వెంకటనర్సయ్య – లక్ష్మినర్సమ్మ (ఫైల్)
అసలే వృద్ధాప్యం.. ఆపై అనారోగ్యం.. ఏ పని చేద్దామన్నా శరీరం సహకరించదు. సాకేందుకు కొడుకు లేడు. నిత్యం వ్యవసాయ పనులు చేస్తూ.. వచ్చిన పింఛన్‌తో బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూతురికి భారం కావద్దని పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నారు. ప్రతిరోజూ సాయినామస్మరణ చేసే ఆ దంపతులు.. బుధవారం రాత్రి కూడా జపించారు. గురువారం తెల్లారి చూసే సరికి విగతజీవులుగా కనిపించారు. ఈ విషాద సంఘటన సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో చోటుచేసుకుంది.
సైదాపూర్(హుస్నాబాద్) కరీంనగర్ : వారికి వయస్సు మీద పడింది. ఎటూవెళ్లలేని పరిస్థితి. కనీసం బుక్కెడు వండుకుందామన్నా.. శరీరం సహకరించని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వారు పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. ఎవరికి భారం కావద్దనుకున్నారో..? ఈ లోకంలో ఇక తమకు పనిలేదనుకున్నారో..? గానీ ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరమయ్యారు. ప్రతిరోజూ సాయినామస్మరణ చేసే ఆ దంపతులు.. రాత్రికూడా జపం చేసుకుని.. గురువారం తెల్లారేసరికి శవాలై కనిపించారు.
ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వెన్నంపల్లి గ్రామానికి చెందిన కస్తూరి వెంకటనర్సయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులు. వ్యవసాయం చేసుకుంటూనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాయి భక్తుడు కావడంతో కలిసిన ప్రతిఒక్కరినీ ‘సాయిరాం’ అనే పిలిచేవాడు. వీరికి ఒక్కగానొక్క కూతురు స్వరూపారాణి.
ఆమెను 30 ఏళ్లక్రితం మేనల్లుడు రమణాచారికి ఇచ్చి వివాహం చేశారు. అల్లుడు, బిడ్డను తన ఇంటి వద్దనే ఉంచుకుని తనకున్న భూమిని అప్పగించాడు. ఇన్నాళ్లు వెంకటనర్సయ్య చేతనైన పనులు చేసుకుంటూ.. పింఛన్ డబ్బులతో బతికారు. దంపతులిద్దరూ వృద్ధులయ్యారు. ఇటీవల లక్ష్మినర్సమ్మకు మోకాళ్లనొప్పులు అధికమయ్యాయి. వెంకటనర్సయ్యను భార్య ఆరోగ్యం ఇబ్బందిపెట్టింది.
ఈక్రమంలో బుధవారం రాత్రి ఎప్పటిలాగే సాయినామస్మరణ చేసుకున్న దంపతులు వెంకటనర్సయ్య (85), లక్ష్మినర్సమ్మ (78) ఇంటి గడియ పెట్టకుండానే క్రిమిసంహారక మందు తాగారు. ఎప్పటిలాగే ఉదయం స్వరూపారాణి వచ్చిచూసే సరికి విగతజీవులుగా కనిపించారు. దీంతో బంధువుల రోధనలు మిన్నంటాయి. వృద్ధాప్యంలో ఇతరులకు భారం కావొద్దని, అప్పుడప్పుడు సన్నిహితులతో చెప్పిన వెంకటనర్సయ్య.. తాను అలాగే వెళ్లిపోయాడని స్థానికులు చర్చించుకున్నారు. స్వరూపారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సైదాపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు.
వెంకటనర్సయ్య,లక్ష్మినర్సమ్మ మృతదేహాలు
Comments
Please login to add a commentAdd a comment