
సాక్షి, కృష్ణాజిల్లా : నూజివీడు: తండ్రికొడుకులు గొడవపడిన నేపథ్యంలో తాను చనిపోతానంటూ కొడుకు ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకొని విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. కొడుకును కాపాడేందుకు యత్నించిన తండ్రి కూడా విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ ఘటన నూజివీడు మండలం లీలానగర్ అడ్డరోడ్డులో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాట్రాయి మండలం చిత్తపూర్‌కు చెందిన మంతెన ఇస్మాయిల్(48)కి ఇరువురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు మంతెన వెంకటేశ్వరరావు(25) మద్యానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాగుడు మాన్పించాలనే లక్ష్యంతో ఇస్మాయిల్ కుటుంబం రెండు నెలల క్రితం నూజివీడు మండలం లీలానగర్ అడ్డరోడ్డు వద్ద ఉన్న చర్చి వద్దకు వచ్చి ఉంటూ అక్కడే పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కుమారుడు వెంకటేశ్వరరావు మద్యం సేవించి గొడవ చేస్తుండటంతో తండ్రి వారించాడు. దీంతో తండ్రిపై చేయి చేసుకున్నాడు. తాగుడు మాన్పిద్దామని ఇక్కడకు వస్తే మార్పేమీ లేకుండా నిత్యం తాగుతూనే ఉంటే ఎలాగని తండ్రి నిలదీశాడు. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటల సమయంలో నేను చచ్చిపోతానంటూ మద్యం మత్తులో చర్చి ఎదురుగా రోడ్డు వెంబడి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంకటేశ్వరరావు పట్టుకున్నాడు. కొడుకు ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడానికి వెళ్తుండటం చూసి తండ్రి ఇస్మాయిల్ కూడా వెళ్లి కొడుకు కాళ్లు పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. అప్పటికే వెంకటేశ్వరరావు మరణించగా, ఇస్మాయిల్ పట్టుకోవడంతో అతనికి కూడా విద్యుత్‌షాక్ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఇస్మాయిల్‌ను పట్టణంలోని అమెరికన్ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇరువురి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు వెంకటేశ్వరరావుకు బార్య, కుమార్తె ఉన్నారు. రూరల్ ఎస్‌ఐ దుర్గాప్రసాదరావు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment