లక్ష్మిని ఓదార్చుతున్న బంధువులు
విధి ఆ కుటుంబంపై విషం చిమ్మింది. కూలినాలి చేసుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్న వారిపై కన్ను కుట్టినట్లుంది. వారి రాతను తిరగరాసింది. నట్టింట కాపుకాసిన మృత్యువు ఆ ఇంట మరణ మృదంగం మోగించింది. మృత్యువు ఎదుటే ఆడుతున్నా ఆ ఇల్లాలు ముప్పును తప్పించలేకపోయింది. అభం, శుభం తెలియని పసికందులతోపాటు భర్త మృత్యుపాశాల్లో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటుంటే ఆమె ప్రాణం తల్లడిల్లిపోయింది. ఒకరి తరువాత ఒకరు మృత్యుడికి చేరుతుంటే కాపాడండి కాపాడండి.. అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించినా ఆమెకు గుండె కోతే మిగిలింది. గురువారం మండలంలోని గనికపూడిలో విద్యుత్ షాక్ గురై తండ్రీ, కొడుకు, కూతురు మృత్యు వాత పడ్డారు.
గుంటూరు, గనికపూడి (ప్రత్తిపాడు): స్థానికులు, పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన గుమ్మడి ఏసు తన భార్యా పిల్లలతో కలిసి తమ బంధువైన గుమ్మడి పెద్దంకమ్మ గృహ ప్రవేశానికి హాజరయ్యేందుకు ఈ నెల 11వ తేదీన గనికపూడి వచ్చారు. 12వ తేదీన గృహ ప్రవేశం పూర్తయింది. తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోదామనుకున్నారు. అయితే వీరికి సమీప బంధువులైన మరొకరి ఇంట్లో 13వ తేదీన పుష్పాలంకరణ వేడుక ఉండటంతో ఆగిపోయారు. గురువారం కొత్తగా గృహ ప్రవేశం పూర్తి చేసిన ఇంట్లోకి కేబుల్ వైరు లాగేందుకు గుమ్మడి ఏసు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం ఎక్కి చిన్నపాటి మరమ్మతుటు చేశాడు. స్ప్రింగ్ వైర్ సాయంతో కేబుల్ వైర్‌ను ఇంటి లోపలకు లాగుతున్నాడు. ఇదే సమయంలో కూతురు ఎస్తేరురాణి (3) వైర్‌ను పట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయింది. కూతురిని కాపాడేందుకు తండ్రి ఏసు (28) ప్రయత్నించడంతో అతనూ షాక్‌కు గురయ్యాడు. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే చనిపోయారు. తండ్రి, చెల్లి కదలకుండా పడి ఉండటంతో వారిని పట్టుకున్న కొడుకు సాల్మన్‌రాజు (5) కూడా నోటి వెంట నురుగ కక్కుకుని మరణించాడు. గమనించిన తల్లి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ముందుగా ఇంటికి సరఫరా అవుతున్న కరెంటును నిలిపివేశారు. అప్పటికే ముగ్గురూ విగతజీవులయ్యారు. తల్లి గుమ్మడి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేబ్రోలు సీఐ నరేష్‌కుమార్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..
విషయం తెలియడంతో ప్రత్తిపాడు ఎస్‌ఐ ఎస్ రవీంద్ర ఘటన స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తికి, చేబ్రోలు సీఐ నరేష్‌కుమార్‌కు తెలియజేశారు. వారు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేబుల్ వైర్ ఎలా షాక్ కొట్టింది. అసలు కేబుల్ వైర్ నుంచి ఎందుకు విద్యుత్ సరఫరా అవుతుంది? అనే విషయాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
బంధాల్ని బలిచేస్తూ..
అప్పటి వరకూ అన్నా చెల్లెళ్లిద్దరూ మారాం చేశారు.. చూడమ్మా అన్న ఏడిపిస్తున్నాడంటూ తల్లి కొంగుచాటుకు చేరిన చెల్లి.. కాదమ్మా చెల్లే నన్ను కొడుతోందంటూ అమ్మ అక్కున చేరిన కొడుకు.. నిండునూరేళ్లు అండగా ఉంటానంటూ అగ్ని సాక్షిగా ఏడగులు నడిచిన భర్త.. ఏడేళ్ల క్రితం ఒక్కటైన ‘మూడు’ ముళ్ల బంధం..అన్నీ అప్పటి వరకు తన చుట్టూనే అల్లుకుని ఉన్నాయి. ఆప్యాయత మధురిమల్లో సంతోషాన్ని కలబోసుకున్నాయి. కొడుకు, కూతురిపై ఆ తల్లి ఎన్నో కలలు, మరెన్నో ఆశలు నింపుకుంది. తానొకటి తలస్తే దైవం మరొకటి తలచింది. ఆమె ఆశల్ని సమాధి చేస్తూ.. బంధాల్ని బలి చేస్తూ.. తన పేగు బంధాలను చిదిమేసింది. భర్తతోపాటు ఇద్దరు పిల్లలు కళ్ల ముందు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేక గుండెలవిసేలా రోదించింది. ‘దేవుడా నేనేం పాపం చేశాను.. నన్నొక్కదాన్ని మాత్రం ఎందుకుంచావు.. నా బిడ్డలు, భర్తలేని లోకంలో నేనెందుకు.. ఏ దేవుడికీ నా మీద జాలి కలగలేదా.. ఏ ఒక్కరినీ నాకు మిగల్చాలనుకోలేదా’ నేనూ బతకలేను.. నన్నూ తీసుకుపో’.. అంటూ కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలిచివేసింది.
గామాలపాడులోయువకుడి మృతి
గామాలపాడు(దాచేపల్లి): విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని గామాలపాడులో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ నాగుల్ పాత ఇంటికి మరమ్మతులు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న కరెంట్ మోటర్ పని చేయకపోవటంతో నాగుల్ కుమారుడు మస్తాన్ మోటర్ వైరును పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో వైర్‌కు కరెంట్ సరఫరా కావటంతో షాక్‌కు గురై మస్తాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందు మస్తాన్ మృతి చెందటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై షేక్ మహ్మద్ రఫీ పరిశీలించారు. పొస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
భీమవరంలో మహిళ బలి
భీమవరం(సత్తెనపల్లి): పొలంలో విద్యుత్ తీగలు తలిగి మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని భీమవరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..భీమవరానికి చెందిన ఒంటిపులి శేషమ్మ(55) గురువారం మధ్యాహ్నం పొలం పనులకు వెళ్లింది. అక్కడ సూర్యా టెక్స్‌టైల్స్ జిన్నింగ్ మిల్లు చుట్టూ వేసి ఫెన్సింగ్‌కు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. పగలు సైతం ఫెన్సింగ్‌కు విద్యుత్ సరఫరా కావడాన్ని పరిశీలించారు. మృతురాలి సోదరి తిరుపతి లక్ష్మి ఫిర్యాదు మేరకు సూర్య టెక్స్‌టైల్స్ యజమాని జజ్జనం శ్రీలక్ష్మిపై కేసు నమోదు చేశారు. మృతురాలికి భర్త చిన కోటేశ్వరరావుతోపాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment