
మహేష్ మృతదేహం
విజయపురి సౌత్: కుటుంబ ఆర్థిక భారంతో ఆటో నడుపుకుంటూ ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువకుడిని మృత్యువు కాటు వేసింది. విధి ఆడిన వింత నాటకంలో విగత జీవిగా మారాదు. చదువు కోసం నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనే అనే ఆశలు అడియాస అయ్యాయి. కర్నూల్ జిల్లా డోన్ మండలం, కొండాపేట గ్రామానికి చెందిన ఈడిగ మహేష్ మాచర్ల పట్టణంలో రూమ్ అద్దెకు తీసుకొని అలుగురాజుపల్లిలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. రోజూ కళాశాలకు వెళ్లి వచ్చిన తరువాత రాత్రి గుంటూరు నుంచి మాచర్ల వచ్చే రైలు ప్రయాణికుల కోసం తన ఆటోను తీసుకొని స్టేషన్‌కు చేరుకుంటాడు.
మంగళవారం రాత్రి కూడా 10గంటలకు స్నేహితుడు రాజేష్‌తో కలసి ప్రయాణికులను తీసుకొని విజయపురిసౌత్‌లో దింపి విడిచిపెట్టి మాచర్లకు తిరుగు ప్రయాణమయ్యాడు. సరిగ్గా చింతలతండా మూలమలుపు వద్ద రాగానే ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆటో నడుపుతున్న మహేష్ తలకు, పక్కటెములకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక కూర్చున్న రాజేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన అదే ఆటోలో మహేష్‌ను స్నేహితుడు రాజేష్ మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. మృతుని తండ్రి కృష్ణాగౌడ్, తల్లి రామలక్ష్మిలకు ముగ్గురు సంతానం కాగా వీరిలో మహేష్ పెద్దవాడు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందాడని తండ్రి కృష్ణా గౌడ్ విలపిస్తున్న తీరు పలువురిని కలచి వేసింది.
Comments
Please login to add a commentAdd a comment