మాట్లాడుతున్న బాధిత మహిళలు
నెల్లూరు , ఆత్మకూరు: జైలులో మగ్గుతున్న వ్యక్తిని కుటుంబసభ్యులు బెయిల్‌పై తీసుకొచ్చిన కొద్ది నిమిషాల్లోనే టాస్క్‌ఫోర్స్ పోలీసులమని మఫ్టీలో ఉన్న ఐదుగురు వ్యక్తులు మహిళలపై దాడికి పాల్పడి బెయిల్ పొందిన వ్యక్తిని లాక్కెళ్లిన ఘటన పట్టణంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత మహిళలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చెన్నైలో మొబైల్‌షాపు నిర్వహిస్తున్న సా«థిక్ మన్సూర్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతని ఇంటికి సమీపంలోనే చెల్లెళ్లు నివసిస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది జూన్ 29వ తేదీన ఆంధ్రా పోలీసులు మొబైల్ దుకాణం వద్దకు వచ్చి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాతో సాధిక్ మన్సూర్ (పోలీసులు మన్సూర్ అలీ అని ఇతని పేరు మార్చారు)కు సంబంధాలున్నాయని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పటినుంచి నెల్లూరు జిల్లాలోని పలు జైళ్లలో తిప్పుతూ బెయిల్ తెచ్చుకుంటున్నా విడుదల చేయలేదు. మొత్తం 14 కేసులు అతడిపై నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయగిరి కోర్టు ద్వారా బెయిల్ వచ్చింది.
గత వారమే సూళ్లూరుపేట జైల్ నుంచి ఆత్మకూరు జైలుకు తరలింపబడిన సాధిక్ మన్సూర్ బెయిల్‌కు సంబంధించిన పత్రాలను భార్య, అక్కాచెల్లెళ్లు, తల్లి సమర్పించి అతడిని తీసుకువచ్చారు. కొద్ది నిమిషాలకే ఓ కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి మన్సూర్‌ను తమ వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కుటుంబసభ్యులు, బంధువులు ఇదేంటని ప్రశ్నించగా వారిపై దాడికి పాల్పడి సెల్‌ఫోన్లను లాక్కొని దూరంగా నెట్టివేసి మన్సూర్‌ను తీసుకుని వెళ్లిపోయారు. దీంతో సాధిక్ భార్య ఆయేషా, చెల్లెళ్లు జన్నత్, సాలిహా, యాస్మిన్, తల్లి, మరదలు బెనజీర్, మనిషాలు తెలుగు భాష రాక తమ గోడు చెప్పుకునేందుకు ఎవరూ లేక స్థానికుల సహకారంతో జరిగిన విషయాన్ని ఆత్మకూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే ఈ కేసుతో తమకేమి సంబంధం లేదని పోలీసులు ఫిర్యాదును తీసుకోలేదని బాధితులు తెలిపారు. అసలు తన భర్త పేరు సాథిక్ మన్సూర్ కాగా పోలీసులు మన్సూర్ ఆలీ అని చెబుతూ 14 కేసుల్లోనూ ఇలానే పేరు మార్చి కేసులు నమోదుచేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయేషా వాపోయింది. పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎస్పీని గురువారం కలవనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment