ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవల్లిక
రెవెన్యూ అధికారులు విచారణ చేయకుండానే సాగులో ఉన్న వారిని కాదని మరొకరి పేరిట ఆన్‌లైన్‌లో చేర్చారు. తమకు న్యాయం చేయండని రెండేళ్లుగా తిరుగుతున్నా నిరాశే ఎదురుకావడంతో మనస్తాపానికి గురైన బాధిత మహిళా రైతు తహసీల్దార్ కార్యాలయంలో అందరూ చూస్తుండగా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఆత్మకూరు మండలంలో కలకలం రేపింది.
ఆత్మకూరు: వడ్డుపల్లికి చెందిన ప్రవల్లిక, ఆంజనేయులు దంపతులు. దళిత సామాజిక వర్గానికి చెందిన వీరు గ్రామ సమీపంలో 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొన్ని దశాబ్దాలుగా వేరుశనగ సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. 2014 నుంచి కరువు పరిస్థితుల కారణంగా పంటలు చేతికందలేదు. భూమి బీడుగా ఉంది. దీన్ని అదనుగా భావించిన బాలాదేవి, బాలా బొజ్జన్న దంపతులు ఆ 3.70 ఎకరాల భూమిని తమ పేరు మీద ఆన్‌లైన్‌లో చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత సాగుదారులైన ప్రవల్లిక, ఆంజనేయులు దంపతులు రెవెన్యూ అధికారులను సంప్రదించారు. తమకు న్యాయం చేయండని వేడుకున్నారు. ఆఖరుకు న్యాయస్థానాన్నీ ఆశ్రయించారు.
ఆన్‌లైన్‌లో ఉన్న వివరాల ప్రకారం ఆ భూమి బాలాదేవి, బాలాబొజ్జన్నలదేనని తేల్చారు. జీవనాధారమైన భూమి కోసం బాధితులు మళ్లీ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అందులో భాగంగానే ప్రవల్లిక సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమకు న్యాయం చేయండని మరోసారి తహసీల్దార్ నాగరాజును కోరింది. అందుకు ఆయన రికార్డులు పరిశీలించి.. తామేమీ చేయలేమని స్పష్టం చేశారు. మనస్తాపానికి గురైన ప్రవల్లిక తహసీల్దార్ ఎదుటే వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ హఠాత్పరిణామంతో కార్యాలయ సిబ్బంది, ఇతరులు కంగుతిన్నారు. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.
రెవెన్యూ అధికారులపై సీపీఐ మండిపాటు
భూముల ఆన్‌లైన్‌లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేస్తున్న తప్పిదాలపై సీపీఐ మండల నాయకులు రామకృష్ణ మండిపడ్డారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న వారిని కాకుండా వేరొకరికి ఎలా భూమి కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళా రైతు ప్రవల్లికకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పలువురు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ స్తంభించడంతో సీఐ శివనారాయణస్వామి సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో సీపీఐ నాయకులు ఆందోళన విరమించారు. అనంతరం సీఐ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మహిళా రైతు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment