లగ్జరీ కారు వీరంగం | Drunk students ram autos, one killed | Sakshi
Sakshi News home page

లగ్జరీ కారు వీరంగం

Published Mon, Nov 13 2017 1:09 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

Drunk students ram autos, one killed - Sakshi

ప్రమాదానికి కారణమైన కారు ,మృతుడు రాజేష్, ప్రమాదానికి కారకుడైన అహ్మద్‌

సాక్షి, చెన్నై: కెథడ్రల్‌ రోడ్డులో అర్థరాత్రి సమయంలో ఓ లగ్జరీ కారు వీరంగం సృష్టించింది. ఆటోస్టాండ్‌ వైపుగా ఆ కారు దూసుకురావడంతో ఓ డ్రైవర్‌ మరణించాడు. మరో ఐదుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మత్తుకు చిత్తైన సంపన్నుల పిల్లలు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

వేలూరు జిల్లా అరక్కోణంకు చెందిన రాజేష్‌ (38) చెన్నైలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి పోయెస్‌ గార్డెన్‌ సమీపంలోని కెథడ్రల్‌ రోడ్డులోని స్టాండ్‌లో ఆటోను పార్క్‌ చేశాడు. సహచర డ్రైవర్లతో కలిసి ఆటోలో కూర్చుని పిచ్చాపాటి కబుర్లలో మునిగాడు. ఈ సమయమంలో ఓ లగ్జరీ కారు నుంగంబాక్కం నుంచి మెరీనా వైపుగా దూసుకొచ్చింది. అదుపుతప్పిన ఈ కారు పోయెస్‌ గార్డెన జంక్షన్‌ వద్ద డివైడర్‌ను ఢీకొంది. పెద్ద శబ్దం రావడంతో ఆటోలో ఉన్న డ్రైవర్లు తేరుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగింది. అతి వేగంగా ఆటో స్టాండ్‌ వైపుగా ఆ కారు దూసుకొచ్చి సమీపంలోని గోడను ఢీకొట్టి ఆగింది. క్షణాల్లో పరిసరాల్లో మంటలు వ్యాపించాయి. అరుపులు కేకలతో ఆర్తనాదాలు మొదలయ్యాయి. అటు వైపుగా వెళ్తున్న వారు ప్రమాదంపై అడయార్‌ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న వాళ్లను చికిత్స నిమిత్తం రాయపేట ఆస్పత్రికి తరలించారు. అతి వేగంగా కారును నడపడమే కాకుందా తప్పించుకునే యత్నం చేసిన యువకుల్ని కారు సహా అటు వైపుగా వెళ్తున్న వారు బంధించారు.  ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ రాజేష్‌ సంఘటన స్థలంలోనే మరణించాడు. తిరుమలై(38), మోహన్‌(31), బాబు(42), బాలు(50)తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆరు ఆటోలు ధ్వంసం అయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.  తొలుత కేసును అడయార్‌ పోలీసులు తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. తదుపరి అన్నా సమాధి పోలీసులకు అప్పగించారు. అతి వేగంగా దూసుకొచ్చిన కారులో ఐదుగురు యువకులు ఉన్నట్టు గుర్తించారు. 19 నుంచి 22 ఏళ్ల వయస్సులోపు ఉన్న ఆ యువకులు నుంగంబాక్కంలోని ఓ కళాశాల్లో చదువుకుంటున్నట్టు తెలిసింది. వారు మద్యం తాగి మెరీనా తీరం వైపుగా కారులో దూసుకు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని విచారణలో తేలింది.  కారు నడిపిన అహ్మద్‌(20)ను పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఉన్న హరికృష్ణ, కృష్ణకుమార్, విశాల్‌ రాజ్‌కుమార్, వినోద్‌ కుమార్‌లకు రాయపేట ఆస్పత్రిలో చికిత్స అందించి అనంతరం పోలీసులు అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement