న్యూఢిల్లీ : ప్రేమించలేదని.. పెళ్లికి నిరాకరించిందని అమ్మాయిలపై యాసిడ్ దాడి వార్తలు నిత్యం అనేకం చూస్తూనే ఉంటాం. కానీ ఢిల్లీలో ఇందుకు భిన్నంగా జరిగింది. మూడు ఏళ్లుగా ప్రేమించానంటూ తిరిగి పెళ్లికి నిరాకరించిన ఓ యువకుడిపై ప్రియురాలి యాసిడ్ పోసింది. వివరాలు..దేశ రాజధానిలో వారం రోజుల క్రితం బైక్ మీద వెళ్తున్న ఓ జంటపై యాసిడ్ దాడి జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు బాధితులను ఆస్పత్రిలో చేర్చి.. చికిత్స అందించడమే కాక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా దాడి చేసిన వారి గురించి మాత్రం ఎలాంటి క్లూ దొరకలేదు. ఈ క్రమంలో బాధితులనే విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
ఆ వివరాలు.. ఢిల్లీకి చెందిన యువతి యువకులు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోమంటూ సదరు యువతి ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అందుకు యువకుడు ఒప్పుకోలేదు. విడిపోదాం అని కోరాడు. దీన్ని తట్టుకోలేని యువతి.. ప్రేమికుడిపై యాసిడ్ దాడి చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ నెల 11న ప్రేమికులిద్దరూ బైక్ మీద బయటకు వెళ్లారు. అప్పుడు యువతి.. నీ ముఖం సరిగా కన్పించడం లేదు.. హెల్మెట్ తీసేయమని ప్రేమికుడిని కోరింది. తర్వాత తనతో తెచ్చుకున్న యాసిడ్‌ని యువకుడి ముఖం మీద చల్లింది. దాంతో అతనికి మెడ, గొంతు, ముఖం మీద తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో యువతికి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి.
వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రిలో చేర్చి.. దర్యాప్తు ప్రారంభించారు. కానీ దాడి చేసిన వారి గురించి ఎటువంటి సమాచారం లభించకపోవడంతో.. బాధితులనే విచారించడం ప్రారంభించారు. ఈ క్రమంలో యువకుడు బైక్ మీద వెళ్తుండగా.. తన ప్రియురాలు హెల్మెట్ తీసేయమని కోరిందని.. తర్వాతనే వారిపై యాసిడ్ దాడి జరిగిందని చెప్పాడు. దాంతో యువతిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. తనను పెళ్లి చేసుకోవాడానికి నిరాకరించడంతోనే ఈ దాడికి పాల్పడినట్లు యువతి అంగీకరించింది. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment