
వివరాలు వెల్లడిస్తున్న మహేష్ భగవత్
గచ్చిబౌలి: ఢిల్లీలో తయారైన నాసిరకం టీవీలను నగరానికి తరలించి.. సోనీ బ్రాండ్ పేరుతో స్టిక్కర్లు తగిలించి.. నేరుగా, ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టును రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 51 టీవీలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో వివరాలు వెల్లడించారు. ఢిల్లీలోని ద్వారక సెక్టార్‌కు చెందిన గౌరవ్ సింగ్ నగరానికి వలసవచ్చి చైతన్యపురిలో నివసిస్తున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన బుడిగెల సంతోష్ ఇతడి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గౌరవ్‌సింగ్ ఢిలీలో తయారైన వివిధ మోడల్స్‌కు చెందిన టీవీలను ఖరీదు చేసి తీసుకు వచ్చేవాడు. వీటికి సోనీ బ్రాండ్ లేబుల్స్ అతికించి తన దుకాణంలో విక్రయిస్తున్నాడు. ఇందులో సంతోష్ సేల్స్‌మెన్‌గానూ పని చేస్తున్నాడు.
సోనీలోని వివిధ మోడల్స్‌తో పాటు సామ్‌సాంగ్ పేరుతోనూ లేబుల్స్ తగిలిస్తున్న గౌరవ్‌సింగ్ వీటి ఫొటోలను ఈ–కామర్స్ సైట్ ఓఎల్‌ఎక్స్‌లోనూ పొందుపరిచి మార్కెట్ ధరకంటే తక్కువకే విక్రయిస్తానంటూ నమ్మించి మోసాలు చేస్తున్నాడు. మలేషియాకు చెందిన టెలిరాక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి వీటిని ఖరీదు చేసి, దిగుమతి చేసుకుంటున్నట్లు నకిలీ బిల్లులు సైతం సృష్టించాడు. జీఎస్టీ లేకుండా 20 నుంచి 30 శాతం తక్కువ ధరకు అందిస్తున్నమంటూ ప్రచారం చేసుకుని వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. 65 ఇంచుల సోనీ టీవీ ధర రూ.2.8 లక్షలు ఉండగా... గౌరవ్ సింగ్ మాత్రం ‘మేడిన్ ఢిల్లీ’ టీవీని కేవలం రూ.80 వేలకు ఖరీదు చేస్తున్నాడు. దీనిని సిటీకి తరలించి బ్రాండెడ్ కంపెనీకి చెందిన లేబుల్‌తో రూ.80 వేల డిస్కౌంట్ అంటూ రూ.2 లక్షలకు అమ్ముతున్నాడు. దీనిపై సమాచారం అందడంతో రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు గురువారం దాడి చేశారు. గౌరవ్ సింగ్‌తో పాటు సంతోష్‌ను పట్టుకుని వీరి నుంచి 51 నాసిరకం టీవీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు సీపీ తెలిపారు. ఇందుకుగాను ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపనున్నామన్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ తరహా మోసాలు సైతం పెరిగాయని, వినియోగదారు లు కేవలం అధీకృత డీలర్ల వద్ద మాత్రమే వస్తు వులను ఖరీదు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment