హత్య జరిగిన నివాసం (ఇన్ సెట్‌లో) ఉమామహేశ్వరి (ఫైల్)
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరునల్వేలిలో మంగళవారం ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో డీఎంకే పార్టీకి చెందిన మాజీ మేయర్ ఉమామహేశ్వరి(61), ఆమె భర్త మురుగ శంకరన్(65), పనిమనిషి మారి(30) ఉన్నారు. తిరునల్వేలి జిల్లాలో ఉమామహేశ్వరి, మురుగ శంకరన్ కుటుంబం ఒకప్పుడు డీఎంకేలో క్రియాశీలకంగా వ్యవహరించింది. తిరునల్వేలి కార్పొరేషన్‌కు తొలి మహిళా మేయర్‌గా ఉమామహేశ్వరిని డీఎంకే దివంగత అధినేత కరుణానిధి నియమించారు. ప్రస్తుతం వయోభారం, అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి, మురుగ శంకరన్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వీరు పాళయం కోట్టై సమీపంలోని నాగుర్ కోయిల్ ప్రధాన మార్గం రెడ్డియార్‌పట్టిలో నివసిస్తున్నారు.
పనిమనిషి మారి కోసం ఆమె తల్లి మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఈ ఇంటి వద్దకు వచ్చింది. ముందువైపు తలుపు తెరుచుకోకపోవడంతో వెనుక వైపు వెళ్లగా, అక్కడ రక్తపు మరకలు ఉండడంతో ఆందోళనకు గురై కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ఉమామహేశ్వరి, మురుగ శంకరన్, పనిమనిషి మారి రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ముగ్గురిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యలకు ఆస్తి వివాదాలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment