tirunelveli
-
భారీ వర్షాలతో తమిళనాడు విలవిల (ఫొటోలు)
-
ప్రసిద్ధ కడాయి హల్వా యజమాని ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన తిరునల్వేలి ఇరుట్టు కడాయి హల్వా యజమాని హరిసింగ్(70) కరోనా వ్యాధి సోకడంతో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన అనూహ్యంగా ఉరివేసుకుని చనిపోవడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. అభిమానులు ట్విటర్లో హరిసింగ్ కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. యూరినరీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సింగ్‌ను మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా గురవారం ఉదయం పాజిటివ్ గా తేలడంగా ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరోవైపు హరిసింగ్ అల్లుడు కూడా కోవిడ్-19 బారిన పడినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగిస్తామని తిరునెల్వేలి డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) ఎస్ శరవణన్ తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది ఇరుట్టు కడాయి హల్వా. 100 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ దుకాణం ఇప్పటికీ తిరునల్వేలిలో పర్యాటక కేంద్రంగా ఉందంటే ఈ హల్వా ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. చదవండి : కరోనా మందు : మరిన్ని చిక్కుల్లో రాందేవ్ -
ఆ వృద్ధ దంపతులకు ప్రభుత్వ పురస్కారం
సాక్షి, చెన్నై : తమిళనాడు తిరునల్వేలి జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు తమపై దాడికి దిగిన దొంగలకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. దొంగలకు ఏ మాత్రం బెదరకుండా షణ్ముగవేల్, సెంతామరై దంపతులు పోరాడిన తీరు స్ఫూర్తి కలిగించేలా ఉంది. అయితే షణ్ముగవేల్ దంపతుల ధైర్యానికి మెచ్చుకుని తమిళనాడు ప్రభుత్వం వారికి సాహస పురస్కారం అందజేసింది. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గురువారం షణ్ముగవేల్ దంపతులకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ పురస్కారం ప్రధానం చేశారు. ఈ అవార్డు తీసుకోవడం కోసం షణ్ముగవేల్ దంపతులు బుధవారం సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు. తిరునల్వేలి జిల్లా కలెక్టర్ శిల్ప ప్రభాకర్.. సాహస పురస్కారం కోసం ఈ వృద్ద దంపతుల పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ అవార్డు తీసుకున్న అనంతరం షణ్ముగవేల్ మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. తమ ఫిరాద్యుపై వేగంగా స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తాము నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తామని నమ్ముతున్నట్టు చెప్పారు. దొంగలపై ప్రాణాలకు తెగించి ఆ వృద్ధ దంపతులు ప్రదర్శించిన సాహసంపై ఈ కింది లింక్ క్లిక్ చేయండి చదవండి : దుండగులపై వృద్ధ దంపతుల ఎదురుదాడి! -
దుండగులకు చుక్కలు చూపిన వృద్ధ దంపతులు!
సాక్షి, చెన్నై : తమపై దాడికి దిగిన దుండగులకు వృద్ధ దంపతులు చుక్కలు చూపించారు. వారిని తీవ్రంగా ప్రతిఘటించి పారిపోయేలా చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కడయం పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటి బయట కూర్చున్న వృద్ధుడిపై వెనకగా వచ్చిన ఓ దుండగుడు..అతడికి ఉరి బిగించేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ భార్యను పిలిచాడు. ఇంతలో మరో ఆగంతకుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. కాగా దుండగుల చేతుల్లో కత్తులు ఉన్నప్పటికీ సదరు వ్యక్తి, అతడి భార్య ఏమాత్రం భయపడకుండా చేతికందిన వస్తువులతో వారిపై దాడి చేశారు. దీంతో కంగుతిన్న దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఎంతో ధైర్యంగా ఆగంతకులను ఎదుర్కొన్న వృద్ధ దంపతులను పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక వృద్ధ దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తుల వివరాలు తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని ప్రకటన విడుదల చేశారు. -
మాజీ మహిళా మేయర్ దారుణ హత్య..!
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరునల్వేలిలో మంగళవారం ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో డీఎంకే పార్టీకి చెందిన మాజీ మేయర్ ఉమామహేశ్వరి(61), ఆమె భర్త మురుగ శంకరన్(65), పనిమనిషి మారి(30) ఉన్నారు. తిరునల్వేలి జిల్లాలో ఉమామహేశ్వరి, మురుగ శంకరన్ కుటుంబం ఒకప్పుడు డీఎంకేలో క్రియాశీలకంగా వ్యవహరించింది. తిరునల్వేలి కార్పొరేషన్‌కు తొలి మహిళా మేయర్‌గా ఉమామహేశ్వరిని డీఎంకే దివంగత అధినేత కరుణానిధి నియమించారు. ప్రస్తుతం వయోభారం, అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి, మురుగ శంకరన్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వీరు పాళయం కోట్టై సమీపంలోని నాగుర్ కోయిల్ ప్రధాన మార్గం రెడ్డియార్పట్టిలో నివసిస్తున్నారు. పనిమనిషి మారి కోసం ఆమె తల్లి మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఈ ఇంటి వద్దకు వచ్చింది. ముందువైపు తలుపు తెరుచుకోకపోవడంతో వెనుక వైపు వెళ్లగా, అక్కడ రక్తపు మరకలు ఉండడంతో ఆందోళనకు గురై కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ఉమామహేశ్వరి, మురుగ శంకరన్, పనిమనిషి మారి రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ముగ్గురిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యలకు ఆస్తి వివాదాలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇస్రో క్యాంపస్‌లో విస్ఫోటనమా..!
సాక్షి, చెన్నై: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తమిళనాడు క్యాంపస్‌లో విస్పోటనం జరిగిందంటూ దుష్ప్రచారం జరగడంపై సంబంధిత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇస్రోపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని క్యాంపస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారం చేస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత జూన్ 23న తిరునెల్వేవి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో క్యాంపస్‌లో చిన్న మంట రాజుకుని పొగలు వ్యాపించాయని ప్రచారం జరిగింది. దీనిపై యాంటీ నక్సల్ టీమ్, సీఐఎస్ఎఫ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. క్యాంపస్‌కు 20 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోగా.. క్యాంపస్‌లో ప్రమాదం జరిగిందంటూ ప్రచారం చేశారని విచారణాధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు. -
సినీ తరహా దొంగతనం
రూ.15 కోట్ల బంగారం కొట్టేశారు! తిరునల్వేలి(తమిళనాడు): ఒక సినిమాను చూసిన తర్వాత అచ్చం ఆసినిమాలో హీరోలా ఉండాలి. అతనిలా ఎదగాలి అనుకుంటాం. సినిమాలో హీరో దొంగ తనం చేస్తే ఆసినిమా తరహాలో దొంగతనం చెయ్యాలి అనుకుంటారు. ఈ దొంగలు ఏ సినిమాను, ఏ హీరోను ఫాలో అయ్యారో కానీ అచ్చం సినిమా తరహాలోఈ దొంగతనం చేశారు . సినిమాలో దొంగలు ముందుగానే రిక్కి నిర్వహించి దొంగతనం చేస్తారు. రిక్కి నిర్వహించిన ఈదొంగలు ఏకంగా భవనం పైకప్పుకు కన్నం వేసి దొంగతనం చేశారు. తిరునల్వేలిలో దొంగలు రెచ్చిపోయి. ఓ నగల దుకాణానికి కన్నం వేసి రూ.15 కోట్ల విలువైన బంగారాన్ని ఎత్తుకుపోయారు. గురువారం రాత్రి మురుమన్కురిచిలోని ఓ నగల దుకాణంలో పైకప్పునకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన నలుగురు దుండగులు 60 కిలోల బంగారం ఆభరణాలను మూటగట్టుకు పోయారు. పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం నుంచి దుకాణంపైకి చేరుకున్న దుండగులు కప్పునకు రంధ్రం వేసి లోపలికి ప్రవేశించారని, శుక్రవారం ఉదయం దుకాణం సిబ్బంది వచ్చి చూసేదాకా విషయం బయటకు తెలియలేదు. ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు అధికారులు తెలిపారు. -
తాటాకు బుట్టల్లో చికెన్!
కేకే నగర్: మార్కెట్ నుంచి చికెన్ ఎలా తెచ్చుకుంటారు? ఇదేం పిచ్చి ప్రశ్న.. సంచులతో అని తెలియదా అంటారా. పల్లెటూర్ల అయితే గిన్నెల్లో కూడా తెచ్చుకుంటారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో తాటాకు బుట్టల్లో కోడిమాంసం తెచ్చుకుంటున్నారు. తిరునల్వేలి జిల్లా కార్పొరేషన్లో ప్లాస్టిక్ నిషేధం విధించడంతో వ్యాపారులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా తాటాకు బుట్టల్లో కోడిమాంసం విక్రయిస్తున్నారు. తిరునల్వేలి జిల్లాలో ఆరోగ్యశాఖ అధికారులు దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం రోజున ప్రజల నుంచి ప్లాస్టిక్ వస్తువులను అధికారులు తీసుకునే పద్ధతిని కార్పొరేషన్ అధికారులు పరిచయం చేశారు. మిగతా రోజుల్లో జరిమానా వసూలు చేస్తున్నారు. మాంసం దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లను వినియోగించే వారిపై జరిమానా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాళయంకోట ఎస్పీ కార్యాలయం ఎదురుగా దుకాణాల్లో తాటాకు బుట్టల్లో మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇందుకు తిరుచెందూర్ సమీపంలోని గ్రామాల నుంచి వందల సంఖ్యలో తాటాకు బుట్టలను వ్యాపారులు కొంటున్నారు. దీనిపై మాంసం దుకాణం యజమాని రజాక్ మాట్లాడుతూ కార్పొరేషన్ చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ చర్యలకు వ్యాపారులు సహకరిస్తున్నారని, ఇందులో భాగంగా తాటాకు బుట్టల్లో మాంసం విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ కవర్లలో మాంసం గంట దాటితే చెడిపోయే అవకాశం ఉందని, అదే తాటాకు బుట్టలో ఆరు గంటల సేపు చెడిపోకుండా ఉంటుందని తెలిపారు. తాటాకు బుట్టల ద్వారా కుటీర పరిశ్రమ కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. -
టెకీ స్వాతి హత్యకేసులో నిందితుడి అరెస్ట్
చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునల్వేలిలో తలదాచుకుంటున్న రామ్‌కుమార్‌ను శుక్రవారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించిన నిందితుడు తన వద్ద ఉన్న బ్లేడుతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతన్ని తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. తిరునల్వేలి చెందిన రామ్‌కుమార్ ఇంజినీరింగ్ ముగించుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో చెన్నైకు వచ్చినట్లు గుర్తించారు. స్వాతి నివాసం ఉండే ప్రాంతంలోనే రామ్ హాస్టల్లో ఉంటున్నాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత నెల 24న చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్లో స్వాతిని అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. -
హిట్ అండ్ రన్ కేసు: ఇద్దరు మృతి
తిరునెల్వలి: హిట్ అండ్ రన్ కేసులో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడులో నాగనూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో తిరునెల్వలి ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను ఎదురుగా వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. విజయనారాయణ గ్రామం నుంచి బైక్‌పై తిరిగివస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఎస్. పరమశివన్ (18), సుదలిముత్తు (17) అనే ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. -
200 నాటు బాంబులు స్వాధీనం
తిరునెల్వెలి: తమిళనాడు పోలీసులు భారీ మొత్తంలో బాంబులు స్వాధీనం చేసుకున్నారు. తిరునెల్వెలి జిల్లాలోని కోస్తా తీర ప్రాంతమైన కూతన్ కుజి గ్రామంలో 200 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. సముద్ర తీరంలోని ఇసుకలో వాటిని పాతిపెట్టి ఉంచగా పోలీసులు గుర్తించారు. ఈ బాంబులను చేపల వేటకు వెళ్లే సమయంలో ఉపయోగించడంతోపాటు మత్యకారుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా వాటిని విరివిగా ఉపయోగించి ప్రాణనష్టం కూడా కలిగాస్తారని పోలీసులు తెలిపారు. -
'విద్యాకుసుమాలకు కులరంగులేంటి'
చెన్నై: తమిళనాడు విద్యాశాఖ అధికారులకు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పాఠశాల విద్యార్థుల విషయంలో కుల వివక్షకు ఎలా దిగుతున్నారో తమకు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని పాఠశాలల్లో పాఠశాల విద్యార్థులు భిన్న రంగుల్లో వస్త్రాలు ధరిస్తున్నారు. ఆయా రంగుల దుస్తుల ప్రకారం వారిది ఏ కులమో తెలుస్తుందట. ఈ విషయం ఆయా పత్రికల్లో కథనాలుగా వెలువడటంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ అంశాన్ని సీరియస్ గా భావించి సుమోటోగా స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ తమిళనాడులోని సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది. -
తమతో ఫోటోలు దిగాలని వేధింపులు
తిరునవ్వేలి: ముసుగు ధరించి వచ్చిన దుండగులు గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోకి చొరబడి ఇద్దరు బాలికలపై కత్తులపై దాడి చేసిన ఘటన తమిళనాడులోని తిరునవ్వేలిలో కలకలం రేపింది. గాయపడిని బాలికలను అంబాయ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో కడలూరు-పొత్తపాతూరు మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. అయితే గతవారం రోజులుగా బాలికలను కత్తులతో బెదిరించి అల్లరి పెడుతున్న ఐదుగురిలో ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తమతో కలిసి సెల్‌ఫోన్ లో ఫోటోలు దిగాలని బాలికలను వేధించారని పోలీసులు తెలిపారు. పారిపోయి ముగ్గురు ఇద్దరు బాలికలపై దాడికి పాల్పడివుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
'దృశ్యం' కోసం.. భాష నేర్చుకుంటున్న కమల్
నటన విషయంలో తాను నిత్య విద్యార్థినని చెప్పుకొంటుంటారు సకల కళా వల్లభుడు కమల్ హాసన్. ఆ విషయం ఏదో చెప్పి ఊరుకోవడం వేరు.. నిజంగా ఆచరించడం వేరు. అలా ఆచరించేవాళ్లలో ముందుంటారు కమల్. ఇప్పుడు తాను తాజాగా నటిస్తున్న 'దృశ్యం' తమిళ రీమేక్ 'పాపనాశం' కోసం ఇప్పుడు కొత్తగా తిరునల్వేలి యాసను ఆయన నేర్చుకుంటున్నారు. మళయాళం, కన్నడ, తెలుగు భాషల్లో హిట్టయిన దృశ్యం సినిమాను తమిళంలో కమల్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొంత భాగంలో కమల్ హాసన్ తిరునల్వేలి యాస మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆయన తన సినిమాల్లో ఎప్పుడూ ఈ యాస మాట్లాడలేదు. దాంతో.. ఇప్పుడు కొత్తగా రచయిత సుగ దగ్గర ఆ యాసలో శిక్షణ పొందుతున్నాడని మరో రచయిత జయమోహన్ తెలిపారు. ఈ సినిమాకు డైలాగులు రాసింది జయమోహనే. ఈ సినిమాలో.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ గౌతమి నటిస్తోంది. -
ప్రేమ వివాహం చేసుకుందని ...
తిరునల్వేలి సమీపంలో ప్రభుత్వ బస్సును అటకాయించి ప్రేమ వివాహం చేసుకున్న యువతిని ఒక ముఠా కారులో కిడ్నాప్ చేసింది. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రేమికుడు దాడికి గురయ్యాడు. దీనికి సంబంధించి మహిళా సబ్ఇన్స్పెక్టర్ సహా నలుగురిపై కేసు దాఖలైంది. రాధాపురం సమీపం ఆవరై కుళం అంబలవానపురానికి చెందిన రాజదురై కుమారుడు శంకర్ (26). ఆరల్‌వాయ్‌మొళిలోగల కళాశాలలో చదువుతున్నారు. ఇతనికి, కన్యాకుమారి జిల్లా రామపురం సమీపాన కులశేఖరన్ పుదూర్‌కు చెందిన ఇసక్కి యప్పన్ కుమార్తె గంగ (21)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిరువురు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో గంగా తల్లిదండ్రులు వివాహానికి వ్యతిరేకత తెలిపారు. ప్రేమికులు ఇరువురు స్నేహితుల సాయంతో ఇడలాకుడి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 10, మార్చి 2014న రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. గంగను విడిపించాలని కోరుతూ ఆమె తండ్రి ఇసక్కియప్పన్ మదురై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సుశీంద్రం సబ్ ఇన్స్పెక్టర్ జయంతి, పోలీసులు విచారణ జరిపి, గంగా, ఆమె ప్రేమికుడు శంకర్లను మదురై హైకోర్టులో సోమవారం హాజరుపరిచారు. ఆ సమయంలో గంగ తన భర్త శంకర్‌తోనే జీవిస్తానని తెలిపింది. దీంతో గంగ, ఆమె తల్లిదండ్రులు ప్రేమికుడు శంకర్, సోమవారం సాయంత్రం ప్రభుత్వ బస్సులో నాగర్‌కోయిల్‌కు బయలుదేరి వచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ జయంతి కూడా వారితో వచ్చారు. నాంగునేరి టోల్‌గేట్‌కు అర్ధరాత్రి 11 గంటల సమయంలో బస్సు చేరుకోగా, అక్కడికి కారులో వచ్చిన నలుగురు మారణాయుధాలతో బస్సును అటకాయించి గంగను కిడ్నాప్ చేశారు. శంకర్ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అతనిపై దాడి చేసిన ముఠా గంగను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది. దాడిలో గాయపడ్డ శంకర్‌ను నాంగునేరి ఆస్పత్రికి తరలించారు. గంగను కిడ్నాప్ చేస్తున్న సమయంలో బస్సులో ఉన్న ఎస్ఐ జయంతి, సిబ్బంది కిడ్నాప్ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. శంకర్ నాంగునేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగకుమారి విచారణ జరిపి గంగ తండ్రి ఇసక్కియప్పన్, తల్లి లక్ష్మి, బంధువు సుబ్బయ్య, సబ్ ఇన్స్పెక్టర్ జయంతిపై కేసు దాఖలు చేశారు. -
బోరు బాలుడు క్షేమం
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కుంతలపురిలో బోరు బావిలో పడిపోయిన బాలుడిని అయిదు గంటల ప్రయత్నం తరువాత క్షేమంగా వెలికితీశారు. అదృష్ట వశాత్తూ కేవలం 20 అడుగుల లోతు వరకే బాలుడు పడిపోవడంతో ఆయన్ని ఎర్త్ మూవర్ల వంటి పరికరాలను ఉపయోగించి క్షేమంగా బయటకి తీశారు. బాలుడు మరింత కిందకి జారిపోకుండా చర్యలు చేపట్టడంతో క్షేమంగా వెలికితీయడం సాధ్యమైంది. రెండున్నరేళ్ల ఆ బాలుడు తండ్రి వెనకే నడుస్తూ వెళ్తూండగా, ఉపయోగంలో లేని తెరిచి ఉన్న బోర్ వెల్ లో పడిపోయాడు. తమిళనాడులో ఈ నెల ఇది రెండో బోరుబావి సంఘటన. ఏప్రిల్ 6 న విల్లుపురం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరులో ఒక బాలిక పడిపోయింది. మూడేళ్ల ఆ బాలిక చనిపోయింది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూండటంతో తమిళనాడు హైకోర్టు ఉపయోగంలో లేని బోరుబావులను మూసేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. -
బోరుబావి నోట్లోకి మరో బాలుడు
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కుంతలపురిలో రెండున్నరేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. ఆ బాలుడిని కాపాడేందుకు అధికారులు ముమ్మరం చేశారు. రెండున్నరేళ్ల ఆ బాలుడు తండ్రి వెనకే నడుస్తూ వెళ్తూండగా, ఉపయోగంలో లేని తెరిచి ఉన్న బోర్ వెల్ లో పడిపోయాడు. అసలు బాలుడు ఎంత లోతులో ఉన్నాడన్నది నిర్ధారించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి పొక్లేయినర్లను, ఇతర యంత్రాలను రప్పించారు. తమిళనాడులో ఈ నెల ఇది రెండో బోరుబావి సంఘటన. ఏప్రిల్ 6 న విల్లుపురం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరులో ఒక బాలిక పడిపోయింది. మూడేళ్ల ఆ బాలిక చనిపోయింది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూండటంతో తమిళనాడు హైకోర్టు ఉపయోగంలో లేని బోరుబావులను మూసేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. -
మహిళా ఎస్ఐపై లారీ ఎక్కించి చంపేందుకు యత్నం
చెన్నై : తమిళనాడు తిరునెల్వేలి సమీపంలో మహిళా ఎస్ఐపై లారీ ఎక్కించి చంపేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి సమీపంలోగల గంగైకొండాన్ సిట్రారు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు గంగైకొండాన్ ఎస్ఐ ధనలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసు బృందం నిన్న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సిప్కాట్ ప్రాంతంలో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఒక టిప్పర్ లారీని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ లారీని ఆపకుండా ఎస్ఐ ధనలక్ష్మిపై లారీ ఎక్కించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో సహ పోలీసులు సినిమా ఫక్కీలో లారీని జీపులో వెంబడించారు. లారీని డ్రైవర్ ఒకచోట నిలిపి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. సీవలప్పేరికి చెందిన కరుప్పస్వామి, పాలయంకోట్టైకు చెందిన మురుగున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
తమిళనాడులో లోయలో పడ్డ కారు, ఆరుగురి మృతి
తమిళనాడులో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తిరునల్వేలి జిల్లాలో కారులో ప్రయాణిస్తుండగా అది ప్రమాదవశాత్తూ వంతెనను ఢీకొంది. అనంతరం డ్రైవర్ కారును నియంత్రించలేకపోయాడు. వంతెనను ఢీకొట్టిన అనంతరం కారు అదుపుతప్పి పక్కనే లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు మరణించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
విద్యార్థులు దాడిలో ప్రిన్సిపల్ మృతి
ర్యాగింగ్ చేస్తూ జూనియర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో కాలేజీ హస్టల్ విడిచి వెళ్లాలని ఆదేశించిన ప్రిన్సిపల్‌పై ముగ్గురు విద్యార్థులు కక్ష కట్టి దాడి చేసి హత్య చేశారు. ఆ ఘటన ట్యూటికారన్ జిల్లా వలనాడులోని జీసెస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సురేష్‌పై ముగ్గురు విద్యార్థులు కత్తులతో దాడి చేశారు. దాంతో కాలేజీ సిబ్బంది ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే మరణించారని వైద్యులు వెల్లడించారు. అయితే దాడి చేసిన విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు తెలపారు. ఇంజనీరింగ్ కాలేజ్ హస్టల్లో సహాచర విద్యార్థులతోపాటు జూనియర్లను వారు ర్యాగింగ్ చేస్తున్నారు. దాంతో ఆ ముగ్గురు విద్యార్థులపై కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో హస్టల్ ఖాళీ చేసి వెళ్లాలని వారిని ప్రిన్సిపల్ ఆదేశించారు. దాంతో విద్యార్థులు కక్ష కట్టి ప్రిన్సిపల్‌పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని ట్యూటికారన్ జిల్లా ఎస్పీ దొరయై సందర్శించారు. అనంతరం స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.