తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కుంతలపురిలో బోరు బావిలో పడిపోయిన బాలుడిని అయిదు గంటల ప్రయత్నం తరువాత క్షేమంగా వెలికితీశారు. అదృష్ట వశాత్తూ కేవలం 20 అడుగుల లోతు వరకే బాలుడు పడిపోవడంతో ఆయన్ని ఎర్త్ మూవర్ల వంటి పరికరాలను ఉపయోగించి క్షేమంగా బయటకి తీశారు. బాలుడు మరింత కిందకి జారిపోకుండా చర్యలు చేపట్టడంతో క్షేమంగా వెలికితీయడం సాధ్యమైంది.
రెండున్నరేళ్ల ఆ బాలుడు తండ్రి వెనకే నడుస్తూ వెళ్తూండగా, ఉపయోగంలో లేని తెరిచి ఉన్న బోర్ వెల్ లో పడిపోయాడు.
తమిళనాడులో ఈ నెల ఇది రెండో బోరుబావి సంఘటన. ఏప్రిల్ 6 న విల్లుపురం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరులో ఒక బాలిక పడిపోయింది. మూడేళ్ల ఆ బాలిక చనిపోయింది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూండటంతో తమిళనాడు హైకోర్టు ఉపయోగంలో లేని బోరుబావులను మూసేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.