
మృతురాలు యమున
ధర్మవరం రూరల్: తనకంటువారిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనం నుంచి జారి పడి యమున (27) అనే వివాహిత మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. బుక్కపట్నం మండలం రాంసాగర్‌కు చెందిన రమేష్, యుమున దంపతులు. రమేష్ బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంత కాలంగా భార్య యమున తలనొప్పితో బాధపడుతుండేది.
పలు ఆసుపత్రులలో చికిత్సలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. ధర్మవరంలో నాటు వైద్యుని దగ్గర చికిత్స చేయించుకునేందుకు తెల్లవారుజామునే భర్తతో కలసి ఆమె స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గం మధ్యలో తనకంటువారిపల్లి సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న యమున జారి పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆటోలో ధర్మవరం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.