కర్నూలు(హాస్పిటల్): వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతి చెందిన సంఘటన కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటు చేసుకుంది. రోగుల కేస్‌షీట్లు తారుమారు కావడంతో ఒకరికి ఇవ్వాల్సిన వైద్యం మరొకరికి అందించారు. దీంతో రోగి కోలుకోలేక మృతి చెందాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం రాజపురానికి చెందిన భీమన్న గత నెల 24న కర్నూలు సర్వజన వైద్యశాలలోని న్యూరో సర్జరీ వార్డులో చేరి చికిత్స పొందాడు. అదే రోజున అనంతపురం జిల్లాకు చెందిన భీమప్ప రోడ్డు ప్రమాదానికి గురై అదే వార్డులో చేరాడు. పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతోపాటు వైద్యుల నిర్లక్ష్యంతో కేస్‌షీట్లు తారుమారయ్యాయి. భీమప్పకు అందించాల్సిన వైద్యాన్ని భీమన్నకు అందించారు. దీంతో భీమన్న కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందాడు.
మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని వైద్యులు చెప్పడంతో అతని కుటుంబీకులకు అనుమానం వచ్చింది. అనారోగ్యంతో చనిపోతే పోస్టుమార్టం చేస్తారా అని ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సోమవారం ఆస్పత్రిలోని క్యాజువాలిటీ వద్ద భీమన్న కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. తన భర్త మరణానికి కారణం వైద్యులేనని భార్య తెలుగు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ వివరణ ఇస్తూ.. భీమప్ప ఆస్పత్రిలో చేరిన మాట వాస్తవమేనని, కానీ ఆయన వార్డులో చేరి చికిత్స తీసుకోలేదని చెప్పారు. భీమన్న పేరును పొరపాటున భీమప్పగా నమోదు చేశారన్నారు. భీమన్నకు ఇచ్చిన వైద్యంలో ఎలాంటి లోపమూ లేదన్నారు.
కర్నూలు పెద్దాస్పత్రిలో దారుణం
Comments
Please login to add a commentAdd a comment