఇంటర్‌నెట్‌ నుంచి సంగ్రహిస్తున్న సైబర్‌ నేరగాళ్లు వాటికి ఫోన్లు చేస్తున్నారు. మేనేజర్లుతో తాము ఫలానా కార్‌ షోరూమ్‌ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకుంటున్నారు. ఆపై మాటల్లో పెట్టి తమ ఖాతాలోని నగదును ఫలానా ఖాతాలోకి బదిలీ చేయాలని కోరుతున్నారు. ఆయా షోరూమ్స్‌ లావాదేవీలు బ్యాంకులకు నిత్యకృత్యం కావడంతో చెక్కులు తదితరాలు తర్వాత ఇస్తారనే ఉద్దేశంతో బ్యాంకు వారు నగదు బదిలీ చేసేస్తున్నారు. ఈ ఖాతాలు సైబర్‌నేరగాళ్ళకు చెందినవి కావడంతో డబ్బు వారికి చేరిపోతోంది. ఆపై కార్ల షోరూమ్‌ వారు బ్యాంకును సంప్రదించిన తర్వాతే అసలు విషయం తెలిసి వారు సైబర్‌క్రైమ్‌ ఠాణాను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా నేరాలు జరుగుతున్న నేపథ్యంలో కార్ల షోరూమ్స్‌ నిర్వాహకులు, ఎగ్జిక్యూటివ్స్‌ అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫోన్‌కాల్స్‌ను నమ్మి కీలక విషయాలు చెప్పకూడదని, అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చహిస్తున్నారు. బ్యాంకులు సైతం చెక్కులు తదితరాలు తేకుండా నగదు ఫోన్‌కాల్స్‌ ఆధారంగా బదిలీ చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ఈ తరహా సైబర్‌ నేరాల్లో డబ్బు పోవడం ఎంత తేలికో... రికవరీ అంత కష్టమని పేర్కొంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement