![FIR against Tribune reporter over Aadhaar data breach story - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/8/adhar.jpg.webp?itok=ZAUUzz2B)
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు సురక్షితం కాదంటూ ‘ద ట్రిబ్యూన్’ పత్రికలో వచ్చిన కథనంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆధార్ నియంత్రణ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఫిర్యాదు మేరకు.. ఆ కథనాన్ని రాసిన జర్నలిస్టు రచనా ఖైరా పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కేవలం రూ. 500లతో 10 నిమిషాల వ్యవధిలో ఒక ఏజెంట్ ద్వారా యూఐడీఏఐ వద్ద ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ వివరాలు పొందేందుకు అనుమతి సంపాదించామని ట్రిబ్యూన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. వ్యక్తుల పేర్లు, చిరునామా, పోస్టల్ కోడ్, ఫొటో, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వివరాలు చాలా సులువుగా అందాయని తెలిపింది.
యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ బీఎం పట్నాయక్ ఫిర్యాదు మేరకు ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు ఐటీ, ఆధార్ చట్టాల కింద ‘ద ట్రిబ్యూన్’ జర్నలిస్టు రచనా ఖైరాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ‘ఎవరి ఆధార్ వివరాలైనా పొందేందుకు డబ్బులిచ్చి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సప్ ద్వారా అనుమతి సంపాదించినట్లు మాకు సమాచారం వచ్చింది’ అని యూఐడీఏఐ ఫిర్యాదులో పేర్కొంది. జనవరి 5న ఫిర్యాదు అందగా.. అదే రోజున ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
ఎఫ్‌ఐఆర్ సంపాదించా: రచనా ఖైరా
ఈ వ్యవహారంపై రిపోర్టర్ రచనా ఖైరా స్పందిస్తూ.. ‘చివరకు నా కథనంపై యూఐడీఏఐ ఏదొకచర్య తీసుకున్నందుకు ఆనందంగా ఉన్నా.. నేను ఎఫ్‌ఐఆర్‌ను సంపాదించుకున్నా’ అని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌తో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో యూఐడీఏఐ స్పందించింది. పత్రికా స్వేచ్ఛతో పాటు భావ ప్రకటనా స్వేచ్ఛను తాము గౌరవిస్తామంది. అనధికారికంగా అనుమతి సంపాదించడం వల్లే ఫిర్యాదు చేశామంటూ తన చర్యను సమర్థ్ధించుకుంది.
ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన: ఎఫ్‌ఐఆర్ నమోదుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందో ళన వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకునేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. అక్రమాలపై విచారణ చేపట్టకుండా.. వాటిని వెలికి తీసిన వారిని శిక్షిస్తున్నారని కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ
తప్పుపట్టింది
Comments
Please login to add a commentAdd a comment