
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు
నల్లగొండ క్రైం/మిర్యాలగూడ రూరల్ : నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను బుధవారం మిర్యాలగూడ రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,97,500 నకిలీ నోట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. మిర్యాలగూడెం మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన కొలపొలి పెద్ద ఆంజనేయులు కుండల వ్యాపారం చేస్తుంటాడు. కారులో వచ్చిన ఐదుగురు రూ.290కి కుండను కొనుగోలు చేసి ఆంజనేయులుకి రూ.రెండు వేల నోటును ఇచ్చారు. వారికి ఆంజనేయులు మిగతా డబ్బు తిరిగి ఇచ్చాడు.
కొద్దిసేపటి తర్వాత ఆ నోటును పరిశీలించగా.. దొంగనోటగా అనుమానం వచ్చింది. వెంటనే మిర్యాలగూడ రూరల్ పోలీసులకు సమాచారం అందించాడు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు తనిఖీలు నిర్వహించి నకిలీ నోట్ల ముఠా సభ్యులను గుర్తించారు. వారిని విచారించగా కర్నూల్‌కు చెందిన రాము, మిర్యాలగూడకు చెందిన కర్నాటి మల్లయ్య నోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
ముఠా సభ్యులు వీరే..
గుంటూరుకు చెందిన దర్శనపు అశోక్, తనసూరి జానకిరామయ్య, చేలువారి మధు, వెంకట నాగస్వామి, కుమారికొటం సాయిశ్రీ, పబ్బాటి మురళితో పాటు మరో ఇద్దరు ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకుంటే నోట్లు ఎక్కడ ముద్రిస్తున్నారు.. అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. నిందితులను పట్టుకున్న ఎస్‌ఐ శ్రీకాంత్, వైజినాయుడు, హెడ్ కానిస్టెబుల్ మట్టయ్య, హోంగార్డు శ్రీనివాస్‌కు ఎస్పీ రివార్డ్ అందజేసి అభినందించారు