
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ రోడ్డు ప్రమాదం బాధాకరమని డీసీపీ దివ్యచరణ్ రావు అన్నారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లారీ డైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, వేగంగా వస్తున్న లారీ.. ఆటోని గమనించి బ్రేక్‌లు వేసినట్లు తమ దర్యాప్తులో తెలిందని చెప్పారు. మంగళవారం ఉదయం ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతిచెందగా.. ఏడుగురు గాయపడిన సంగతి తెలిసిందే. విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థి అవంత్ మృతదేహన్ని గాంధీ ఆసుపత్రి తరలించగా బాలుడి తండ్రి ఆసుపత్రి చేరుకున్నారు. ప్రస్తుతం బాలుడి మృతదేహనికి గాంధీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అరెస్టు చేశామని, అతనిపై సెక్షన్ 304(ఎ), 337, 279 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
అయితే రాచకొండ పరిధిలో రాత్రి 10:30 నుంచి ఉ. 8 గంటల వరకు భారీ వాహనాలకు పర్మిషన్ ఉందని, ప్రమాదం ఉదయం 7.50 గంటల సమయంలో జరిగిందని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పంపిస్తున్న ఆటో ఫిట్‌నెస్ వివరాలను పోలీసులను కానీ, ఆర్టీఏ అధికారుల వద్ద కానీ అడిగి తెలుసుకోవాలన్నారు. అయితే తమ దర్యాప్తులో స్కూల్ ఆటో ఫిట్‌నెస్ సక్రమంగానే ఉందని, లారీ కండిషన్ ఎలా ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే స్కూల్ ఆటో ఆరుగు విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉందని ఆయన తెలిపారు. సిగ్నల్ క్రాస్ అయ్యే సమయంలో ఆటో డ్రైవర్ సంయమనం పాటించాలని సూచించారు.
అలాగే ఉప్పల్ ఎస్సై సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం బాధాకరమైనదని వ్యాఖ్యానించారు. విద్యార్థులు ప్రయాణించిన ఆటో పర్మిట్‌ను పరిశీలించామని, ఆటోకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించామన్నారు. లారీకి సంబంధించిన ఫిట్‌నెస్, పర్మిట్ పత్రాలు కూడా పరిశీలింస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరి నిర్లక్ష్యమనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment