
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని కింది భాగంలో తాముంటూ, పైభాగంలో వ్యభిచార బాగోతం నడిపించారు ఆ దంపతులు. ఇది చాలదన్నట్టు కొందరు విటులు డ్రగ్స్ తీసుకుని రావడాన్ని గమనించి, తామే డ్రగ్స్ సరఫరా ఎందుకు చేయకూడదని ఆలోచించి నైజీరియన్లను ఆశ్రయించారు. వారి దగ్గరి నుంచి కొకైన్, ఓపీఎం, ఎండీఎంఏ లాంటి మత్తుపదార్థాలను కొనుగోలు చేసి అధిక ధరలకు తమ వద్దకు వచ్చే విటులకు విక్రయించారు. ఆ జంట గుట్టును ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రట్టు చేశారు. ఇద్దరినీ అరెస్టు చేసి మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో ఈనెల 2వ తేదీన ఫిలింనగర్, రోడ్డునంబర్ 5లో ఉన్న ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు 7 గ్రాముల కొకైన్, 2 గ్రాముల ఓపీఎం, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.1.13 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు బి.సంతోష్, మహ్మద్ మసూద్‌లను అరెస్టు చేశారు. అయితే ఆ సమయంలో ఆ ఇంటిని వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్న నిర్వాహకుడు షేక్ ఫహద్ అలియాస్ మదన్ తన కారులో పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సి.వివేకానందరెడ్డి నియమించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి.
అయితే, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12లోని సాయిబాబా ఆలయం వద్ద ఓ కారులో కొకైన్ అమ్మకానికి సిద్ధంగా ఉందని ఎక్సైజ్ అధికారులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. అక్కడకు వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కారులో షేక్ ఫహద్ అలియాస్ మదన్ (37), ఆయన భార్య సలీమా రబ్బాయి షేక్ (27)లు కూడా తారసపడ్డారు. వెంటనే వీరిని అదుపులోనికి తీసుకుని 9 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరి దగ్గరి నుంచి రూ.3 లక్షల నగదు, 4 మొబైల్‌ఫోన్‌లు, ఒక స్వైపింగ్ మెషీన్, స్విఫ్ట్ కారు, ఈనెల 2న పారిపోవడానికి ఉపయోగించిన ఐ10 కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
వ్యభిచారం నుంచి..
విచారణలో తేలిన వివరాల ప్రకారం... ఫహద్ ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వ్యభిచారం నిర్వహించేవాడు. 2018 జనవరిలో అరెస్టు చేసి కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఫిలింనగర్ రోడ్డు నంబర్ 5కు మకాం మార్చిన ఫహద్ అక్కడ నెలకు రూ.75వేల కిరాయితో ఇల్లు తీసుకున్నాడు. కింద భాగంలో తానుంటూ పైభాగంలోని గదులలో వ్యభిచారం నిర్వహించేవాడు. అయితే, వ్యభిచారం కోసం వచ్చే కొందరు విటులు డ్రగ్స్ తీసుకుని రావడాన్ని ఫహద్ గమనించాడు. దీంతో ఆ డ్రగ్స్‌ను కూడా తానే సరఫరా చేయాలని నిర్ణయించుకుని సన్‌సిటీ ప్రాంతంలో ఒక నైజీరియన్ నుంచి రూ.6వేలకు గ్రాము చొప్పున కొకైన్ కొనుగోలు చేసి రూ.7,500కు అమ్మేవాడు. స్నేహితులు సంతోష్, సురేశ్, మహ్మద్ మసూద్‌లను ఉపయోగించుకోవడంతో పాటు తన భార్య సహకారంతో ఈ దందాలు నడిపేవాడు. కొకైన్‌తో పాటు ఓపీయం, ఎండీఎంఏలు కూడా విక్రయించేవాడు. వీరిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం సెక్షన్–27 ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment