పవన్ మృతదేహం
ఖమ్మంక్రైం: తమలాగే కుమారుడు కూలి పనులు చేయకూడదని ఆ తల్లిదండ్రులు బావించారు.. స్తోమతకు మించి కుమారుడిని హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదివిస్తున్నారు.. అప్పటివరకు చదువులో రాణించిన ఆవిద్యార్థి ఒత్తిడికి గురయ్యాడో.. ఏమో తెలియదు కాని తమ బిడ్డకు 19 ఏళ్లకే నూరేళ్లు నిండుతాయని ఊహించని ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. విషాదకరమైన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన అల్లు ఆశీర్వాదం, నాగమణి దంపతుల కుమారుడు పవన్ ఇంటర్ వరకు ఖమ్మంలో చదివాడు. చదువులో కొంతమేరకు రాణిస్తుండటంతో హైదరాబాద్‌లోని సీవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఈనేపథ్యంలో అతను మానసిక ఒత్తిడికి గురయ్యాడో, మరే ఇతర కారణాలతో కాని ఫస్ట్ సెమిస్టర్‌లో పలు సబ్‌జెక్ట్‌లలో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం ఖమ్మంలోని ముస్తాఫానగర్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్న స్నేహితుల దగ్గరకు వచ్చాడు. ఖమ్మం వచ్చిన విషయం పవన్ తల్లిదండ్రులకు తెలియదు. ముభావంగా ఉన్నావు.. ఏమిటని స్నేహితులు అడుగగా ఏమీలేదని చెప్పాడు. గురువారం రాత్రి స్నేహితులు ఉంటున్న భవనం పక్కన ఉన్న భవంతిపైకి ఎక్కి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆ సమయంలో అతని స్నేహితుడు ఒకరు గదిలోనే చదువుకొంటున్నాడు. బయటకు వెళ్లిన పవన్ ఈ అఘాయిత్యానికి పాల్పడతాడని వారు ఊహించలేదు. పవన్ భవనంపై నుంచి కిందకు దూకటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే కేకలు వేయటంతో గదిలో చదువుకుంటున్న స్నేహితుడు పుల్లారావు, మరికొంత మందితో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి స్థానిక కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు అయిన పవన్ కొద్దిసేపు బాగానే మాట్లాడాడు. అపస్మారక స్థితిలోకి చేరుకొన్న అతడిని బతికించటానికి కిమ్స్ డాక్టర్ గంగ రాజు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ ..
తాను ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయం తీసుకొన్న పవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బై గాయ్స్’, ‘థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్ వండర్‌ఫుల్ లైఫ్’ .. అంటూ స్నేహితులకు మెసేజ్ చేశాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ తన స్నేహితులకు కూడా అనుమానం కలగకుండా ఇంగ్లిష్‌లో లేఖ రాసుకుని జేబులో పెట్టుకొన్నాడు. ఆ లేఖలో తాను చదవలేకపోతున్నానని, తనను ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివించారని, తాను తన కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలిపెట్టి వెళుతున్నానని రాసుకున్న లేఖను పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. అయితే పవన్ బాగానే చదివేవాడని.. ఎందుకు ఒత్తిడికి గురయ్యాడో తెలియటంలేదని.. ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడుకాదని బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. పవన్ మృతితో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పవన్ తండ్రి ఆశీర్వాదం ఫిర్యాదు మేరకు వనటౌన్ ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు.
లింగాలలో విషాదచాయలు..
కల్లూరురూరల్: ఖమ్మంలో ఇంజనీరింగ్ విద్యార్థి పవన్ ఆత్మహత్యకు పాల్పడటంతో కల్లూరు మండలం లింగాల గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న తల్లిదండ్రలు వెంటనే ఖమ్మం చేరుకుని కొనఊపిరితో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డావని అడగగా ఏమీ లేదని చెప్పి మృతి చెందాడు. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment