Fake police gang
-
ఏం తెలివిరా నాయనా?.. ఏకంగా నకిలీ ‘పోలీస్ స్టేషన్’ పెట్టేశాడు
పాట్నా: నకిలీ వస్తువులు, కల్తీ ఆహారపదార్థాలు తయారు చేసే కేంద్రాలను పోలీసులు పట్టుకున్న సంఘటనలు చాలానే చూసుంటారు. కానీ, ఓ గ్యాంగ్ ఏకాంగా నకిలీ పోలీస్ స్టేషన్‌నే ఏర్పాటు చేసింది. పోలీసుల దుస్తుల్లో ఎనిమిది నెలలుగా వసూళ్లకు పాల్పడుతోంది. ఈ సంఘటన బిహార్‌లోని బాంగా జిల్లాలో వెలుగు చూసింది. అయితే, స్థానిక పోలీస్ స్టేషన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ నకిలీ పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు భోలా యాదవ్ ఓ గెస్ట్ హౌస్‌లో నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. ముందుగా రూ.వేలు వసూలు చేసి అనిత, జూలీ అనే ఇద్దరు మహిళల్ని పోలీసులుగా నియమించుకున్నాడు. మరో ముగ్గురిని తన గ్యాంగ్‌లో చేర్చుకుని డీఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ లాంటి హోదాలు కట్టబెట్టాడు. వారికి యూనిఫాంలతో పాటు నాటు తుపాకీలు ఇచ్చాడు. వారు చెకింగ్‌ల పేరుతో భయపెట్టి ప్రజల నుంచి డబ్బులు వసూళు చేసేవారు. బుధవారం సాయంత్రం టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన శంభు యాదవ్ నాటు తుపాకులతో ఉన్న నకిలీ పోలీసులను చూశారు. అతడికి అనుమానం వచ్చి ఆరా తీయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ని మార్చినంత ఈజీ అతనికి పార్టీలు మార్చడం! -
సబ్ ఇన్స్పెక్టర్ నంటూ కిలాడీ.. లేడీ
చెన్నై ,అన్నానగర్: తాను సబ్ ఇన్స్పెక్టర్ నంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహిళ అరెస్టయిన ఘటన శుక్రవారం చిదంబరంలో జరిగింది. వివరాలు.. కడలూర్ జిల్లా చిదంబరం నగర పోలీసు ఇన్స్పెక్టర్ మురుగేషన్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం రాత్రి గాంధీ విగ్రహం సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. మందక్కరై ప్రాంతానికి చెందిన చక్రపాణి మద్యం సేవించి ద్విచక్రవాహనాన్ని నడపడంతో అతని మీద కేసు నమోదు చేసి బైకుని స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి చక్రపాణి తన బంధువు రాజదురై, అతని భార్య సూర్యప్రియ (27)తో చర్చించాడు. అనంతరం సూర్యప్రియ పోలీసు యూనిఫామ్ ధరించుకొని శుక్రవారం ఉదయం చిదంబరం పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. తాను చెన్నై నీలాంగరై పోలీసు స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నట్లు చెప్పింది. మద్యం మత్తులో వాహనం నడుపుకొని వచ్చిన చక్రపాణి బైకుని ఇవ్వాలంటూ అడిగింది. ఆమె తీరుపై అనుమానం రావడంతో స్థానిక పోలీసులు నీలాంగరై పోలీసుస్టేషన్‌కి ఫోన్ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ పేరుతో అక్కడ ఎవరూ పనిచేయడం లేదని తేలింది. అనంతరం జాయింట్ పోలీసు సూపరింటెండెంట్ కార్తిగేయన్, సూర్య ప్రియ గురించి విచారించగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. సూర్యప్రియా పోలీసు యూనిఫామ్ ధరించి తన భర్త రాజదురై, బంధువు చక్రపాణితో కలిసి తరచూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వాహన దారులను అడ్డుకొని నగదు లాక్కోవటం, కొంత మందికి ప్రభుత్వ కార్యాలయాలలో కుల, ఆదాయ సర్టిఫికేట్లు ఇప్పిస్తానంటూ మోసం చేస్తూ వచ్చినట్లు తెలిసింది. అనంతరం సూర్యప్రియ, రాజదురై, చక్రపాణిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
బీటెక్ దొంగలు..!
వాళ్లంతా బీ.టెక్ పూర్తి చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. మస్తుగా మందుకొట్టి, పోలీసులమంటూ దారిదోపిడీకి స్కెచ్ వేశారు. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరిని చితకబాది నగదు, సెల్ఫోన్లు లాక్కున్నారు. మళ్లీ ఆ డబ్బుతో ఫుల్‌గా ఎంజా య్ చేశారు. ఆ మత్తు దిగేలోపు పోలీసులు వాళ్ల భరతం పట్టారు. నిందితులు దారిదోపిడీకి ఉపయోగించిన కారే చివరకు వాళ్లను పోలీసులకు పట్టించింది! చిత్తూరు, పీలేరు రూరల్ : నకిలీ పోలీసులు హల్ చల్ చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన మండలంలోని వేపులబైలులో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం పీలేరు అర్బన్ సీఐ చిన పెద్దయ్య తెలిపిన వివరాలు..మదనపల్లెకు చెందిన రెడ్డిప్రసాద్, నాగేంద్ర తిరుపతిలో చిన్నపాటి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. తమ కష్టార్జితాన్ని ఇంటివద్ద ఇచ్చేందుకు ఈ నెల 24న రాత్రి ద్విచక్ర వాహనంలో తిరుపతి నుంచి మదనపల్లెకు బయల్దేరారు. మార్గమధ్యంలో వాటర్ బాటిల్ కోసం వేపులబైలు వద్ద ఆగారు. ఓ కూల్‌డ్రింక్ షాపులో వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుండగా పీలేరుకు చెందిన నిరంజన్ రెడ్డి (23), రెడ్డి శేఖర్ (22), రెడ్డి ప్రసాద్ (23) బంగారుపాళెంకు చెందిన చంద్ర (22) కారులో వచ్చారు. తాము పోలీసులమని ద్విచక్ర వాహనం రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలని వారిని హడలెత్తించారు. ఇద్దరినీ చితకబాది 10,000 రూపాయలతో పాటు 2 సెల్ఫోన్లు లాక్కున్నారు. వీరి వాలకం అంతా అనుమానాస్పదంగా ఉండడంతో బాధితులకు వీళ్లు పోలీసులు కాదని బోధపడింది. ఇదే విషయమై ప్రశ్నించేసరికి పోలీసులకు సమాచారమిస్తే అంతు చూస్తామని బెదిరించి అక్కడ నుంచి అదృశ్యమయ్యారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా బాధితులు నేరుగా మదనపల్లెకు చేరుకున్నారు. మరుసటి బాధితులు పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టించిన కారు దారిదోపిడీకి నిందితులు ఉపయోగించిన కారు కేసు ఛేదనలో కీలక ఆధారమైంది. బాధితులు అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నిందితులు ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు నంబర్ ఏపీ 27 ఏఎక్స్ 6969ను గుర్తు పెట్టుకుని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆ కారు నంబర్‌ను లాగితే ఈ దోపిడీ డొంకంతా కదిలింది. నిందితులు అప్పటికింకా పీలేరులోనే ఉన్నారు. బాధితుల నుంచి లాక్కున్న డబ్బుతో మళ్లీ జల్సా చేశారు. కారుతో సహా అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దోపిడీ సొత్తును రికవరీ చేశారు. శుక్రవారం సాయంత్రం కోర్టుకు హాజరు పరిచారు. అందరూ బాల్య స్నేహితులే..ఒకరిపై ఆరు కేసులు నిందితులు నలుగురూ బాల్యస్నేహితులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. అందరూ బీ.టెక్ పూర్తి చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. వీరిలో నిరంజన్‌రెడ్డిపై మూడు ఎర్రచందనం కేసులు, మూడు గొడవ కేసులున్నట్లు సీఐ చెప్పారు. తన సోదరికి వివాహం కాబోతోందని, అందరూ కలిసి పార్టీ చేసుకుందామని నిరంజన్ రెడ్డి ఆహ్వానం మేరకు బాల్యస్నేహితులు కలిసినట్లు తెలియవచ్చింది. దోపిడీకి కూడా స్కెచ్ వేసింది ఇతగాడేనని తేలింది. విస్తుపోయిన తల్లిదండ్రులు తమ పుత్రరత్నాల ఘనకార్యం గురించి పోలీసులు చెప్పేవరకూ తెలియకపోవడంతో నిందితుల్లో ముగ్గురి తల్లిదండ్రులు విస్తుపోయారు. పోలీస్‌స్టేషన్‌లోనే వాళ్ల చెంపలు వాయించినట్లు తెలిసింది. చేతికొచ్చిన పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టకపోతే చివరకు పోలీస్ స్టేషన్ గడప ఎక్కాల్సి వస్తుందనడానికి ఇదో ఉదాహరణ. -
నకిలీ పోలీసు ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: నకిలీ పోలీసుల అవతారమెత్తి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చీటింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను సీసీఎస్, చిలమత్తూరు పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షల నగదు, ఒక క్వాలీస్ వాహనం, రెండు బేడీలు, 14 నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు, రెండు వాకీటాకీలు, లాఠీలు, పోలీసు యూనిఫాం దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం అనంతపురంలోని పోలీసుకాన్ఫరెన్స్‌హాల్లో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన బెంగుళూరుకు చెందిన డేనియల్ ఎసెక్స్, ఒడిషా రాష్ట్రం అంగుల్ జిల్లాకు చెందిన మదన్శెట్టితో పాటు పరారీలో ఉన్న నాయుడు, శేఖర్, మనోజ్‌లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ ధరకే బంగారు ఇప్పిస్తామని అమాయకులను నమ్మిస్తారు. అలా ఆశపడి వచ్చిన వారిని ‘నకిలీ పోలీసుల’ అవతారమెత్తి నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడం అలవాటుగా చేసుకున్నారు. ఈ ముఠాలో డేనియల్ ఎసెక్స్ ముఖ్యుడు. ఇతను బెంగళూరులో ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతనికీ పోలీసు కార్యకలాపాల గురించి బాగా తెలుసు. మదన్‌శెట్టి, మనోజ్‌లు ఇతని వద్ద సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి వచ్చే సంపాదన సరిపోకపోవడంతో అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించారు. ట్యాక్సీ డ్రైవర్‌గా ఉన్న శేఖర్‌తో పరిచయం ఏర్పరుచుకొని తక్కువ ధరకే బంగారు ఇస్తామని అమాయకులను నమ్మించి నగదుతో వచ్చాక నకిలీ పోలీసుల అవతారమెత్తేవారు. ఇలా మోసం చేశారు.. కదిరి పట్టణానికి చెందిన నీలం నాగభూషణ అనే వ్యక్తికి తక్కువ రేటుకు బంగారం ఇస్తామని చెప్పి గత ఏడాది నవంబర్15న కొడికొండ చెక్‌పోస్టుకు రప్పించుకున్నారు. తొలుత నిజమైన బంగారపు ముక్కను చూపించారు. అత్యాశకు గురైన అతను అదే నెల 29న రూ.7 లక్షల నగదుతో వెళ్లాడు. బంగారం లావాదేవీలు మాట్లాడుతున్నట్లు నటించి డీఎస్పీ వేషంలో ముఖ్య డేనియల్ ఎసెక్స్, అతని అంగరక్షకుడిగా మదన్‌శెట్టి, నకిలీ పోలీసుగా మనోజ్‌లు రంగ ప్రవేశం చేశారు. అచ్చం పోలీసుల మాదిరిగా రక్తి కట్టించి అందర్నీ క్వాలీస్ వాహనంలోఎ క్కించుకొని బెంగుళూరు వైపు వెళ్ళారు. నీలం నాగభూషణం వద్ద ఉన్న నగదును, బంగారు నగలను లాక్కొని మార్గం మధ్యలో దింపేసి వెళ్లిపోయారు. ఇదే తరహాలో కర్ణాటకలోని బంగారుపేట, నాలుగు నెలల కిందట చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మోసాలకు పాల్పడ్డారు. ముఠాపై ప్రత్యేక నిఘా నకిలీ పోలీసుల ముఠా ఆగడాలపై ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ సీరియస్ అయ్యారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయించారు. సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, పెనుకొండ డీఎస్పీ రామకృష్ణయ్యల పర్యవేక్షణలో సీఐలు శ్యాంరావు, లక్ష్మీకాంతరెడ్డి, వెంకేశ్వర్లు, ఎస్ఐ ధరణిబాబు, సిబ్బంది శ్రీనివాసులు, కిరణ్‌బాబు, మల్లికార్జున, ఫరూక్‌బాషా, భాస్కర్, సుబ్బరాయుడు, మంజునాథ, సురేష్‌లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. శుక్రవారం పక్కా సమాచారం అందుకొని కొండికొండ సమీపంలో నిందితులు డేనియల్ ఎసెక్స్, మదన్శెట్టిలను అరెస్ట్‌చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులకోసం గాలిస్తున్నారు. నకిలీ పోలీసు ముఠాను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. -
పోలీసుల గెటప్..బంగారంతో సెటప్
పోలీసులు నకిలీ పోలీసుల ఆట కట్టించారు. పాత సినిమా కథల మల్లే ‘దొంగా–పోలీస్ ఆట’ను ఫాలో అయిన ఈ మాయగాళ్లు మూడు రాష్ట్రాల్లో ఎందరో బాధితుల నుంచి లక్షలు కొల్లగొట్టారు. అచ్చు సినిమా క్లైమాక్స్‌లాగే దొంగా–పోలీస్ ఛేజింగ్‌లో పోలీసులకు వాహనంతో సహా పట్టుబడ్డారు. చిత్తూరు, బంగారుపాళెం: నకిలీ పోలీసులుగా ప్రజలను మోసగించే ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు బుధవారం గంగవరం సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 20న బాధితులు బంగారుపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా సభ్యులను పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ కథనం..తమిళనాడుకు చెందిన రాజు (రాణిపేట్), సంపత్ (వేలూరు), కిరణ్ (చెన్నై), రాజేష్, తిరుమల్ (వాలాజా), డేనియల్ (బెంగళూరు), సంజయ్ (ఒడీశా), మదన్‌శెట్టి (భువనేశ్వర్) ఒక ముఠాగా ఏర్పడి తక్కువ ధరకే బంగారం ఇస్తామని, ఒక ఒరిజినల్ కరెన్సీ నోటుకు రెండు నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తామని బురిడీ కొట్టిస్తున్నారు. నగదు మార్పిడి చేసే సమయంలో ముందుగానే వేసిన వ్యూహం ప్రకారం ముఠాలోని సభ్యులు డేనియల్, సంజయ్, కిరణ్, రాజేష్, తిరుమల్, మదన్ పోలీసులుగా రంగప్రవేశం చేసి బాధితులు హడలెత్తిసారు. వారిని బెదిరించి డబ్బులు తీసుకుని ఉడాయిస్తారు. బురిడీ కొట్టించారిలా.. చెన్నై ఎంజే నగర్లో కెనరా బ్యాంక్‌లో అప్రైజర్‌గా పనిచేస్తున్న నటరాజన్‌కు ఈ నెల 20న రాజు ఫోన్ చేసి తాను చిత్తూరు కెనరా బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. బ్యాంకులో నగలు వేలానికి వచ్చాయని, తక్కువ రేటుకు వస్తాయని నమ్మించాడు. దీంతో నటరాజ్ చెన్నైలోని తన స్నేహితులు రామకృష్ణ, ఉదయ్‌కుమార్, మహేంద్రన్‌కు ఈ విషయాన్ని చెప్పాడు. ఉదయ్‌కుమార్, రామకృష్ణ రూ.6 లక్షలు సమకూర్చుకుని నటరాజన్, మహేంద్రన్‌తో కలసి మారుతీ కారులో రాజు చెప్పిన ప్రకారం చిత్తూరు కలెక్టర్ ఆఫీసు వద్దకు వచ్చారు. ముఠాలోని సంపత్ వారిని కలసి రాజు పంపిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. వారిని బంగారుపాళెం సమీపంలోని 180 కొత్తపల్లె రోడ్డులోకి తీసుకెళ్లి తన ముఠా సభ్యులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత కొంతసేపటికి డేనియల్ ఎస్ఐ గెటప్‌లో, మిగిలిన సభ్యులు పోలీసుల వేషంలో రెండు కార్లు (ఒక బొలెరో, టవేరా)లో వచ్చారు. వచ్చీ రాగానే చెన్నై వారిని చుట్టుముట్టి పోలీసులమంటూ చుట్టుముట్టడంతో వారు బెదిరిపోయారు. కేసులు పెడతాం..అరెస్ట్ చేస్తామంటూ వారిని హడలెత్తించారు. వారి నుంచి రూ.6 లక్షలు లాక్కుని అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఉదయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మూడు రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో మోసం తక్కువ ధరకే బంగారం పేరిట తమిళనాడులో నాలుగుచోట్ల, 6 నెలల క్రితం కర్ణాటకలోని బంగారుపేటలో ఇలాగే ఈ ముఠా కొందరిని బురిడీ కొట్టించినట్లు తేలింది. చిత్తూరు జిల్లాలో 4 నెలల కాలంలో గంగాధరనెల్లూరు, గుడిపాల, చిత్తూరు ప్రాంతంలోనూ ఇదే తీరులో దొంగా–పోలీస్ గేమ్‌తో మరికొందరిని మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, మన జిల్లాలో బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారు. ఛేజింగ్‌తో ఆట కట్టించారిలా..! మంగళవారం మధ్యాహ్నం బంగారుపాళెం–గుడియాత్తం రోడ్డులో ఇదే తరహాలో మోసగించాలని ప్రయత్నం చేశారు. ఇది తెలుసుకున్న బంగారుపాళెం ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది బండ్లదొడ్డి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో, టవేరా వాహనాలను ఎస్ఐ, సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. ఆగకుండా అవి మితిమీరిన వేగంతో వెళ్లాయి. దీంతో పోలీసులు బొలెరోను సినిమాపక్కీలో మరో వాహనంలో ఛేజింగ్ చేసి అడ్డుకున్నారు. అందులో ఉన్న డేనియల్, తిరుమల్, రాజేష్, మదన్, సంపత్‌ను అదుపులో కి తీసుకున్నారు. వాహనంలో పాటు వారి నుంచి రూ. 6 లక్షలు, 8 సెల్ ఫోన్లు, 10 వేల రూపాయల దొంగనోట్లు, పోలీస్ యూనిఫాం, వైర్లెస్ హ్యాండ్సెట్, లాఠీలు, బెల్ట్, క్యాప్ స్వాధీనం చేసుకున్నారు. టవేరాలో రాజు, సంజయ్, కిరణ్ పారిపోయారు. వారి కోసం గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదించిన ఎస్ఐ రామకృష్ణ, పోలీసులను సీఐ అభినందించారు. రివార్డులు అందజేశారు. -
నకిలీ పోలీసు ముఠా అరెస్టు
సాక్షి, విజయవాడ: నగరంలో పోలీసుల మని చెప్పి ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నముఠాను టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... అరెస్టు చేసిన ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు. కానిస్టేబుళ్లు తన స్నేహితుడు శ్రీనివాసరావుతో కలసి ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. కానిస్టేబుళ్లు నరేష్ కుమారు(జార్ఖాండ్ బెటాలియన్), వల్లభేని స్వామి( ఛత్తిస్ ఘడ్ బెటాలియన్)ల్లో పని చేస్తున్నట్లు గుర్తించామని పోలీసలు వెల్లడించారు. స్నేహితుడు శ్రీనివాసరావుతో కలిసి వసూళ్లకు దిగిన నరేష్ కుమార్, వల్లభనేని స్వామి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. -
నకిలీ పోలీసుల ముసుగులో దోపిడీలు
నెల్లూరు(క్రైమ్): నకిలీ పోలీసుల ముసుగులో దోపిడీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ ముఠాను శుక్రవారం సీసీఎస్, నాలుగో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులోని సీసీఎస్ పోలీసు స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు వివరాలను వెల్లడించారు. ఈనెల 17వ తేదీన మాగుంటలేఅవుట్ ఎస్ఆర్కే స్కూల్ సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని నలుగురు దుండగులు పోలీసులమని బెదిరించి రూ.3 లక్షలను దోచుకుని పరారయ్యారు. బాధిత మహిళ నాలుగోనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎస్కే బాజీజాన్‌సైదా, నాలుగోనగర ఇన్స్పెక్టర్ వి.సుధాకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. శుక్రవారం మినీబైపాస్‌రోడ్డులోని పీవీఆర్ కల్యాణమంటపం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న టీపీగూడూరు మండలం ఈదూరు గ్రామానికి చెందిన గుండాల వంశీకృష్ణారెడ్డి, కోటమండలం కొండగుంట గ్రామానికి చెందిన మాలేపాటి హర్షవర్ధన్ అలియాస్ హర్ష, నెల్లూరు రూరల్ మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన చల్లా గోవర్ధన్ అలియాస్ జగ్గు, నెల్లూరు కిసాన్‌నగర్‌కు చెందిన గుండాల మహేంద్రరెడ్డిలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిని తమదైన శైలిలో విచారించగా ఎస్ఆర్కే స్కూల్ సమీపంలో దోపిడీకి పాల్పడింది తామేనని వెల్లడించారు. దీంతో వారిని అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, దోపిడీకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. పలు కేసుల్లో ముద్దాయిలు నిందితులందరూ స్నేహితులు. జల్సాలకు అలవాటుపడి నకిలీ పోలీసుల అవతారమెత్తారు. వంశీకృష్ణారెడ్డిపై నాయుడుపేట, నెల్లూరు నగరంలోని 3, 4 పోలీసు స్టేషన్లు, టీపీగూడూరు ప్రాంతాల్లో చీటింగ్ కేసులున్నాయి. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో రేప్ కేసులో నిందితుడు. హర్షవర్ధన్‌పై తెలంగాణ రాష్ట్రంలో పలు చీటింగ్ కేసులున్నాయి. గోవర్ధన్‌పై ముత్తుకూరు పోలీసు స్టేషన్, నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్లలో దాడి కేసులున్నాయి. మహేంద్రరెడ్డిపై హైదరాబాద్ బంజారాహిల్స్ స్టేషన్ పరిధిలో రేప్ కేసు ఉంది. ముఠాను అరెస్ట్ చేసేందుకు కృషిచేసిన సీసీఎస్, నాలుగో నగర ఇన్స్పెక్టర్లు బాజీజాన్‌సైదా, వి.సుధాకర్‌రెడ్డి, సీసీఎస్ ఎస్సై మురళీ, హెడ్‌కానిస్టేబుల్స్ ఆర్.సురేష్‌కుమార్, వై.వెంకటేశ్వర్లు, శ్రీహరి, పోలయ్య, కానిస్టేబుల్స్ రాజేష్, హరీష్‌రెడ్డి, ప్రభాకర్‌లను డీఎస్పీ అభినందించారు. -
నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్
పెదవేగి: పోలీసులమంటూ చెప్పి ఘరానా మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... స్థానికంగా కానిస్టేబుల్‌గా పనిచేసి సస్పెన్షన్‌కు గురైన వ్యక్తి ఇద్దరు ఆటో డ్రైవర్లతోపాటు ఓ స్థానిక రిపోర్టర్ ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఆ క్రమంలో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరి ఆగడాలు అధికమైనాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో వారిని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.దాంతో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.