అరెస్టయిన ముగ్గురు
చెన్నై ,అన్నానగర్: తాను సబ్ ఇన్‌స్పెక్టర్ నంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహిళ అరెస్టయిన ఘటన శుక్రవారం చిదంబరంలో జరిగింది. వివరాలు.. కడలూర్ జిల్లా చిదంబరం నగర పోలీసు ఇన్‌స్పెక్టర్ మురుగేషన్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం రాత్రి గాంధీ విగ్రహం సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. మందక్కరై ప్రాంతానికి చెందిన చక్రపాణి మద్యం సేవించి ద్విచక్రవాహనాన్ని నడపడంతో అతని మీద కేసు నమోదు చేసి బైకుని స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి చక్రపాణి తన బంధువు రాజదురై, అతని భార్య సూర్యప్రియ (27)తో చర్చించాడు. అనంతరం సూర్యప్రియ పోలీసు యూనిఫామ్ ధరించుకొని శుక్రవారం ఉదయం చిదంబరం పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. తాను చెన్నై నీలాంగరై పోలీసు స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నట్లు చెప్పింది.
మద్యం మత్తులో వాహనం నడుపుకొని వచ్చిన చక్రపాణి బైకుని ఇవ్వాలంటూ అడిగింది. ఆమె తీరుపై అనుమానం రావడంతో స్థానిక పోలీసులు నీలాంగరై పోలీసుస్టేషన్‌కి ఫోన్ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ పేరుతో అక్కడ ఎవరూ పనిచేయడం లేదని తేలింది. అనంతరం జాయింట్ పోలీసు సూపరింటెండెంట్ కార్తిగేయన్, సూర్య ప్రియ గురించి విచారించగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. సూర్యప్రియా పోలీసు యూనిఫామ్ ధరించి తన భర్త రాజదురై, బంధువు చక్రపాణితో కలిసి తరచూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వాహన దారులను అడ్డుకొని నగదు లాక్కోవటం, కొంత మందికి ప్రభుత్వ కార్యాలయాలలో కుల, ఆదాయ సర్టిఫికేట్లు ఇప్పిస్తానంటూ మోసం చేస్తూ వచ్చినట్లు తెలిసింది. అనంతరం సూర్యప్రియ, రాజదురై, చక్రపాణిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment