
సాక్షి, తూప్రాన్: భార్య కాపురానికి రాలేదని కన్న కూతురుని కడతేర్చాడు ఓ తండ్రి. ఈ కేసును పోలీసులు మంగళవారం చేధించారు. కేసుకు సంబందించిన వివరాలను సీఐ లింగేశ్వర్‌రావు వెల్లడించారు. ఈనెల 5వ తేదీన తూప్రాన్ మండలం కరీంగూడ సమీపంలో ఓ గుర్తుతెలియని యువతిని బండరాయితో తలపై మోది హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు యువతిని హత్యచేసింది కన్న తండ్రే అని నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. చిత్తూరు జిల్లా మల్కలచెరువు మండలం బోరెడ్డిపల్లెకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి కొంతకాలంగా భార్యతో గొడవలు పడుతూ మనోవేదన చెందుతున్నాడు. తన భార్య కాపురానికి రాలేదని కూతురుపై కక్ష్యను పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే కూతురు లక్ష్మీప్రసన్న(15)ను తనవెంట తీసుకొని తూప్రాన్‌కు ఈనెల 5న చేరుకున్నాడు. అతడు గతంలో బోర్‌వెల్ బండి పనిచేయడంతో ఈ ప్రాంతంలో అయితే కూతురును హత్యచేస్తే ఎవరు గుర్తించరని నిర్ధారించుకుని తూప్రాన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 5న రాత్రి కరీంగూడ చౌరస్తా వద్ద బస్సు దిగిన అనంతరం తన కూతురును రోడ్డు పక్కన బండరాళ్ల మధ్యకు తీసుకెళ్ళాడు. ఇంత రాత్రి ఈ ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్తున్నావని కూతురు కేకలు వేయడంతో ఆమె తలను రాయికి బలంగా గుద్దాడు. అనంతరం బండరాయితో తలపై మోది చనిపోయిందని నిర్ధారించుకొని ఆ ప్రాంతం నుంచి పారిపోయినట్లు సీఐ తెలిపారు.
ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలోని తన కుటుంబ సభ్యులు లక్ష్మీప్రసన్న కనిపించని విషయాన్ని అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకున్న తండ్రి శ్రీకాంత్‌రెడ్డిని కుటుంబ సభ్యులు నిలదీయడంతో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతన్ని గృహ నిర్బంధం చేసి పోలీసులకు అప్పగించారన్నారు. అక్కడి పోలీసుల సమాచారంతో హత్యకు గురైన యువతి ఆచూకీ లభించినట్లు సీఐ లింగేశ్వర్‌రావు తెలిపారు. ఈ క్రమంలోనే మంగళవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసును తూప్రాన్ నుంచి చిత్తూరు జిల్లాకు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సై సుభాష్‌తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment