మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కోర్టు కొరడా ఝళిపించింది. పదే పదే పట్టుబడిన ఇద్దరు డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు చేసింది. మరో 13 మందివి నిర్ణీత కాలానికి సస్పెండ్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 154 మందికి జైలు శిక్ష విధించింది.
సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి భారీ వాహనాలు నడుపుతూ చిక్కిన, పదేపదే పట్టుబడుతున్న ‘నిషా’చరులపై న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరి డ్రైవింగ్ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేస్తూ, మరో 13 మందివి నిర్ణీత కాలానికి సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) డాక్టర్ వి.రవీందర్ సోమవారం తెలిపారు. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో చిక్కిన 614 మంది మందుబాబులపై అధికారులు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. వీరిని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) కౌన్సిలింగ్ అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
వాహనం నడిపే సమయంలో వీరు తీసుకున్న మద్యం మోతాదు, నడుపుతున్న వాహనరకం, గతంలో పట్టుబడిన చరిత్ర తదితరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 154 మందికి జైలు శిక్ష విధించింది. చంచల్‌గూడ జైలుకు వెళ్లిన వారిలో 21 మందికి పది రోజులు, ఒకరికి ఎనిమిది రోజులు, ముగ్గురికి వారం, నలుగురికి ఆరు రోజులు, 13 మందికి ఐదు రోజుల, 19 మందికి నాలుగు రోజులు, 15 మందికి మూడు రోజులు, 78 మందికి రెండు రోజులు జైలు శిక్షలు పడినట్లు రవీందర్ వివరించారు. వీరితో పాటు మిగిలిన వారికీ న్యాయస్థానం రూ.13.32 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరి డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసిన కోర్టు, ఐదుగురివి రెండేళ్ల పాటు, ముగ్గురివి ఏడాది, మరో ఐదుగురివి ఆరు నెలలు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వివరించారు.
సైబరాబాద్‌లో 315 డ్రంకన్ డ్రైవ్ కేసులు
మద్యం తాగి బండి నడుపుతున్న డ్రంకన్ డ్రైవర్లపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి 15వ తేదీలోగా 315 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీరిలో 12 మందికి ఒకటి నుంచి 12 రోజుల పాటు జైలు శిక్ష పడిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment