నకిలీ పోలీసుల అరెస్టు చూపుతున్న సీఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది
పోలీసులు నకిలీ పోలీసుల ఆట కట్టించారు. పాత సినిమా కథల మల్లే ‘దొంగా–పోలీస్ ఆట’ను ఫాలో అయిన ఈ మాయగాళ్లు మూడు రాష్ట్రాల్లో ఎందరో బాధితుల నుంచి లక్షలు కొల్లగొట్టారు. అచ్చు సినిమా క్లైమాక్స్‌లాగే దొంగా–పోలీస్ ఛేజింగ్‌లో పోలీసులకు వాహనంతో సహా పట్టుబడ్డారు.
చిత్తూరు, బంగారుపాళెం: నకిలీ పోలీసులుగా ప్రజలను మోసగించే ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు బుధవారం గంగవరం సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 20న బాధితులు బంగారుపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా సభ్యులను పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ కథనం..తమిళనాడుకు చెందిన రాజు (రాణిపేట్), సంపత్ (వేలూరు), కిరణ్ (చెన్నై), రాజేష్, తిరుమల్ (వాలాజా), డేనియల్ (బెంగళూరు), సంజయ్ (ఒడీశా), మదన్‌శెట్టి (భువనేశ్వర్) ఒక ముఠాగా ఏర్పడి తక్కువ ధరకే బంగారం ఇస్తామని, ఒక ఒరిజినల్ కరెన్సీ నోటుకు రెండు నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తామని బురిడీ కొట్టిస్తున్నారు. నగదు మార్పిడి చేసే సమయంలో ముందుగానే వేసిన వ్యూహం ప్రకారం ముఠాలోని సభ్యులు డేనియల్, సంజయ్, కిరణ్, రాజేష్, తిరుమల్, మదన్ పోలీసులుగా రంగప్రవేశం చేసి బాధితులు హడలెత్తిసారు. వారిని బెదిరించి డబ్బులు తీసుకుని ఉడాయిస్తారు.
బురిడీ కొట్టించారిలా..
చెన్నై ఎంజే నగర్‌లో కెనరా బ్యాంక్‌లో అప్రైజర్‌గా పనిచేస్తున్న నటరాజన్‌కు ఈ నెల 20న రాజు ఫోన్ చేసి తాను చిత్తూరు కెనరా బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. బ్యాంకులో నగలు వేలానికి వచ్చాయని, తక్కువ రేటుకు వస్తాయని నమ్మించాడు. దీంతో నటరాజ్ చెన్నైలోని తన స్నేహితులు రామకృష్ణ, ఉదయ్‌కుమార్, మహేంద్రన్‌కు ఈ విషయాన్ని చెప్పాడు. ఉదయ్‌కుమార్, రామకృష్ణ రూ.6 లక్షలు సమకూర్చుకుని నటరాజన్, మహేంద్రన్‌తో కలసి మారుతీ కారులో రాజు చెప్పిన ప్రకారం చిత్తూరు కలెక్టర్ ఆఫీసు వద్దకు వచ్చారు. ముఠాలోని సంపత్ వారిని కలసి రాజు పంపిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. వారిని బంగారుపాళెం సమీపంలోని 180 కొత్తపల్లె రోడ్డులోకి తీసుకెళ్లి తన ముఠా సభ్యులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత కొంతసేపటికి డేనియల్ ఎస్‌ఐ గెటప్‌లో, మిగిలిన సభ్యులు పోలీసుల వేషంలో రెండు కార్లు (ఒక బొలెరో, టవేరా)లో వచ్చారు. వచ్చీ రాగానే చెన్నై వారిని చుట్టుముట్టి పోలీసులమంటూ చుట్టుముట్టడంతో వారు బెదిరిపోయారు. కేసులు పెడతాం..అరెస్ట్ చేస్తామంటూ వారిని హడలెత్తించారు. వారి నుంచి రూ.6 లక్షలు లాక్కుని అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఉదయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
మూడు రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో మోసం
తక్కువ ధరకే బంగారం పేరిట తమిళనాడులో నాలుగుచోట్ల, 6 నెలల క్రితం కర్ణాటకలోని బంగారుపేటలో ఇలాగే ఈ ముఠా కొందరిని బురిడీ కొట్టించినట్లు తేలింది. చిత్తూరు జిల్లాలో 4 నెలల కాలంలో గంగాధరనెల్లూరు, గుడిపాల, చిత్తూరు ప్రాంతంలోనూ ఇదే తీరులో దొంగా–పోలీస్ గేమ్‌తో మరికొందరిని మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, మన జిల్లాలో బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారు.
ఛేజింగ్‌తో ఆట కట్టించారిలా..!
మంగళవారం మధ్యాహ్నం బంగారుపాళెం–గుడియాత్తం రోడ్డులో ఇదే తరహాలో మోసగించాలని ప్రయత్నం చేశారు. ఇది తెలుసుకున్న బంగారుపాళెం ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది బండ్లదొడ్డి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో, టవేరా వాహనాలను ఎస్‌ఐ, సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. ఆగకుండా అవి మితిమీరిన వేగంతో వెళ్లాయి. దీంతో పోలీసులు బొలెరోను సినిమాపక్కీలో మరో వాహనంలో ఛేజింగ్ చేసి అడ్డుకున్నారు. అందులో ఉన్న డేనియల్, తిరుమల్, రాజేష్, మదన్, సంపత్‌ను అదుపులో కి తీసుకున్నారు. వాహనంలో పాటు వారి నుంచి రూ. 6 లక్షలు, 8 సెల్ ఫోన్లు, 10 వేల రూపాయల దొంగనోట్లు, పోలీస్ యూనిఫాం, వైర్‌లెస్ హ్యాండ్‌సెట్, లాఠీలు, బెల్ట్, క్యాప్ స్వాధీనం చేసుకున్నారు. టవేరాలో రాజు, సంజయ్, కిరణ్ పారిపోయారు. వారి కోసం గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదించిన ఎస్‌ఐ రామకృష్ణ, పోలీసులను సీఐ అభినందించారు. రివార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment