పోలీసుల అదుపులో నిందితులు
సాక్షి, సిటీబ్యూరో: ఔషధాల తయారీలో వినియోగించే ఆయిల్‌ను తక్కువ ధరకు ఖరీదు చేసి, తమకు ఎక్కువ ధరకు విక్రయించాలంటూ ఎర వేసి, రూ.7.8 లక్షలు కాజేసిన కేసులో ఇద్దరు నిందితులను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు నైజీరియా నుంచి వచ్చి న్యూ ఢిల్లీలో నివసిస్తున్నట్లు సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. నైజీరియాకు చెందిన ఎజుమెజు లక్కీ ఓఝా ప్రస్తుతం న్యూ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను ఫేస్‌బుక్‌లో సోరాలిన్ అనే మహిళ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీని ద్వారా లండన్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్తనంటూ నగరంలోని అంబర్‌పేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం చేసుకున్నాడు. ఆమెగానే ఇతడితో సంప్రదింపులు కొనసాగించిన అతను జంతువులకు వినియోగించే ఔషధాలను తయారు చేస్తుంటామని చెప్పాడు. తమకు విటోలిన్ ఆయిల్ అవసరం ఎంతో ఉందని, అది కేవలం భారత్‌లో మాత్రమే దొరుకుతుందని నమ్మబలికాడు. అక్కడ ఒక్కో బాటిల్ రూ.19,500 ఖరీదు చేసి తమ కంపెనీకి 850 డాలర్లకు (దాదాపు రూ.61 వేలు) అమ్మే వ్యక్తి ఇటీవల మానేశాడంటూ చెప్పింది.
తాము నేరుగా ఆయిల్ ఖరీదు చేయడానికి కంపెనీ నిబంధనలు అంగీకరించవని, తమ డీలర్ సునీతను వాట్సాప్ ద్వారా సంప్రదించి ఆ వ్యాపారం ప్రారంభించాలని సూచించింది. ఇందుకు బాధితుడు అంగీకరించడంతో సునీత పేరుతో తమ ముఠాకు చెందిన వ్యక్తి నంబర్ ఇచ్చింది. ప్రాథమికంగా 5 బాటిల్స్ ఖరీదు చేసి శాంపిల్‌గా తమకు పంపాలంటూ సోరాలిన్ నుంచి మెసేజ్ రావడంతో సునీతను సంప్రదించిన బాధితుడు వారి సూచనమేరకు రూ.97,500 వాళ్ళు సూచించిన బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆపై బాటిల్స్‌ను కొరియర్ ద్వారా అందుకున్నాడు. కొన్ని రోజులకు సోరాలిన్ అని చెప్పుకున్న ఎజుమెజు ఓ మహిళతో ఫోన్‌లో మాట్లాడించాడు. లండన్ నుంచి తమ కంపెనీ ప్రతినిధి మార్క్ ఢిల్లీ వస్తున్నారని, అతడిని కలిసి శాంపిల్స్ చూపించాలని కోరాడు. గత ఏడాది సెప్టెంబర్ 3న ఢిల్లీకి వెళ్లిన బాధితుడిని మార్క్‌గా చెప్పుకున్న వ్యక్తి కలిశాడు. ఆ శాంపిల్స్ తనకు నచ్చాయంటూ మరో 35 బాటిల్స్ సిద్ధం చేస్తే మొత్తం 40 ఒకేసారి హైదరాబాద్ వచ్చి తీసుకువెళ్తానంటూ సూచించాడు. దీంతో మరోసారి సునీతను సంప్రదించిన బాధితుడు మరో రూ.6,82,500 ఆమె సూచించిన ఖాతాలోకి బదిలీ చేశాడు. ఆ బాటిల్స్ డెలివరీ అయినా.. మార్క్ నుంచి స్పందన లేదు. దీనికి తోడు మరోసారి బాధితుడిని సంప్రదించిన సునీత 400 బాటిల్స్ కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితులు వాడిన సెల్ నంబర్లతో పాటు బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ స్కామ్‌కు సూత్రధారి ఎజుమెజు అని, గుర్గావ్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తి కమీషన్ తీసుకుని బ్యాంకు ఖాతాలు అందించినట్లుగా గుర్తించారు. దీంతో ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం ఇద్దరినీ అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చింది.
గిఫ్ట్‌ల పేరుతో గాలం రూ.1.2 లక్షలు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్ ద్వారా మహిళగా నగరవాసికి పరిచయమైన ఓ నైజీరియన్ గిఫ్ట్‌ల పేరుతో రూ.1.2 లక్షలు కాజేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో ఉంటున్న సదరు నైజీరియన్‌ను అరెస్టు చేసినట్లు సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం వెల్లడించారు. ఢిల్లీలో ఉంటున్న జేమ్స్ లక్కీ ఒబాసి ఫేస్‌బుక్‌లో మహిళ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీని ద్వారా నగరానికి చెందిన ఓ వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. లండన్‌లో ఉంటున్న సంపన్న కుటుంబానికి చెందిన మహిళగా చెప్పుకుంటూ నకిలీ నంబర్ ద్వారా అతడితో వాట్సాప్ చాటింగ్ చేశాడు. అనంతరం తాము కోర్టులో ఆస్తి సంబందించిన కేసు గెలిచామని, ఈ ఆనందంలో ఓ బహుమతి పంపిస్తున్నానంటూ చెప్పాడు. కొన్ని రోజులకు కొరియర్ సర్వీసు నుంచి అంటూ బాధితుడికి ఫోన్ వచ్చింది. లండన్ నుంచి కొరియర్‌లో వచ్చిన ఖరీదైన బహుమతులు డెలివరీ చేయడానికి కొన్ని పన్నులు చెల్లించాలని చెప్పారు. దీనిని నమ్మిన బాధితుడు వారు సూచించిన విధంగా రూ.1.2 లక్షలు చెల్లించాడు. చివరకు మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ ఒబాసిని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment