రైతుల ప్రాణాలు తీసిన విద్యుత్‌ తీగలు.. | Farmers Died Due To Electrocution In Machareddy At Kamareddy | Sakshi
Sakshi News home page

కాటేసిన కరెంటు

Published Tue, Sep 17 2019 10:02 AM | Last Updated on Tue, Sep 17 2019 10:11 AM

Farmers Died Due To Electrocution In Machareddy At Kamareddy - Sakshi

రైతుల మృతదేహాలు  

వేలాడుతున్న విద్యుత్‌ తీగలు యమపాశాలయ్యాయి. ఇంకో నిమిషంలో పని పూర్తవుతుందనగా కరెంటు తీగ రూపంలో వచ్చిన మృత్యువు.. మూడు నిండు ప్రాణాలను బలిగొంది. మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బోరుమోటారుకు మరమ్మతులు చేస్తుండగా వేలాడుతున్న విద్యుత్‌ తీగలకు పైపులు తగలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

సాక్షి, మాచారెడ్డి: వెల్పుగొండ గ్రామానికి చెందిన ఇమ్మడి సత్యనారాయణ(40), ఐలేని లక్ష్మణ్‌రావు(70), ఐలేని మురళీధర్‌రావు (50) వ్యవసాయం చేసుకుంటూ తీరిక సమయాల్లో బోరుమోటార్లును మరమ్మతులు చేస్తుంటారు. అదే గ్రామానికి చెందిన మారగోని స్వామిగౌడ్‌ బోరుమోటారు చెడిపోయింది. దీంతో మరమ్మతు చేయడానికి ఆయన వీరికి సమాచారం అందించారు. ముగ్గురు సోమవారం ఉదయం భోజనాలు చేసి ఇంటి నుంచి దోమకొండ– వెల్పుగొండ రహదారి పక్కన ఉన్న స్వామిగౌడ్‌ చేనుకు వెళ్లారు. మోటారుకు మరమ్మతులు చేయడం కోసం పైపులు పైకి తీయ డం ప్రారంభించారు. చివరి పైపును కూడా బోరు బావిలోంచి తీస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. పైప్‌నకు మోటారు ఉండడంతో బరువు ఎక్కువై పైపు ఓ వైపునకు ఒరిగింది. సమీపంలోనే ఉన్న విద్యుత్‌ తీగలకు పైపు తగిలింది. దీంతో విద్యుత్‌ ప్రసారమై ముగ్గురు అక్కడికక్కడే విగతజీవులయ్యారు. సత్యనారాయణ కాలు, లక్ష్మణ్‌రావు చేయి పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మృతులు సత్యనారాయణకు భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లక్ష్మణ్‌రావుకు భార్య రాజవ్వ, ఐదుగురు పిల్లలున్నారు. మురళీధర్‌రావుకు భార్య అరుణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మిన్నంటిన రోదనలు..
విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృత్యువాత పడిన ఘటన వెల్పుగొండలో విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకుని గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి వచ్చారు. హృదయ విదారక ఘటనను చూసి విలపించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ 
కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, మాచారెడ్డి ఎస్సై మురళి సంఘటన స్థలానికి వెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

గ్రామస్తుల ఆందోళన
విద్యుత్‌ ప్రమాదానికి ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. విద్యుత్‌ తీగలు బోరుబావికి అతిసమీపంలో ఉన్నాయని, తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని ఆరోపించారు. విద్యుత్‌ తీగలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వేలాడుతున్న వాటిని సవరించాల్సిన ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చే శారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మాచారెడ్డి ఎస్సై మురళి గ్రామస్తులను సముదాయించారు.

రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
వెల్పుగొండ గ్రామంలో జరిగిన విద్యుత్‌ ప్రమాదంపై మాజీ మంత్రి షబ్బీర్‌అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోరుమోటారు తీయడానికి వెళ్లిన రైతులు కరెంట్‌ షాక్‌తో చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతులు మురళీధర్‌రావు, లక్ష్మణ్‌రావు, సత్యనారాయణ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement