రైల్వేట్రాకు దాటుతున్న గామస్తులు
మదనాపురం (కొత్తకోట) : మండలంలోని కొన్నూర్ రైల్వేస్టేషన్ ప్రమాదాలకు నిలయంగా మారింది. గత కొంతకాలంగా రైల్వేస్టేషన్ సమీపంలో రైళ్లు ఢీకొని చాలామంది గ్రామస్తులు చనిపోతున్నారు. రైలు కిందపడి చనిపోయేవాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. చాలా వరకు చనిపోవాలనుకున్న వారే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు.
అయితే మరికొందరు ప్రమాదవశాత్తే చనిపోతున్నారని రైల్వేట్రాకు గ్రామ మధ్యలో ఉండడమే దీని ప్రధాన కారణమని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఏటా పదుల సంఖ్యలో మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామం నడిబొడ్డులో ట్రాకు..
ప్రధానంగా గ్రామం నడిబొడ్డున రైల్వేట్రాకు ఉండడంతో గ్రామంలో రాకపోకలు సాగించే గ్రామస్తులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. బీసీకాలనీ నుంచి గ్రామంలోకి వెళ్లి కూరగాయలు, నిత్యావసర వస్తువులు తీసుకురావాలంటే రైల్వే ట్రాకు దాటాల్సిందే. ఈ క్రమం లో చిన్నపిల్లలు, వృద్దులు, యువకులు, ప్రతిఒక్కరూ ట్రాకు దాటి వెళ్తారు.
ఈ ట్రాకు దాటే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాలకు గురికాక తప్పదు. గత కొన్నేళ్ల తరబడి రైలు ప్రమాదాలకు గ్రామస్తులు గురై చనిపోతున్నారు. ఏడాదిలో కనీసం పదిమంది చనిపోతుంటారు. అలాగే గొర్రెలు, మేకలు, పశువులు రైలు ప్రమాదాల బారిన పడుతున్నాయి.
కాంపౌండ్‌కు నోచని స్టేషన్
రైల్వేస్టేషన్ పరిధి ఉన్నంత వరకు ప్లాట్‌ఫాం గుండా కాంపౌండ్ వాలు నిర్మాణం చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అడ్డగోలుగా ట్రాకు దాటకుండా ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రైల్వేస్టేషన్ సమీపంలో గ్రామస్తులకు నడక వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment