సాక్షి, బనశంకరి: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఒక కిలాడీ మహిళ తీయని మాటలతో బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని బురిడీ కొట్టించింది. అమెరికా నుంచి లక్షల డాలర్లు పంపుతున్నాను, కొరియర్‌లో డబ్బు కట్టి తీసుకోవాలంటూ రూ.20 లక్షలు స్వాహా చేసింది.
వివరాలు....బెంగళూరుకు చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఫేస్‌బుక్‌లో ఒక మహిళ పరిచయమైంది. తనది అమెరికా అని ఆమె చెప్పుకుంది. ఇద్దరూ రోజూ చాట్ చేస్తూ ఆన్‌లైన్‌లో స్నేహం చేశారు. తాను బెంగళూరులో అపార్టుమెంట్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఆ మహిళ ఆదినారాయణకు తెలిపింది. ఇందుకోసం 20 లక్షల అమెరికన్ డాలర్ల సూట్‌కేస్‌ను పంపిస్తున్నానని, ముంబాయిలో తన ఖాతాలోకి ప్రాసెసింగ్ ఫీజుల కింద డబ్బు చెల్లించి ఆ సూట్‌కేస్‌ను తీసుకోవాలని ఆ మాయలాడి రియల్టర్‌ను నమ్మించింది.
ముంబయి వెళ్ళిన బాధితుడు ఆమె ఖాతాలోకి రూ.20 లక్షల డబ్బు బదిలీ చేయగా, ఒక ఏజెంట్ వచ్చి సూట్‌కేస్ ఇచ్చి వెళ్లాడు. బాధితుడు ఆశగా తెరిచి చూడగా అందులో నకిలీ డాలర్ నోట్లు కనిపించాయి. మహిళ చేతిలో మోసపోయినట్లు గ్రహించిన రియల్టర్ మంగళవారం బెంగళూరు సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment