
కారులో ఇరుక్కపోయిన నాగమురళీకృష్ణ
కోదాడరూరల్: బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి పండగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు.. తిరిగి హైదరాబాద్ వస్తున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ దుర్ఘటనలో భార్య, భర్త, కూతురు మృతి చెందగా కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ దుర్ఘటన బుధవారం ఉదయం కోదాడ మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొమరబండ శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాలోని చర్లపల్లి ఈసీనగర్‌కు చెందిన రావి నాగమురళీకృష్ణ(48) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంతో పాటు వ్యాపారం చేస్తుంటాడు. ఇతడి భార్య కవిత(42) బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తోంది. ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు ధనుష(17), కుమారుడు యునిత్‌తో కలిసి సంక్రాంతికి అత్తగారి గ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపాలెం వెళ్లారు.
అక్కడ బంధువులతో ఆనందంగా గడిపిన వారు బుధవారం ఉదయం హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో కొమరబండ శివారుకు రాగానే వేగంగా వస్తున్నకారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం గాలిలోకి ఎగిరి అటువైపుగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టి.. పక్కనే ఉన్న కల్వర్టును బలంగా తాకింది. ఈ ఘోర ప్రమాదంలో యునిత్ చెయ్యి విరిగి గాయాలతో బయట పడగా.. మిగతా ముగ్గురూ అక్కడి కక్కడే మృతి చెందారు. యునిత్ కారు వెనుక సీ టులో పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రులు, అక్క మృతి చెందడంతో బాలుడు అనాథగా మిగిలాడు.
గాలిలో ఎగిరిపడిన మృతదేహాలు
కారు వేగంగా కల్వర్టును ఢీకొట్టడంతో కవిత, ధనుషలు 15 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు. కవిత తలపైభాగం విడిపోయి దూరంగా పడింది. సీటు బెల్టు పెట్టుకున్న మురళీకృష్ణ కారులోనే తీవ్ర గాయాలతో మృతి చెందాడు. కారులో ఇరుక్కుపోయిన అతన్ని పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు.
కవిత, ధనుష మృతదేహాలు, చికిత్స పొందుతున్న బాలుడు యునిత్
అతివేగమే కారణమా?
ఈ ప్రమాదానికి అతి వేగమే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా ప్రయాణించడంతోనే అదుపుతప్పి కారు దాదాపు 20 మీటర్ల దూరం వరకు డివైడర్‌పై ఉన్న చెట్లను వేర్లతో సహా పెకిలించుకుని పూర్తిగా అవతలివైపునకు వెళ్లి బలంగా ఢీకొట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీంతోనే పాటు ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నా పగిలిపోవడం, మృతదేహాలు దూరంగా ఎగిరిపడడం చూస్తుంటే అతి వేగమే కారణమని నిర్థారిస్తున్నారు.
మరో ముగ్గురికి గాయాలు
నాగమురళీకృష్ణ కారు అవతలి వైపు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టడంతో ఓ కారులో ఉన్న ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన కంభంపాటి ఈశ్వర్, సోమనగారి స్వామి, హైదరాబాద్‌కు చెందిన కలువ అనిరుథ్‌లకు గాయాలయ్యాయి. వారు స్థానిక ప్రైవేట్ వైద్యాశాలలో చికిత్స పొందుతున్నారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన విషయాన్ని తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయపడిన బాధితులకు మెరుగైన సహాయం అందే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అప్పటికే డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాసరెడ్డి, రవితో పాటు రూరల్, అనంతగిరి ఎస్‌లు దశరథ, రామాంజనేయులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ప్రమాదంపై ఏపీ హోంమంత్రి ఆరా
ప్రమాదం జరిగిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చిన్న రాజప్ప కోదాడ పోలీసులను ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment