
సాక్షి, సిటీబ్యూరో: కొందరు ‘తెల్ల’ఖాకీల నిర్లక్ష్యం... ఓ లారీ డ్రైవర్ నిర్వాకం... వెరసి ఓ కుటుంబంలో పెను విషాదం నింపింది. ముక్కుపచ్చలారని తొమ్మిదేళ్ళ చిన్నారి భూమిక ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం మొగ్గలోనే రాలిపోయింది... అదే లారీ పదేపదే ఒకే తరహా ఉల్లంఘనకు పాల్పడుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం చలాన్లతో సరిపెట్టారు. ఫలితమే మంగళవారం చోటు చేసుకున్న భూమిక విషాదాంతం. ఈ పాపం ట్రాఫిక్ పోలీసులదే అనడంలో సందేహం లేదు.
ఆ నిషేధం నామమాత్రమేనా..?
రాజధానిలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు తోడు లారీలు మృత్యుశకటాలుగా మారడంతో ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. ప్రధాన రోడ్లపై లారీల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. రాచకొండ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, రాత్రి 10.30 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే భారీ వాహనాలు రాకపోకలు సాగించాలి. అయితే ఇవన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయనేందుకు భూమికను పొట్టనపెట్టుకున్న ఇసుక లారీనే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ మృత్యుశకటం ఉదయం 8 గంటల ప్రాంతంలోనూ ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో ‘స్వేచ్ఛగా’ విహరించడమే ఇందుకు నిదర్శనం.
గతంలోనే ఇదే మాదిరిగా...
భూమికను చిదిమేసిన లారీ (ఏపీ 29 వీ 7539) నిషేధిత సమయంలో ఉప్పల్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో విహరించడం ఇది తొలిసారి కాదు. గత మూడు నెలల్లో ఇలా ఉల్లంఘనకు పాల్పడుతూ రెండుసార్లు ‘రికార్డుల్లోకి’ ఎక్కింది. మంగళవారంతో కలుపుకుంటే మూడోసారి. అక్టోబర్ 18 ఉదయం 9.05 గంటలకు వీటీ కమాన్ ప్రాంతంలో ఈ లారీని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు నో ఎంట్రీ సహా ఐదు ఉల్లంఘనలకు సంబంధించి రూ.2700 జరిమానా విధించారు. ఈ నెల 13న ఉప్పల్ టయోటా షోరూమ్ వద్ద రూ.700 జరిమానా విధించారు. ఈ రెండూ స్పాట్ చలాన్లే అని ట్రాఫిక్ పోలీసుల వెబ్‌సైట్ స్పష్టం చేస్తోంది.
జరిమానా విధిస్తే సరా?
పదేపదే నిషేధిత సమయాల్లో దూసుకువస్తున్న ఇలాంటి అనేక లారీలకూ ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఒకసారి చలాన్ విధించిన తర్వాత 24 గంటల వరకు ఆ వాహనంపై అదే ఉల్లంఘనకు సంబంధించిన మరో చలాన్ విధించే ఆస్కారం లేదు. దీంతో అనేక వాహనాలు చలాన్ మొత్తాన్నీ కిరాయికి మాట్లాడుతుకున్న వ్యక్తుల నుంచే వసూలు చేస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి.
వారికి కాసుల పంట...
చిలుకానగర్ వద్ద ప్రమాదానికి కారణమైన ఆ లారీ ఉప్పల్ ఇసుక లారీల అడ్డా నుంచి బయలుదేరి నిషేధిత సమయంలోనే ఉప్పల్ చౌరస్తాను దాటుకుంటూ వచ్చింది. ఇసుక రవాణా వాహనాలతో పాటు నిర్మాణంలో ఉన్న భవనాలు, సముదాయాలకు సంబంధించినవీ ట్రాఫిక్ పోలీసులకు కాసుల పంట పండిస్తుంటాయి. అక్కడకు రాకపోకలు సాగించే భారీ వాహనాలను ‘వదిలేయడం’ కోసం వాటి యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారనే ఆరోపణలున్నాయి. భూమికను చిదిమేసిన ఇసుక లారీ పదేపదే ఉప్పల్ ప్రాంతంలో విహరించడం వెనుక ఇలాంటి ‘సర్దుబాటు’ ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా చేస్తే...
నగరం నడిబొడ్డు హైదరాబాద్, చుట్టపక్క ల ఉన్న ప్రాంతాలు సైబరాబాద్, రాచ కొండ పరిధిల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే ‘నిషేధం’ విషయంలో మూడు కమిషనరేట్ల అధికారులూ సమన్వయంతో పని చేయాలి.
పగలు రాత్రి లేడా లేకుండా నగరం, కీలక శివారు ప్రాంతాల్లోకి లారీల రాకపోకల్ని పూర్తిగా నిషేధించాలి.
ఔటర్ రింగ్‌రోడ్ మినహా మరెక్కడా ఈ మృత్యుశకటాలు తిరక్కుండా చేయాలి. లోపల ఏరియాల్లో లోడింగ్, అన్‌లోడింVŠ కు కేవలం రాత్రి వేళల్లోనే అనుమతించాలి.
నిబంధనలు, నిషేధాల్ని అతిక్రమించిన భారీ వాహనాలను స్వాధీనం చేసుకునే దిశగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలి.
(ప్రమాదానికి కారణమైన లారీకి జారీ చేసిన చలాన్)
Comments
Please login to add a commentAdd a comment