బాధితురాలు ముసునూరు సుజాత
పెనమలూరు : మండలంలోని పెదపులిపాక గ్రామంలో నకిలీ పోలీసులు హల్‌చల్ చేశారు. తాము పోలీసులమని, నైట్ బీట్‌లో వచ్చామని, తాగటానికి మంచినీళ్లు అడిగి ఓ వృద్ధురాలిని నమ్మించి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బంధించి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. పెదపులిపాకలో ముసునూరు సుజాత (70) తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె కుమారుడు విశ్వేశ్వరరావు అమెరికాలో ఉంటాడు. శనివారం రాత్రి 11 గంటలకు ఇద్దరు వ్యక్తులు పోలీసు దుçస్తులు ధరించి ఆమె ఇంటికి వచ్చారు. ఆమెను పిలిచి మామ్మ గారు బాగున్నారా అని అడిగారు. తాము పెనమలూరు పోలీసులమని, కరకట్టపై రాత్రి డ్యూటీకి వచ్చామని చెప్పారు. గత పుష్కరాల్లో మీతో పరిచయమైందని, పలకరించి వెళదామని వచ్చామని నమ్మించారు.
తాగటానికి నీళ్లు ఇవ్వమని అడిగారు. దీంతో ఆమె తలుపులు తీసింది. వచ్చిన ఇద్దరు వ్యక్తులు నీళ్లు తాగి కొద్ది సమయం టీవీ చూస్తామని కూర్చున్నారు. అర గంట తర్వాత వృద్ధురాలు తనుకు నిద్ర వస్తోందని చెప్పింది. దీంతో ఇద్దరు వ్యక్తులు వెళ్లిపోవటానికి లేచి వెళ్లినట్లు వెళ్లి హఠాత్తుగా తలుపు మూశారు. ఆమెను ప్యాకింగ్‌కు ఉపయోగించే ప్లాస్టర్‌తో బంధించి ఇంట్లో సొమ్ము ఉంటే ఇవ్వాలని బెదిరించారు. తన వద్ద సొమ్ము లేదని, తనను ఏమీ చేయవద్దని వృద్ధురాలు ప్రాధేయపడింది. దీంతో వారు ఆమె ఒంటిపై ఉన్న 12 కాసుల బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయారు. ఆమె వద్ద ఉన్న ఫోన్‌తో బంధువులకు ఘటనపై సమాచారం ఇచ్చింది. దీంతో వారు వచ్చి ఆమెను బంధ విముక్తి చేశారు.
పోలీసుల హడావుడి..
సమాచారం తెలుసుకున్న పోలీసు అధికారులు అర్థరాత్రి పెదపులిపాక వచ్చారు. జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలు సేకరించారు. దొంగలు ఖాకీ దుస్తుల్లో వచ్చి ఈ విధంగా చోరీ చేయటంతో పోలీసుల్లో కలకలం రేగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment