సాక్షి, ఖమ్మం : తాగిన మైకంలో ఓ వికలాంగుడు నగరంలోని వన్‌టౌన్ స్టేషన్‌లో వాచర్ డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ చేతి వేలును కొరికేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేవతి థియేటర్ ప్రాంతానికి చెందిన వికలాంగుడు డుంగ్రోతు మస్తాన్ ఘర్షణపడి మరో ఇద్దరితో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో అరుస్తుండగా వాచర్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మన్సూర్ అలీ, ఇన్‌చార్జ్‌గా ఉన్న సత్యనారాయణ మందలించారు. అప్పటికే తాగిన మైకంలో ఉన్న అతడు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లను దూషిస్తుండగా వారు పక్కకు వెళ్లిపోయారు.
అయితే ఒక్కసారిగా మస్తాన్.. మన్సూర్ అలీపైకి వచ్చి మొదట అతడి తొడ భాగంలో కొరికాడు. దీనిని అడ్డుకోవడంతో చేతి వేలును బలవంతంగా కొరకడంతో ఊడి కిందపడిపోయింది. దీంతో మన్సూర్ అలీ విలవిలలాడుతుండగా.. మస్తాన్ అక్కడి నుంచి పారిపోయాడు. హెచ్‌సీ సత్యానారాయణ సీఐ రమేష్‌కు సమాచారం అందించగా.. వారు మన్సూర్ అలీని ఆస్పత్రికి తరలించారు. కాగా.. మస్తాన్ సైకో మాదిరిగా ప్రవర్తిస్తాడని, గతంలో అతడిపై వన్‌టౌన్ స్టేషన్‌లో కేసు కూడా ఉందని సీఐ తెలిపారు. అతడిపై మళ్లీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా.. ఘటనపై సీపీ తఫ్సీర్ ఇక్బాల్, అడిషనల్ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకట్రావు ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment