పాలకొల్లులో మనవడి ఆఖరిచూపు కోసం ఎదురుచూస్తున్న అమ్మమ్మ సునీత, బంధువులు, మృతుడు వివేక్
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : విదేశీ చదువుల కోసం లాత్వియా దేశం వెళ్లిన పాలకొల్లు మండలం గోరింటాడకు చెందిన వడల వివేక్ (19) శనివారం రాత్రి అక్కడ నదిలో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతుడు అమ్మమ్మ సునీత పాలకొల్లులోని క్రిష్టియన్‌పేటలో ఉంటోంది. మనవడి మృతి వార్త తెలిసి కన్నీరుమున్నీరవుతోంది. వివేక్ తండ్రి శ్యాంబాబు గత 20 ఏళ్ల నుంచి కువైట్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి స్వర్ణలత కూడా అక్కడే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వివేక్ ఈ ఏడాది జనవరిలో బీఎస్సీ మెకానికల్ ఇంజినీరింగ్ చదివే నిమిత్తం లాత్వియా దేశంలోని రిగా యూనివర్సిటీలో చేరారు. మొదటి సెమిష్టర్ పరీక్షలు పూర్తి చేశారు.
మరో వారంరోజుల్లో వివేక్ తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్న కువైట్ నగరానికి రానున్నారు. అయితే ఈ లోగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివేక్ కువైట్‌లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ 8వ తరగతి వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ వరకు చదివారు. అనంతరం ఒక ఏడాది ఖాళీగా ఉన్నారు. గతేడాది నవంబర్‌లో రిగా యూనివర్సిటీలో బీఎస్సీ మెకానికల్ ఇంజనీరింగ్ సీటు ఖరారయ్యింది. ఈ ఏడాది జనవరిలో యూనివర్శిటీలో చేరారు. యూనివర్సిటీ హాస్టల్‌లో సీటు లేకపోవడంతో మన రాష్ట్రానికి చెందిన మిత్రులతో కలిసి ప్రత్యేకంగా నివాసం ఉంటున్నారు.
రాత్రి సమయంలో బయటకు తీసుకెళ్లిన మిత్రుడు
మృతుడు వివేక్ ఉంటున్న గదికి వేరొక మిత్రుడు వచ్చి బయటకు తీసుకువెళ్లినట్లు సమాచారం. వెంటనే తిరిగి వస్తాను, గదికి లోపల గడియ పెట్టవద్దు అని మిత్రులకు చెప్పి వివేక్ బయటకు వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. తనను తీసుకువెళ్లిన మిత్రుడు దగ్గరలోని నదికి తీసుకువెళ్లి స్నానం చేయడానికి నదిలో దిగినట్లు చెబుతున్నారు. వివేక్‌ను తీసుకువెళ్లిన మిత్రుడు మునిగిపోతూ కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న పోలీసులు అతడ్ని రక్షించారు. అయితే వివేక్ అప్పటికే నదిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. నీళ్లంటే భయపడే తన మేనల్లుడు వివేక్‌ను అతని స్నేహితుడు వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అస్సాంలో ఆర్మీలో సుబేదార్‌గా పనిచేస్తున్న వర్థనపు స్టీవెన్‌సన్ స్థానిక విలేకరులకు తెలిపారు. లాత్వియాలో వివేక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మంగళవారం సాయంత్రం బంధువులకు అప్పగిస్తారని సమాచారం. అక్కడ నుంచి విమానంలో ఉక్రెయిన్ నుంచి న్యూఢిల్లీ మీదుగా విజయవాడకు విమానంలో తీసుకువచ్చి అక్కడ నుంచి పాలకొల్లు మండలం గోరింటాడకు మృతదేహాన్ని తీసుకురానున్నట్లు స్టీవెన్‌సన్ తెలిపారు.కువైట్‌లో ఉన్న తల్లిదండ్రులు వర్థనపు శ్యాంబాబు–స్వర్ణలత కన్నకొడుకుని కడసారా చూసుకునేందుకు కువైట్ నుంచి నేరుగా గోరింటాడ వస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment