హైదరాబాద్‌ శివరాంపల్లిలో పేలుడు | Explosion In Hyderabad Shivarampally | Sakshi
Sakshi News home page

టిఫిన్‌బాక్స్‌ పేలుడు

Published Mon, Sep 9 2019 1:32 AM | Last Updated on Mon, Sep 9 2019 4:44 AM

Explosion In Hyderabad Shivarampally - Sakshi

ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న డాగ్‌స్క్వాడ్‌ , క్లూస్‌టీం అధికారులు

అత్తాపూర్‌ : టిఫిన్‌బాక్స్‌ను తెరుస్తుండగా పేలుడు సంభవించి చెత్త ఏరుకునే ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆ బాక్స్‌లో ఆర్గానిక్‌ కెమికల్‌ రసాయనం ఉండటం వల్లే ఈ పేలుడు సంభ వించిందని పోలీసులు అనుమాని స్తున్నారు. హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో ఆదివారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు శివరాంపల్లికి చెందిన సయ్యద్‌ ఖాజా ఫరు ద్దీన్‌ కుమారుడు సయ్యద్‌ ఖాజా అలీయుద్దీన్‌(40)గా పోలీసులు గుర్తిం చారు. మెహిదీపట్నం నుంచి శంషాబాద్‌ వెళ్లే మార్గంలో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే 279 పిల్లర్‌ సమీపంలో ఉన్న ఫుట్‌ పాత్‌ పక్కనే అలీ ఎప్పటిలాగే ఉద యం పూట చెత్త ఏరుకుంటు న్నాడు. అయితే, అప్పటికే తన చెత్త బ్యాగ్‌లో ఆ బాక్స్‌ను తీసుకొచ్చాడో, లేదంటే ఆ ఫుట్‌పాత్‌ పక్కనే అది ఉందో తెలియదు కానీ దానిని బలవంతంగా తెరుస్తుండగా భారీ శబ్దంతో పేలింది. పేలుడు ధాటికి అతడి రెండుచేతులు తెగిపడ్డాయి.

ఆ పక్కనే ఉన్న పెద్దపెద్ద బండరాళ్లు కూడా ఎగిరిపడటంతో అటువైపుగా వచ్చిన వాహనదారులు భయపడి పరుగులు తీశారు. భయాందోళన చెందిన స్థానికులు వెంటనే రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. రక్తమడుగులో ఉన్న ఆలీని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ ఘటనాస్థలాన్ని క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ క్షుణ్ణంగా పరిశీలించాయి. అక్కడ సేకరించిన రసాయన పదార్థాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపారు. కాగా, ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న పెయింట్‌ పరిశ్రమలకు సంబంధించిన ఆ బాక్స్‌ పడేసి ఉండగా అతడు దానినితీసుకువచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాక్స్‌ మూతను మామూలుగా తొలగిస్తే ప్రమాదమేమీ ఉండదని, పగలగొట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో పేలేందుకు అవకాశముందని అంటున్నారు. 

సీసీటీవీ ఫుటేజీల పరిశీలన...
ఈ పేలుడుకు కారణమైన టిఫిన్‌బాక్స్‌ను అలీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడని తెలుసుకునేందుకు, అతడు ఎక్కడెక్కడ తిరిగాడో కదలికలను గుర్తించేందుకు రోడ్ల వెంబడి ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అక్కడే నిర్మాణంలో ఉన్న కాలువలోనూ తనిఖీలు చేశారు. ఎక్కువగా వీవీఐపీలు తిరిగే మార్గం కావడం , శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గం కావడంతో పోలీసులు కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి పరిశీలించి ఇది బాంబు పేలుడు కాదని, ప్రజలు భయపడొద్దని సూచించారు. మృతుడు ఆలీ 20 ఏళ్లుగా చెత్త ఏరుకుంటూ అవి అమ్మగా వచ్చిన డబ్బుతో బతుకీడుస్తున్నాడు. శివరాంపల్లిలోనే ఉంటూ అప్పుడప్పుడూ ఆలయాల్లో భిక్షాటన చేసేవాడు. రాత్రిళ్లు ఫుట్‌పాత్‌లపైనే నిద్రించేవాడు. 

విచారణ ప్రారంభం: కమిషనర్‌
పేలుడు జరిగిన ప్రాంతాన్ని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పరిశీలించారు. సంఘటన వివరాలను శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆయనకు వివరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రాథమికంగా విచారణ ప్రారంభమైందని వెల్లడించారు. 

తీవ్ర భయాందోళన 
ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న కొందరు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. పేలుడు జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే బస్టాప్‌ ఉంది. అక్కడ నిత్యం వందలాది మంది ప్రయాణికులు నిరీక్షిస్తుంటారు. ఆదివారం సెలవు కావడంతో తక్కువ మంది ఉన్నారు. మరో నాలుగు రోజుల్లో వినాయక నిమజ్జనం ఉన్న నేపథ్యంలో పేలుడు సంభవించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement