బాధితులు కొట్ర బాలయ్య, లక్ష్మి ,పూజకోసం ఉపయోగించిన పూజా సామగ్రి
నాగర్‌కర్నూల్ క్రైం: షుగర్ వ్యాధికి మందిస్తానంటూ నమ్మించడమే గాక.. శాంతిపూజలు కూడా చేస్తానంటూ ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి అతని నుంచి బంగారు నగలు, నగదు స్వాహా చేసి ఉడాయించాడు. ఈ సంఘటన శనివారం రాత్రి నాగర్‌కర్నూల్‌లో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని కేసరిసముద్రం రోడ్డులోని ఈదమ్మగుడి కాలనీకి చెందిన కొట్ర బాలయ్య స్థానికంగా ఇస్త్రీ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతడి షాపు దగ్గరికి గత 15 రోజుల క్రితం ఓ మహిళ వచ్చి షుగర్ వ్యాధికి ఒక స్వామీజీ మందు ఇచ్చి నయం చేస్తారని, తనతోపాటు తన బంధువులకు స్వామీజీ ఇచ్చిన మందుతో నయం అయిందని ఆ స్వామీజీని ఇక్కడ చూశారా అని కొట్ర బాలయ్యను అడిగి వెళ్లిపోయింది.
శనివారం ఉదయం కాషాయపు దుస్తులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తి కొట్ర బాలయ్య షాపు ముందే తిరుగుతూ బాధితుడి వద్దకు వెళ్లి ఇక్కడ కుంకుమ దొరుకుతుందా అని అడగడంతో బాధితుడు స్వామీజీ వేషంలో ఉన్న మోసగాడిని షుగర్ వ్యాధి నయం చేసే వ్యక్తిగా భావించాడు. స్వామీజీ వేషంలో మోసగాడు అతనితో మాటామాట కలిపి షుగర్‌వ్యాధితోపాటు ఏవైనా కష్టాలు ఉంటే పూజలు చేసి వాటిని తొలగిస్తానని అతన్ని నమ్మబలికాడు. దీంతో బాధితుడు షుగర్‌వ్యాధికి మందు ఇచ్చి నయం చేయాలని కోరడంతో స్వామీజీ అంగీకరించి ఇంటి దగ్గర మందు తయారు చేసిస్తానని చెప్పడంతో బాధితుడు స్వామీజీ వేషంలో ఉన్న మోసగాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు.
ఇంటికి నరదృష్టి పేరుతో..
ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత ఇంటికి నరదృష్టి ఉందని పూజలు చేయాలని నిమ్మకాయలు, కుంకుమ, బియ్యం, పసుపు కావాలని కోరడంతో వాటిని బాధితుడు ఇచ్చాడు. పూజలో బంగారంతోపాటు, నగదు ఉంచి మందును తయారు చేసిస్తానని నమ్మబలికాడు. అది నమ్మిన కొట్ర బాలయ్య అతని భార్య లక్ష్మి తన ఇంట్లో ఉన్న 3 తులాల బంగారం నగలు, రూ.5,100 నగదు స్వామీజీకి ఇవ్వడంతో అతను బంగారాన్ని, నగదు తీసి తన దగ్గర ఉన్న బాక్సులో వేసి వాటికి దారాలు చుట్టి పూజలు చేశాడు. అనంతరం స్నానానికి వెళ్లమని చెప్పడంతో బాధితుడి భార్య లక్ష్మి స్నానానికి వెళ్లింది. బాలయ్యను గేటు దగ్గరికి వేయమని చెప్పడంతో ఆయన వెళ్లి వచ్చేలోపు తన దగ్గర ఉన్న వేరే డబ్బాను అక్కడ ఉంచి బంగారం నగలు, నగదు ఉన్న బాక్సును సంచిలో పెట్టుకున్నాడు. అనంతరం స్వామీజీ పట్టణంలోని మార్కెట్ యార్డులో వదిలి వేసి ఇంటికి తిరిగి వచ్చాడు.
కేసు నమోదు
ఈ క్రమంలో స్వామీజీ వెళ్లిపోయిన తర్వాత బాలయ్య భార్య లక్ష్మికి అనుమానం రావడంతో వెంటనే బాక్సును తెరిచి చూడగా అందులో బియ్యం మాత్రమే ఉన్నాయి. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు వెంటనే లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ భగవంతురెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment