మృతి చెందిన వృద్ధురాలు దేవాదుల శ్యామల (ఫైల్) అనుమానిత వ్యక్తి నాగేశ్వరరావు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: నగల కోసం వృద్ధురాలి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. రాజమహేంద్రవరం, నారాయణపురం ఎఫ్‌సీఐ గోడౌన్స్ పక్కవీధి, సైక్లోన్ కాలనీలో నివసిస్తున్న దేవాదుల శ్యామల(60) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ సంఘటనలో నిందితులు రక్త సంబంధీకులేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒంటరిగా నివసిస్తున్న శ్యామల ఒంటిపై బంగారు నగలు ఉండడం గమనించిన రక్త సంబంధీకులు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం ఆమెను హత్య చేసి నగలు చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతురాలికి వరుసకు కుమారుడయ్యే ఇన్నీసుపేటకు చెందిన దేవాదుల నాగేశ్వరరావు అనే వ్యక్తిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు మృతురాలికి బావ గారి కుమారుడు. ఇతడికి వివాహం కాలేదు. ఈ నేపథ్యంలో చెడు వ్యసనాలకు బానిసైన నాగేశ్వరరావు అప్పుల పాలయ్యాడు. దీనితో పనిలేక జులాయిగా తిరుగుతూ ఉంటాడని, ఈ సంఘటనలో ఇతడి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు అదే కుటుంబంలో మృతురాలు ఒంటరిగా ఉంటుందని తెలిసిన రక్త సంబంధీకులెవరికైనా ఈ సంఘటనతో సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో బయటవారి వేలి ముద్రలు లభించలేదు.
ఎక్కువగా కుటుంబ సభ్యులవి లభించాయి. ఈ నేపథ్యంలో తెలిసిన వారే ఈ హత్యకు కారణమై ఉంటారని భావిస్తున్నారు. మృతురాలి వద్ద కొన్ని నగలు మాత్రమే చోరీకి గురై, మిగిలిన నగలు ఒంటిపై ఉండడం బట్టి చూస్తే చోరీలకు పాల్పడే వ్యక్తులు కాదని భావిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో పెద్ద కుమారుడు రంగ కుమార్ (విజిలెన్స్ శాఖలో అసిస్టెంట్ జియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు.)తో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్యంగా ఉన్న మృతురాలు, అంతలోనే మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్థిక అవసరాలు తీర్చుకొనేందుకు ఎవరైనా హత్య చేశారా! లేక వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందితే కుటుంబ సభ్యులు బంగారం చోరీ చేశారా? అనేది పోస్టు మార్టం రిపోర్టులో, పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలు ఎవరైనా వస్తే కిటికీలో నుంచే సమాధానం చెబుతుందని స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా పరిచయం ఉన్న వారు వస్తే ఇంటి తలుపులు తీస్తుందని, అప్పటి వరకూ ఇంట్లో తలుపులు వేసుకొని ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హత్య జరగడానికి ముందు వృద్ధురాలికి తెలిసిన వారే వచ్చి ఉంటారని, దీంతో ఇంటి తలుపులు తీసి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో నగల కోసం వృద్ధురాలిని హత్య చేసి, నగలతో పరారై ఉంటారని భావిస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు
పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment