
విలపిస్తున్న కుటుంబీకులు
రెబ్బెన(ఆసిఫాబాద్): భూ వివాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భూముల పంపకం విషయంలో తలెత్తిన గొడవలు చివరకు హత్యకు దారితీశాయి. వరుసకు తమ్ముడినే అన్న అతి కిరాతకంగా చంపిన ఘటన బుధవారం ఉదయం రెబ్బెన మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది.
మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. నాయిని లచ్చయ్య(33) వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయనకు భార్య ప్రమీల, కూతుళ్లు పోషక్క, అక్షయ ఉన్నారు.
లచ్చయ్యకు వరుసకు అన్న అయిన నాయిని వెంకటేశ్ గత 6 ఏళ్ల క్రితం తిర్యాణి మండలంలోని దేవాయిగూడ నుంచి ధర్మారం గ్రామానికి వలస వచ్చాడు. లచ్చయ్య ఇంటికి సమీపంలోనే అతను ఉంటున్నాడు.
ఈ క్రమంలో గత సంవత్సర కాలంలో లచ్చయ్యకు, వెంకటేశ్‌కు మధ్య భూముల పంపకం విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. పలుమార్లు పెద్ద సమక్షంలో పంచాయతీ పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు.
బుధవారం ఉదయం చేనులో దుక్కి దున్నేందుకు లచ్చయ్యతోపాట భార్య ప్రమీల నంబాలకు వెళ్లి ట్రాక్టర్‌ను మాట్లాడి ఇంటికి చేరుకున్నారు. అన్నం వండితే తిని చేనుకు వెళ్దామని లచ్చయ్య భార్యతో చెప్పడంతో ప్రమీల ఇంట్లోకి వెళ్లి వంట పనిలో నిమగ్నమైంది.
లచ్చయ్య మాత్రం ఇంటి ముందు మాట్లాడుకుంటూ ఉండగా గమనించిన వెంకటేశ్ గొడ్డలితో ఒక్కసారిగా లచ్చయ్య చెవి కింది భాగంపై దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై లచ్చయ్య అక్కడిక్కక్కడే ప్రాణాలు వదిలాడు.
విషయం తెలుసుకున్న రెబ్బెన సీఐ పురుషోత్తం వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు దారి తీసిన సంఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment