ఇంటి లోపల నాణేల కోసం తవ్విన గొయ్యి
హుజూర్‌నగర్ రూరల్: కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు నాణేల నిధి... తన ఇంటిలోని మూలగదిలో వచ్చిచేరిందని, మంత్రగాళ్ల సహాయంతో మేకపోతులను బలిచ్చి రక్తపుధారలు అర్పిస్తే బంగారం తన వశమవుతుందని కలలో వచ్చిన ఆనవాళ్లతో ఓ రైతు తనింటిలో తవ్వకాలు జరపడంతో నాణేలు లభ్యమయ్యాయి. అయితే వాటిని పరీక్షిస్తే.. రాగి, ఇత్తడివిగా తేలాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం అమరవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరవరం గ్రామానికి చెందిన సింగతల గురవారెడ్డి తన ఇంట్లో బంగారు నిధి ఉందంటూ ఇద్దరు మంత్రగాళ్ల సహాయంతో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత మేకపోతులను బలిచ్చి దేవుడి గదిలో ఒక మూలన గొయ్యి తవ్వాడు.
ఈ గొయ్యిలో సుమారు 24.4 కేజీల బరువున్న (662 నాణేలు) బంగారాన్ని పోలిన నాణేలు లభ్యమయ్యాయి. వాటిని ఒకబ్యాగులో సర్ది అటకమీద పెట్టారు. అప్పటికే కొద్దిరోజులుగా మేకపోతులను బలి ఇస్తూ మంత్రగాళ్లు పలుదఫాలుగా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి కూడా ఇంట్లో క్షుద్రపూజల అలజడి గమనించిన స్థానికులు గుప్తనిధుల తవ్వకం పసిగట్టి పోలీసులకు సమాచారం అందించారు. కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సీఐ కె.భాస్కర్ పోలీసు సిబ్బందితో రాత్రి సమయంలోనే హుటాహుటిన అమరవరం చేరుకుని గురవారెడ్డి ఇంట్లో సోదా చేశారు. గదిలో తవ్వకాలు జరిపిన గొయ్యిని పరిశీలించారు. బంగారు నాణేలుగా భావించి అటకమీద దాచిన నాణేల బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రసాయన పరీక్షలో రాగి, ఇత్తడి నాణేలుగా గుర్తింపు
హుజూర్‌నగర్‌లోని పుల్లయ్యచారి అనే నిపుణుడితో రసాయన పరీక్షల ద్వారా ఆ నాణేలను పరీక్షించగా అవి రాగి, ఇత్తడివిగా తేలినట్లు సీఐ భాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అమరవరంలో స్వాధీనం చేసుకున్న నాణేలను ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. గురవారెడ్డి మరో ఇద్దరితో కలసి కొంతకాలంగా ఇంట్లో ఉన్న గుప్తనిధి తవ్వకాల కోసం పలుదఫాలుగా మేకపోతులను బలిచ్చి పూజలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి కూడా మేకపోతును బలిఇచ్చి ఇంట్లో గొయ్యి తవ్వడంతో 24.4 కేజీల (662నాణేలు)బరువున్న బంగారాన్ని పోలిన నాణేలు లభ్యమవడంతో వాటిని అటకపై ఉంచారని, స్థానికుల సమాచారంతో డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి నాణాలను స్వా«ధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment