ప్రైవేటు ఆసుపత్రి వద్ద విలపిస్తున్న విద్యార్థి కుటుంబీకులు, మృతిచెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మహబూబ్‌బాషా
రాజంపేట(వైఎస్సార్‌కడప): స్థానికంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న మహమ్మద్‌బాషా అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా, సుబాన్‌ల పెద్ద కుమారుడు మహమ్మద్‌బాషా రాజంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. బోయనపల్లెలో అద్దె గదిలో సహచర విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. అయితే ఏమి జరిగిందో తెలియదు కాని శనివారం రాత్రి భోజనం కోసం బయటకు వచ్చిన మహబూబ్‌బాషా విషద్రావణం తాగి రూముకు వెళ్లాడు. ఈ విషయం తోటి మిత్రులకు తెలిపాడు.
వారు హుటాహుటిన ఆర్‌ఎస్‌రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేశాక కోలుకున్నాడు. ఆ తర్వాత నర్సు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి మృతి చెందాడని తోటి విద్యార్థులు, బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఎదుట కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజంపేట రూరల్ సీఐ నరసింహులు మాట్లాడుతూ విద్యార్ధి మహబూబ్‌బాషా విషం తీసుకోవడం వల్ల చనిపోయాడా.. వైద్యం వికటించి మృతి చెందాడా అనేది పోస్టుమార్టం నివేదికలో తేలుతుందన్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment