నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్, స్వాధీనం చేసుకున్న నగదు, సామగ్రి
అనంతపురం సెంట్రల్: నకిలీ పోలీసుల అవతారమెత్తి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చీటింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను సీసీఎస్, చిలమత్తూరు పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షల నగదు, ఒక క్వాలీస్ వాహనం, రెండు బేడీలు, 14 నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు, రెండు వాకీటాకీలు, లాఠీలు, పోలీసు యూనిఫాం దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం అనంతపురంలోని పోలీసుకాన్ఫరెన్స్‌హాల్లో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మీడియాకు వెల్లడించారు.
అరెస్టయిన బెంగుళూరుకు చెందిన డేనియల్ ఎసెక్స్, ఒడిషా రాష్ట్రం అంగుల్ జిల్లాకు చెందిన మదన్‌శెట్టితో పాటు పరారీలో ఉన్న నాయుడు, శేఖర్, మనోజ్‌లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ ధరకే బంగారు ఇప్పిస్తామని అమాయకులను నమ్మిస్తారు. అలా ఆశపడి వచ్చిన వారిని ‘నకిలీ పోలీసుల’ అవతారమెత్తి నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడం అలవాటుగా చేసుకున్నారు. ఈ ముఠాలో డేనియల్ ఎసెక్స్ ముఖ్యుడు. ఇతను బెంగళూరులో ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతనికీ పోలీసు కార్యకలాపాల గురించి బాగా తెలుసు. మదన్‌శెట్టి, మనోజ్‌లు ఇతని వద్ద సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి వచ్చే సంపాదన సరిపోకపోవడంతో అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించారు. ట్యాక్సీ డ్రైవర్‌గా ఉన్న శేఖర్‌తో పరిచయం ఏర్పరుచుకొని తక్కువ ధరకే బంగారు ఇస్తామని అమాయకులను నమ్మించి నగదుతో వచ్చాక నకిలీ పోలీసుల అవతారమెత్తేవారు.
ఇలా మోసం చేశారు..
కదిరి పట్టణానికి చెందిన నీలం నాగభూషణ అనే వ్యక్తికి తక్కువ రేటుకు బంగారం ఇస్తామని చెప్పి గత ఏడాది నవంబర్15న కొడికొండ చెక్‌పోస్టుకు రప్పించుకున్నారు. తొలుత నిజమైన బంగారపు ముక్కను చూపించారు. అత్యాశకు గురైన అతను అదే నెల 29న రూ.7 లక్షల నగదుతో వెళ్లాడు. బంగారం లావాదేవీలు మాట్లాడుతున్నట్లు నటించి డీఎస్పీ వేషంలో ముఖ్య డేనియల్ ఎసెక్స్, అతని అంగరక్షకుడిగా మదన్‌శెట్టి, నకిలీ పోలీసుగా మనోజ్‌లు రంగ ప్రవేశం చేశారు. అచ్చం పోలీసుల మాదిరిగా రక్తి కట్టించి అందర్నీ క్వాలీస్ వాహనంలోఎ క్కించుకొని బెంగుళూరు వైపు వెళ్ళారు. నీలం నాగభూషణం వద్ద ఉన్న నగదును, బంగారు నగలను లాక్కొని మార్గం మధ్యలో దింపేసి వెళ్లిపోయారు. ఇదే తరహాలో కర్ణాటకలోని బంగారుపేట, నాలుగు నెలల కిందట చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మోసాలకు పాల్పడ్డారు.
ముఠాపై ప్రత్యేక నిఘా
నకిలీ పోలీసుల ముఠా ఆగడాలపై ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ సీరియస్ అయ్యారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయించారు. సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, పెనుకొండ డీఎస్పీ రామకృష్ణయ్యల పర్యవేక్షణలో సీఐలు శ్యాంరావు, లక్ష్మీకాంతరెడ్డి, వెంకేశ్వర్లు, ఎస్‌ఐ ధరణిబాబు, సిబ్బంది శ్రీనివాసులు, కిరణ్‌బాబు, మల్లికార్జున, ఫరూక్‌బాషా, భాస్కర్, సుబ్బరాయుడు, మంజునాథ, సురేష్‌లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. శుక్రవారం పక్కా సమాచారం అందుకొని కొండికొండ సమీపంలో నిందితులు డేనియల్ ఎసెక్స్, మదన్‌శెట్టిలను అరెస్ట్‌చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులకోసం గాలిస్తున్నారు. నకిలీ పోలీసు ముఠాను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment