పోస్టుమార్టం నిర్వహిస్తున్న వైద్యులు
భద్రాచలం: భద్రాచలంలో ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి అనిల్ రెడ్డిని పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాలు... పట్టణానికి చెందిన కాపుల ప్రవీణ్, గత నెల 15న విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతిచెందాడు. అతని మరణానికి అనిల్ రెడ్డి చర్యలే కారణమంటూ ప్రవీణ్ తమ్ముడు కాపుల ప్రకాష్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
తన భార్య శ్రావణి.. కాపురానికి రావటం లేదని, ఇందుకు అనిల్ రెడ్డి కారణమని భావించిన కాపుల ప్రవీణ్, తీవ్ర మనోవేదనతో గత నెల 15న తన ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. అతడిని తమ్ముడు ప్రకాష్ వెంటనే పట్టణంలోని మోహన్‌రావు ఆసుపత్రిలో చేర్పించాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడి పరిస్థితి అక్కడ మరింతగా క్షీణించి మృతిచెందాడు. చివరి క్షణాల్లో అతడి వాంగ్మూలాన్ని విజయవాడ భవానీపురం పోలీసులు నమోదు చేశారు. మృత దేహాన్ని కుటుంబీకులు భద్రాచలం తీసుకొచ్చి ఖననం చేశారు.
తన సోదరుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడి పోలీసులకు ప్రకాష్ ఫిర్యాదు చేశారు. ఎస్పీ అంబర్ కిషోర్ ఝాను కూడా కలిసి వివరించారు. దీంతో ఇక్కడి పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ రెడ్డితోపాటు శ్రావణిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. కేసు నమోదైన నేపథ్యంలో, పట్టణంలోని బస్టాండ్ ఎదురుగాగల సమాధుల స్థలంలో ఖననం చేసిన ప్రవీణ్ మృతదేహాన్ని శనివారం పట్టణ సీఐ సత్యనారాయణ రెడ్డి సమక్షంలో బయటకు తీయించారు. ఏరియా ఆసుపత్రి వైద్యుడు విజయలక్ష్మణ్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగింది. ఆ తరువాత శవాన్ని తిరిగి పూడ్చివేశారు. ప్రవీణ్ ఆత్మహాత్యకు కారణమైన అనిల్ రెడ్డి, శ్రావణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment