
మృతి చెందిన జయశ్రీ (ఫైల్)
అన్నానగర్: కాశిమేడులో వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెన్నై కాశిమేడు పనైమరతొట్టికి చెందిన జగన్నాథన్ కుమార్తె జయశ్రీ (26). ఈమెకు జీవరత్తినం నగర్ ఎ.బ్లాక్‌కు చెందిన బాలకృష్ణన్ కుమారుడు శరవణన్ (35)తో 2016లో వివాహం జరిగింది. శరవణన్ ఓ నగల దుకాణంలో పని చేస్తున్నాడు. వివాహం సమయంలో ఏడు సవర్ల నగలు వరకట్నంగా ఇచ్చారు. వివాహం జరిగిన నాటి నుంచి అదనపు వరకట్నం తేవాలని శరవణన్ కుటుంబీకులు జయశ్రీపై ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఈ స్థితిలో జయశ్రీకి మగబిడ్డ మృతి చెందిన స్థితిలో పుట్టింది. అనంతరం జయశ్రీ మనస్తాపం చెంది పుట్టింటికి చేరుకుంది.
తల్లిదండ్రులు ఆమెను సమాధానపరచి అదే ప్రాంతంలో వేరే కాపురం పెట్టించారు. ఆ సమయంలో పుట్టింటికి వచ్చిన జయశ్రీ తన చావుకి భర్త, అత్త, మామనే కారణం అని ఓ ఉత్తరం రాసి ఇచ్చి వెళ్లింది. ఈ క్రమంలో జయశ్రీ గత 13 రోజుల కిందట మగబిడ్డను ప్రసవించింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి అదనపు వరకట్నం తేవాలని భర్త, అత్త, మామ తనను హింసిస్తున్నట్లుగా సోమవారం తన తండ్రి వద్ద తెలిపింది. దీంతో అతను కుమార్తె ఇంటికి వెళ్లి తనతో ఇంటికి రమ్మని పిలిచాడు. అందుకు జయశ్రీ కొన్ని సమస్యలున్నాయి వాటిని ముగించుకుని వస్తానని చెప్పి తండ్రిని పంపించింది. ఈ స్థితిలో మంగళవారం జయశ్రీ ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న కాశిమేడు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత పోలీసుస్టేషన్‌కు వెళ్లిన జయశ్రీ తండ్రి తన కుమార్తె చావుకు ఆమె భర్త, అత్త, మామలే కారణమని, వారు అదనపు కట్నం కోసం తన కుమార్తెను వేధించి, హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా నాటకం ఆడుతున్నారని పేర్కొన్నాడు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment