ఆ ఇంట మిగిలింది ఆమె ఒక్కతే | Family Members Dies In road Accident Khammam | Sakshi
Sakshi News home page

ఆ ఇంట మిగిలింది ఆమె ఒక్కతే

Published Thu, Feb 7 2019 7:18 AM | Last Updated on Thu, Feb 7 2019 7:18 AM

Family Members Dies In road Accident Khammam - Sakshi

సృహ కోల్పోయిన విజయ పిచ్చమ్మ వెంకటేశ్వర్లు కోదండరాం ప్రణయ్‌

చీకటి... ఏ ఇంటి ‘దీపా’న్ని ఆర్పుతుందో, ఏ కంటి ‘వెలుగు’ను కాటేస్తుందో ఎవ్వరం చెప్పలేం. మృత్యువు... ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎలా తీసుకెళుతుందో ఒక్కోసారి ఏమాత్రం ఊహించలేం. 
 ఈ రెండూ కలిస్తే... ఘోరం జరుగుతుంది, విషాదం మిగులుతుంది, నేలకొండపల్లిలో ఇదే జరిగింది. 

నేలకొండపల్లి: మండల కేంద్రమైన నేలకొండపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమా దంలో ఒకే కుటుంబంలోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. తనవాళ్ల రాక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ఆమె... వారు ఇంకెప్పుడూ తిరిగి రారని, తిరిగి రాలేని లోకానికి వెళ్లారని విన్నంతనే స్పృహ కోల్పోయింది.

ఏం జరిగిందంటే... 
నేలకొండపల్లికి చెందిన పాలపాటి వెంకటేశ్వర్లు(40), ఆయన తల్లి పాలపాటి పిచ్చమ్మ(70), కుమారులు పాలపాటి కొదండరాం(10), పాలపాటి ప్రణయ్‌(6) కలిసి మంగళవారం సాయంత్రం ముదిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామంలో శుభ కార్యానికి బైక్‌పై వెళ్లారు. ఆ వేడుక పూర్తయి, భోజనాలు చేసి, ముచ్చట్లు ముగించేసరికి అర్ధరాత్రయింది. ‘‘ఇక ‘సెలవ్‌’... మేము ‘వెళ్తాం’... అక్కడ ఒక్కతే (పాలపాటి వెంకటేశ్వర్లు భార్య విజయ) ఉంది. మాకోసం ఎదురుచూస్తుంటుంది...‘‘ అని, అందరితో వెంకటేశ్వర్లు చెప్పాడు. ఇంత అర్ధరాత్రి వేళ వెళ్లడం మంచిది కాదని, పొద్దున్నే వెళ్లొచ్చని బంధువులు వారించారు.

పిల్లలు కూడా... ‘‘ఇంత చలిలో ఎందుకు..?’’ అన్నారు. అతడి తల్లి కూడా... ‘‘ఈ రాత్రికి ఉండిపోదామురా...’’ అంది. ఎవరు ఎంతగా చెప్పినా అతడు వినలేదు. అతడి నోటెంట ఒక్కటే మాట... ‘‘అక్కడ విజయ ఒంటరిగా ఉంది. భయపడుతుంది. మా (మన) కోసం ఎదురుచూస్తుంటుంది’’. ఈ మాట అన్నాక... ఆ ఇద్దరు పిల్లలు, అతడి తల్లి, బంధువులు ఇంకేమీ అనలేకపోయారు, ఆపలేకపోయారు. అందరికీ ‘గుడ్‌బై’ చెప్పి ఆ నలుగురూ బైక్‌పై ఆ చిమ్మచీకటిలో, వణికిస్తున్న చలిలో ఇంటికి బయల్దేరారు. వీరితోపాటు మరికొందరు బంధువులు కూడా తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్ల వాహనాలు కొంచెం ముందు వెళుతున్నాయి. వాటి వెనుకగా వీళ్ల బైక్‌ ఉంది.

ఇంకా రాలేదని... 
నేలకొండపల్లి – వెంకటాపురం మధ్య దూరం 10 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఎంత నెమ్మదిగా వెళ్లినా గంటలోపులోనే చేరుకోవచ్చు. కానీ, ముందు బయల్దేరిన బంధువులు గ్రామానికి చేరుకున్న గంట తరువాత కూడా పాలపాటి వెంకటేశ్వర్లు వాహనం రాలేదు. అప్పటికే, విజయలో భయాందోళన మొదలైంది. ఆ బంధువులదీ అదే పరిస్థితి. వారి మనసు కీడును శంకించింది. వెంటనే బైక్‌లపై నేలకొండపల్లి బయల్దేరారు. వాహనాల లైట్ల కాంతిలో చుట్టూ జాగ్రత్తగా చూసుకుంటూ వెళుతున్నారు.

నేలకొండపల్లి సమీపంలోని చెరువు కట్ట (నక్కల తూము) వద్దకు వచ్చేసరికి... వారి గుండెలు ఒక్కసారిగా గుభేలుమన్నాయి. రోడ్డు పక్కన బైక్‌ పడిపోయింది. అది పూర్తిగా ధ్వంసమైంది. దానిని వెంకటేశ్వర్లుదిగా గుర్తించారు. కొంచెం దూరంలో అక్కడక్కడ విసిరేసినట్టుగా... ఆ నలుగురి మృతదేహాలు. వాళ్ల ఒంటి నిండా గాయాలు. ఆ బంధువులు ఒక్కసారిగా పెద్దపెట్టున ఏడ్చారు.

సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై ఎన్‌.గౌతమ్‌ అక్కడకు చేరుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఖమ్మం ఏసీపీ వెంకట్రావ్, కూసుమంచి సీఐ మురళి వ చ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆ స్పత్రికి తరలించారు. ప్రమాద కారణాలను తె లుసుకునేందుకు సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలిస్తున్నారు. ప్రమాద స్థలంలో ఆధారాలను క్లూస్‌ టీం సేకరించింది. గుర్తు తెలియని వాహనం ఢీకొ న్నందునే ఈ ప్రమాదం జరిగినట్టుగా అందరూ భావిస్తున్నారు.

స్పృహ కోల్పోయిన విజయ... 
తన భర్త, ఇద్దరు పిల్లలు, అత్త... ఈ లోకాన్ని విడిచి వెళ్లారన్న వార్త చెవిన పడడంతోనే పాలపా టి వెంకటేశ్వర్లు భార్య విజయ స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. ఈ దుర్వార్తను బుధవారం ఉదయం వరకు ఆమెకు బంధువులు తెలియనివ్వలేదు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న తరువాత, విషయం తెలియడంతోనే దిగ్భ్రాంతితో స్పృహ కోల్పోయి పడిపోయింది. మృతదేహాలపై పడి ఆమె గుండె పగిలేలా రోదించింది. ఆ దృశ్యం... చూపరులకు కన్నీళ్లు తెప్పించింది.

ఖమ్మం నేత్ర నిధికి నేత్రాలు... 
పాలపాటి వెంకటేశ్వర్లు, అతడి కుమారుడు పాలపాటి కోదండరాం నేత్రాలను ఖమ్మం నేత్ర నిధికి బంధువులు ఇచ్చారు. ఖమ్మం నేత్ర నిధి కార్యదర్శి రాయపూడి అనంత పద్మనాభం సమక్షంలో నేత్రాలను వైద్య నిపుణులు సేకరించారు. పలువురు ప్రముఖుల సంతాపం నలుగురి మృతిపట్ల రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సంతాపం, విజయకు సానుభూతి తెలిపారు.

పలువురి నివాళి... 
మృతదేహాలను ఎంపీడీఓ బి.రవికుమార్, సర్పం చ్‌ రాయపూడి నవీన్, ఉప సర్పంచ్‌ లక్కం కొండ లు, వివిధ పార్టీల నాయకులు కర్నాటి భానుప్రసాద్, జెర్రిపోతుల సత్యానారాయణ, పివి.నాగి రెడ్డి,  బైరం సుందర్‌రావు, బీమాల శ్రీనివాసరావు  సందర్శించి నివాళులర్పించారు. ఇద్దరు చిన్నారులు చదువుతున్న గౌతమ్‌ పాఠశాలకు యాజమాన్యం బుధవారం సెలవు ప్రకటించింది.

నిండు వెలుగుల నిరుపేద కుటుంబం 
వీరిది నిరుపేద కుటుంబం. వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా పెయింటర్‌. ఆయన భార్య విజయ, తల్లి పిచ్చమ్మ... కూలీనాలీ పనులు చేస్తున్నారు. పిల్లలిద్దరూ చదువుతున్నారు. పెద్దోడు కోదండరాం– నాలుగోతరగతి. చిన్నోడు ప్రణయ్‌– ఎల్‌కేజీ. ఆర్థికంగా లేనప్పటికీ, ఉన్న దానితోనే సంతృప్తిగా, సంతోషంగా బతుకుతున్న కుటుంబం వీరిది. గత ఏడాది వరకు వీరికి స్వంత ఇల్లు కూడా లేదు. కొన్నాళ్ల కిందటే డబుల్‌ బెడ్రూం ఇల్లు వచ్చింది. ఐదుగురితో నిత్యం కళకళలాడిన ఆ ఇంటిలో ఇప్పుడు విజయ ఒక్కతే ఒంటరి పక్షిలా మిగిలింది. ఆ నలుగురి ‘చివరి’ మాటలు... ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి. 

  • ‘‘ఒక్కదానివే ఉన్నావని భయపడకు’’ – భర్త వెంకటేశ్వర్లు. 
  • ‘‘అమ్మాయ్‌.. జాగ్రత్త. త్వరగానే వచ్చేస్తాం..’’ – అత్త పిచ్చమ్మ. 
  • ‘‘అమ్మా... బైబై...’’         – ఇద్దరు పిల్లలు. 

 
ఆ నలుగురి చివరి మాటల్లో కింది
అంతరార్థం ఉందేమోనని అనిపిస్తోంది....

  • ‘ఇకపై ఒంటరిగా ఉండాల్సొస్తుంది. ఏమాత్రం భయపడకు’ అని, భర్త ధైర్యం చెబుతున్నాడేమో...! 
  •  
  • ‘జాగ్రత్తగా ఉండు. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది...’ అని, అత్త దీవిస్తున్నదేమో...!! 
  •  
  • ‘అమ్మా... మేమెక్కడికీ వెళ్లలేదు. నీతోనే ఉన్నాం. రోజూ స్కూల్‌కు, బయటకు వెళ్లినప్పుడు బైబై చెబుతాముగా... ఇప్పుడూ అంతే... బైబై...’ – అని, అమ్మను ఆ పిల్లలిద్దరూ ఊరడిస్తున్నారేమో...!!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement