సాక్షి, అమరావతి: ఆధార్ డేటాను పోలీసు శాఖకు అందుబాటులోకి తేవాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. నేర పరిశోధన ప్రక్రియలో పోలీసులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా వేలిముద్రలకు సంబంధించిన డేటాను పోలీసు శాఖకు అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఆధార్ డేటాను పర్యవేక్షించే ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)ను ఇప్పటికే ఆదేశించింది.
యూఐడీఏఐ చట్ట ప్రకారం ఆధార్ డేటా అత్యంత గోప్యంగా ఉంచాలి. ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కీలక డేటా కావడంతో ఈ మేరకు కఠిన నిబంధనలను రూపొందించింది. ఆధార్ డేటాలోని ప్రాథమికమైన వేలి ముద్రలు, ఐరీష్ స్కాన్‌లను ఇతరులకు అందుబాటులోకి తేకూడదని ఆధార్ చట్టంలోని సెక్షన్ 29 (1) స్పష్టం చేస్తోంది. కాగా హైకోర్టు అనుమతితో కొంత పరిమిత డేటాను పోలీసులు పొందేందుకు సెక్షన్ 33 (1) అవకాశం కల్పిస్తోంది.
దాంతో నిర్దిష్టమైన కేసుల దర్యాప్తు కోసం పోలీసులు హైకోర్టు అనుమతితో ఆధార్ డేటాను పరిశీలిస్తున్నారు. కానీ నేర పరిశోధన తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ప్రధానంగా గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వలస కూలీలు, నిరుపేదలకు ఎలాంటి పత్రాలు ఉండడం లేదు. అందుకే ఆధార్ డేటాను తమకు అందుబాటులోకి తేవాలని వివిధ రాష్ట్రాల పోలీసు శాఖలు కేంద్ర హోం శాఖను కోరుతున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆధార్ డేటాను అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అందుకోసం అవసరమైతే చట్ట సవరణ కూడా చేయాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment