గుండె ‘చెరువు’ | engineering students dead in pond | Sakshi
Sakshi News home page

గుండె ‘చెరువు’

Published Mon, Jan 8 2018 12:15 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

engineering students dead in pond - Sakshi

ఎదిగొచ్చిన కొడుకులు ఉన్నత విద్యనభ్యసిస్తుంటే సంబరపడిన ఆ కన్నగుండెలు బద్దలయ్యాయి.కాలేజీకి వెళ్లారనుకున్న తనయులు కళ్లముందే విగతజీవులై పడి ఉండడం చూసి తల్లడిల్లాయి. ఎన్నో ఆశలతో చదివిస్తున్న వారసులు అనంత లోకాలకు వెళ్లిపోడంతో పుట్టెడు దుఃఖంతో కన్నీరుమున్నీరయ్యాయి.

ఏలూరు టౌన్‌/పెదవేగి రూరల్‌: సరదాగా గడుపుదామని జామతోటలోకి వెళ్ళి.. పక్కనే ఉన్న చెరువులోకి ఈతకు దిగిన నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు విగతజీవులయ్యారు. ముగ్గురు స్నేహితులు మునిగిపోతుంటే కాపాడేందుకు వెళ్లిన మరో విద్యార్థి వారితోపాటే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన ఏలూరు పరిసరాల్లో కలకలం రేపింది. తల్లిదండ్రుల రోదనలు, బంధువుల హాహాకారాలతో పెదవేగి మండలం భోగాపురంలోని చెరువు ప్రాంతం మార్మోగింది.

రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ మూడో సంవత్సరం చదువుతున్న కామవరపుకోటకు చెందిన కె.హరికృష్ణ(21), చింతలపూడికి చెందిన గుమ్మి విజయశంకర్‌(22), ఏలూరుకు చెందిన ఎస్‌కే పరశురాం(23)తోపాటు ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చింతలపూడికి చెందిన కోటసాయిరాజు (22)  శనివారం మధ్యాహ్నం తరగతులకు డుమ్మాకొట్టి కళాశాల సమీపంలోని భోగాపురం వద్ద జామతోటలోకి వెళ్లారు. మద్యం తాగి.. వెంట తెచ్చుకున్న బాక్సుల్లోని భోజనాన్ని తిన్నారు. ఆ తర్వాత సరదాగా కాసేపు గడిపారు. తోటలోని జామకాయలు కోసుకుతిన్నారు. జామతోట సమీపంలోనే చెరువు ఉండడంతో అందులో ముగ్గురు ఈతకు దిగారు. చెరువు బాగా లోతుగా ఉండడంతో మునిగిపోయారు. గట్టుపై నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్న విద్యార్థి కోట సాయిరాజు దుస్తులతోనే చెరువులోకి దిగాడు. స్నేహితులను కాపాడదామని చెరువులో దిగి వారితోపాటు విగతజీవుడైనట్టు తెలుస్తోంది.

ఆదివారం వెలుగులోకి
ఈ ఘటన శనివారం జరిగినా ఆదివారం వెలుగులోకి వచ్చింది. భోగాపురం చెరువు సమీపంలోని జామతోటలో విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు, మోటారు సైకిల్, చెరువుగట్టుపై దుస్తులు ఉండడంతో స్థానికులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు, త్రీటౌన్‌ సీఐ పి.శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ వెంకటేశ్వరరావు, పెదవేగి ఎస్సై వి.కాంతిప్రియ, ఏలూరు రూరల్‌ ఎస్సై నాగేంద్రప్రసాద్‌  ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో పైకితేలిన మృతదేహాన్ని స్థానికులు బయటకు తీసుకువచ్చారు. మిగిలిన ముగ్గురి మృతదేహాల ఆచూకీ తెలియకపోవటంతో జిల్లా అగ్నిమాపక దళ అధికారి ఏవీ శంకరరావు ఆధ్వర్యంలో సిబ్బంది  బోటుపై చెరువులో గాలించి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మెసేజ్‌ ‘మిస్‌’ చేసిందా ?
సాధారణంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులు తరగతులకు హాజరుకాకుంటే వెంటనే వారి తల్లిదండ్రులకు యాజమాన్యాలు మెసేజ్‌ ఇస్తాయి. అయితే రామచంద్ర ఇంజినీరింగ్‌ కాలేజీలో శనివారం జరిగిన  చిన్న పొరపాటు  విద్యార్థుల మృతికి పరోక్షంగా కారణమైందని విద్యార్థుల బంధువులు ఆరోపిస్తున్నారు. కనీసం మెసేజ్‌ వచ్చి ఉంటే తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఆరా తీసేవారమని, ఇంత ఘోరం జరిగేది  కాదేమోనని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో జాతీయ సెమినార్‌ నిర్వహించే ఏర్పాట్లలో కార్యాలయ సిబ్బంది బిజీగా ఉండడంతోనే శనివారం మెసేజ్‌ పంపలేదని ప్రిన్సిపల్‌ డి.సంజయ్‌ వివరణ ఇచ్చారు.

రోదనల హోరు
ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారనే విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులతోపాటు తోటి విద్యార్థులు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కో మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీస్తుంటే వారి తల్లి్లదండ్రులు, బంధువులు తీవ్రంగా రోదించారు. వారి హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది.  నలుగురు విద్యార్థులు ప్రతిభావంతులే చనిపోవటం కలచివేసింది. వాళ్ళు బాగా చదువుతారు. మంచి ప్రతిభావంతులు. వారికి 90శాతం హాజరు ఉంటుంది. సాధారణంగా తరగతులకు రాకుండా ఉండరు. శనివారం కాలేజీకి రాలేదు. హాజరుపట్టీలో ఆబ్‌సెంట్‌ వేసిఉంది. ఈరోజు ఉదయం మృతిచెందారనే సమాచారం తెలిసి వెంటనే ఏఓ సాయికృష్ణతో కలిసి వచ్చా.   డి.సంజయ్, ప్రిన్సిపల్, రామచంద్ర ఇంజినీరింగ్‌ కాలేజీ

ఘటన బాధాకరం
ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఇలా చనిపోవటం బాధాకరం. సరదాగా వచ్చి ఇలా మృత్యువాత పడ్డారు. మద్యం బాటిళ్లు  ఘటనా స్థలంలో ఉన్నాయి. మద్యం తాగి ఉంటారని భావిస్తున్నాం. పోస్టుమార్టం చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. కళాశాలలకు హాజరుకాని విద్యార్థుల గురించి యాజమాన్యాలు సమాచారం అందించాలి. విద్యార్థులు వ్యసనాలు అలవాటు చేసుకోకూడదు. ఇది దురదృష్టకర ఘటన.  
– కె.ఈశ్వరరావు,  డీఎస్పీ, ఏలూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement